శ్రీనగర్‌లో స్త్రీశక్తి

2 Sep, 2020 01:25 IST|Sakshi

చారు సిన్హా

ఆమె తెలంగాణ కేడర్‌ 1996 బ్యాచ్‌ ఐ.పి.ఎస్‌ ఆఫీసర్‌. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలలో పని చేశారు. చిత్తూరులో పని చేసేటప్పుడు హెచ్‌ఐవి బాధితుల ఆస్తి హక్కు కోసం కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పని చేసేటప్పుడు చెంచుల వికాసానికి దోహదపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను కట్టడి చేశారు. బిహార్‌లో కూడా తన సత్తాను చాటిన చారుసిన్హా ఇప్పుడు శ్రీనగర్‌కు మొదటి సిఆర్‌పిఎఫ్‌ మహిళా ఐజిగా నియమితులయ్యి చరిత్ర సృష్టించారు. ఆమె ఆలోచనలు కొన్ని....

సీనియర్‌ ఐ.పి.ఎస్‌ ఆఫీసర్‌ చారు సిన్హా ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. ఆమె శ్రీనగర్‌లో నిలుచుని దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆమె సి.ఆర్‌.పి.ఎఫ్‌ శ్రీనగర్‌ సెక్టార్‌కు ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా శ్రీనగర్‌లో ఐజిగా ఒక మహిళ బాధ్యతలు తీసుకోవడం ఇదే ప్రథమం. అందునా ఉగ్రవాదుల గురి ప్రధానంగా ఉండే శ్రీనగర్‌ సెక్టార్‌లో ఒక మహిళా అధికారి ఈ సవాలును స్వీకరించడం మరీ విశేషం.

శ్రీనగర్‌ సి.ఆర్‌.పి.ఎఫ్‌ సెక్టార్‌ ‘బ్రయిన్‌ నిషత్‌’ అనే ప్రాంతంలో ఉంది. మూడు జిల్లాలు– బడ్‌గమ్, గండెర్‌బల్, శ్రీనగర్‌తో పాటు కేంద్రపాలిత లడాక్‌ కూడా దీని ఆపరేషనల్‌ జూరీ డిక్షన్‌ కిందకు వస్తాయి. ఈ అన్ని ప్రాంతాలలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే కీలక బాధ్యత ఇప్పుడు చారు సిన్హాది అవుతుంది. అక్కడి పాలనా వ్యవస్థతో, పోలీసులు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించాలి. 2005లో శ్రీనగర్‌ సి.ఆర్‌.పి.ఎఫ్‌ సెక్టార్‌ మొదలైతే పురుష అధికారులే ఐ.జిలుగా బాధ్యతలు నిర్వరిస్తూ వచ్చారు. చారు సిన్హా ఇప్పుడు వారి స్థానంలో రావడం అమె దక్షతకు, ధైర్య సాహాసాలకు ఒక నిదర్శనం.

హైదరాబాద్‌లో చదువుకుని
చారు సిన్హా హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఎనిమిదవ తరగతి నుంచి ఆమెకు దేశానికి సేవ చేయాలన్న ఒక ఆశయం మొదలైంది. హైదరాబాద్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజ్‌లో ఇంగ్లిష్‌ లిటరేచర్‌ డిగ్రీ చదివి, సెంట్రల్‌ యూనివర్సిటీలో పిజి చేశాక 1996లో ఐ.పి.ఎస్‌కు ఎంపిక అయ్యారు. ఒక మహిళగా కఠినమైన పోలీస్‌ ట్రయినింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘ఎన్నో గాయాలు, ఎముకలు చిట్లడాలు అయ్యాయి. అయినా హార్స్‌ రైడింగ్‌ దగ్గరి నుంచి అన్ని శిక్షణలను విజయవంతంగా పూర్తి చేశాను’ అంటారామె.

ట్రయినింగ్‌ అయ్యాక పులివెందుల ఏ.ఎస్‌.పిగా పని చేశారు. ఆ తర్వాత ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, మెదక్‌ ఇలా భిన్న ప్రాంతాలలో పని చేశారు. ‘నేను ఉద్యోగానికి చేరిన కొత్తల్లో ఇదంతా మగ ప్రపంచంగా ఉండేది. అందునా మీడియాకు ఇలా మహిళా పోలీస్‌ అధికారిని చూడటం ఇంకా కుతూహలంగా ఉండేది. నేను ఎక్కడికి వెళుతున్నాను... ఏం చేస్తున్నాను.. అని నా వెంటబడేవారు. ఒక దశలో నాకసలు పర్సనల్‌ లైఫ్‌ లేదా అని సందేహం కలిగేది. తర్వాత తర్వాత ఈ కుతూహలం తగ్గి వెసులుబాటు వచ్చింది’ అంటారామె.
మనిషా? నేరమా?
‘కొత్తల్లో నేను నేరాలను చూసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకునేదాన్ని. నిందితుల్లో, బాధితుల్లో ఎవరు చెప్పేది సత్యం అని డైలమాలో ఉండేదాన్ని. ఎందుకంటే చట్టానికి బాధ్యులుగా ఉన్నవారు తప్పు నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తుల జీవితాలు నాశనమైపోతాయి. ఆ తర్వాత వ్యక్తులను కాదు నేరాన్ని మాత్రమే చూడాలి. జరిగిన నేరానికి శిక్ష మీద దృష్టి పెడితే వ్యక్తులు అప్రధానమైపోతారు అని తెలుసుకున్నాను’ అంటారామె. తనకు తనదైన పని విధానం ఉందనుకుంటారు చారు సిన్హా. ‘నా కింద పని చేసే వివిధ స్థాయుల అధికారులు ఉంటారు. కొందరు నాకు అంతా తెలుసు అనుకుంటారు. మరికొందరు నాకేమీ తెలియదు అనుకుంటారు. నేను ఒక బాధ్యత తీసుకున్నాక మొదట చేసే పని నా కింద పని చేసే సిబ్బందిని అంచనా వేయడం. వారి స్వభావాలు నాకు అర్థమవుతాయి. ఎవరు ఏమిటో అవగాహన వచ్చాక వారికి ఎలాంటి పని చెప్పాలో చూసి చెబుతాను. సాధారణంగా నా అంచనా తప్పదు’ అంటారామె.

రైతుకు దొరికిన ఉంగరం
‘ఒక రైతు వ్యవసాయం చేసుకుని బతికేవాడు. అతనికి ఒకరోజు పొలంలో ఒక ఉంగరం దొరికింది. దానిని పెట్టుకుంటే తాను మాయం అయిపోతానని, ఎవరికీ కనపడడని అతనికి అర్థమైంది. వెంటనే అతడు దానిని పెట్టుకుని ఆ ఊరి భూస్వామి ఇంట్లో చొరబడి వజ్రాలు దొంగిలించి పారిపోతాడు. ఆ ఉంగరం వల్ల అతడు తనకు, ఆ భూస్వామికి చెడు తెచ్చాడు. ఆ ఉంగరాన్ని మంచికి ఉపయోగించి ఉంటే ఎంత బాగుండేది. పోలీసు విభాగాలలో ఉండే ప్రతి ఉద్యోగి అలాంటి ఉంగరం ఉన్నవాడి కిందే లెక్క. అధికారమే అతని ఉంగరం. దానితో మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఎప్పుడూ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. నా కలీగ్స్‌ అందరికీ కొత్త అధికారులకూ ఈ కథే నేను చెబుతూ ఉంటాను’ అంటారు చారు సిన్హా.

బిహార్‌లో, జమ్ములో
చారు సిన్హాకు తీవ్రవాద కార్యకలాపాల నిరోధం కొత్త కాదు. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పని చేశారు. ఒకసారి ఆమె కింద పని చేసే నలుగురు పోలీసు సిబ్బంది కిడ్నాప్‌కు గురైనప్పుడు అవతలి పక్షం పెట్టిన డిమాండ్స్‌కు చారు లొంగలేదు. పది రోజుల తర్వాత గత్యంతరం లేక ఆ సిబ్బందిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని చూసి ఆమెకు బిహార్‌ నక్సల్‌ కార్యకలాపాల నిరోధానికి అక్కడి సి.ఆర్‌.పి.ఎఫ్‌ సెక్టార్‌కు ఐ.జిగా నియమించారు. అక్కడ ఆమె పని తీరును గమనించాక జమ్ము ఐ.జిగా నియమించారు. అక్కడా ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను చూపింది. దాంతో జటిలమైన బాధ్యత అయిన శ్రీనగర్‌ ఐజి స్థానాన్ని అప్పగించారు. చారు సిన్హాను తెలిసినవారు ఆమె ఈ పని సమర్థంగా చేయగలరని అంచనా వేస్తున్నారు.

సత్యసాయిబాబా భక్తురాలు
చారు సిన్హా సత్య సాయిబాబా ఆరాధకురాలు. 19 ఏళ్ల వయసులో మొదటిసారి సత్య సాయిబాబాను కలిసి ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఆశీర్వచనాలు పొందానని చెబుతారు. పుస్తకాలు చదవడం, విహారం, పెంపుడు శునకాలతో ఆటలు ఇవి ఆమెకు ఆటవిడుపు సమయాలు. – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు