ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్‌

13 Jul, 2021 06:18 IST|Sakshi
ఆముదం నూనె కలిపిన మట్టి

చింతల వెంకట రెడ్డి (సీవీఆర్‌) ప్రయోగం సఫలం

భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్‌ సాయిల్‌)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్‌) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు.

వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్‌ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్‌ వివరించారు.
ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్‌ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు.

ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్‌ డీకంపోజర్‌)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్‌ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్‌ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్‌ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్‌ తెలిపారు.

చింతల వెంకట రెడ్డి
 

మరిన్ని వార్తలు