వేస్ట్‌ టు ప్లేట్‌ అంటూ తొక్కలతో రుచికరమైన వంటలు.. మెనూ అదిరింది

25 Nov, 2023 10:20 IST|Sakshi

వంట అందరూ చేస్తారు కానీ, ఎక్కువమంది తినేట్టు, నచ్చేటట్లు చేసిన వారు మాత్రమే చెఫ్‌గా మారతారు. మరింత రుచికరంగా... ఘుమఘుమలాడేలా వినూత్నంగా ఆహారాన్ని తయారు చేసిన వారు పాపులర్‌ చెఫ్‌గా పేరు తెచ్చుకుంటారు. ఇలా పాపులర్‌ అయిన అతికొద్దిమంది చెఫ్‌లలో ఒకరే దవీందర్‌ కుమార్‌. ప్రొఫెషనల్‌ చెఫ్‌గా యాభై ఏళ్లు పూర్తి చేసుకుని వేస్ట్‌ టు ప్లేట్‌’ ఐడియాతో ఇండియాలోనే గాక ప్రపంచంలోని చెఫ్‌లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

చెఫ్‌ డీకేగా పేరొందిన దవీందర్‌ కుమార్‌ ఢిల్లీ యూనివర్శిటీలో కామర్స్‌ డిగ్రీ పూర్తయ్యాక ప్రొఫెషనల్‌ డిగ్రీ చేయాలనుకున్నారు. అప్పట్లో పెద్దగా ప్రొఫెషనల్‌ కోర్సులు అందుబాటులో లేవు. తన స్నేహితుడు ఒబెరాయ్‌ హోటల్‌లో పనిచేస్తుండడంతో తను కూడా హోటల్‌లో చేరాలనుకున్నాడు. ఇంట్లో ఎవరికీ ఇష్టలేకపోయినప్పటికీ ‘ఒబెరాయ్‌ సెంటర్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’లో చేరాడు. మూడేళ్ల కిచెన్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన తరువాత.. ఒబెరాయ్‌ హోటల్‌లో పర్మనెంట్‌ ఉద్యోగి అయ్యాడు. దీంతో దవీందర్‌ చెఫ్‌ ప్రయాణం మొదలైంది.

ఫ్రెంచ్‌ భాషపై ఉన్న ఆసక్తితో ఫ్రెంచ్‌ వంటకాలను సైతం నేర్చుకునేవాడు. ఆసక్తి మరింత ఎక్కువ కావడంతో పారిస్‌లోని టెక్నిక్‌ డీ హోటలియర్‌లో రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. తనకిష్టమైన వంటలన్నీ నేర్చుకుంటూ, మరోపక్క చెఫ్‌గా రాణిస్తూ ఒబెరాయ్‌ గ్రూప్‌లో 12 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తరువాత 1985లో ‘లీ మెరిడియన్‌’లో టీమ్‌ సభ్యుడిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెరిడియన్‌ హోటల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గానేగాక, ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్‌ కలినరీ ఫోరమ్‌కు (ఐసీఎఫ్‌)కు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

తొక్కలతో...
చెఫ్‌గా ఎంతో అనుభవం ఉన్న దవీందర్‌ కుమార్‌ ఒకరోజు టీవీలో వరల్ట్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ చూస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న ఆహారంలో మూడు వంతులు తినకముందే వ్యర్థంగా పోతుంది. ఒక్కో హోటల్లో పండ్లు, కూరగాయల నుంచి తయారు చేసే వంటకాల్లో కనీసం ఐదు నుంచి పది శాతం వ్యర్థంగా పోతుంది’’ అని చెప్పారు.

ఇది చూసిన దవీందర్‌కు వ్యర్థాల నుంచి కూడా ఆహారం తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. అదే వేస్ట్‌ టు ప్లేట్‌. అనుకున్న వెంటనే పన్నెండు రెస్టారెంట్లు, ఐదు ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల నుంచి పండ్లు, కూరగాయ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు. అలా సేకరించిన వాటిని శుభ్రం చేసి రంగు, రుచికి తగ్గట్టుగా వేరు చేసి, పోషకాలతో కూడిన డిష్‌లను తయారు చేసి కస్టమర్లకు వేడి వేడిగా వడ్డించారు వీటిని తిన్నవారు ఇష్టపడడంతో వేస్ట్‌ టు ప్లేట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఫుడ్‌ వ్యర్థాల్లో కూరగాయ, పండ్లతొక్కలు, కొమ్మలు, కాడలు, విత్తనాలు కూడా ఉన్నాయి.

స్పెషల్‌ మెనూ..
 వ్యర్థాల నుంచి తయారు చేసే రుచికరమైన వంటలతో ఏకంగా స్పెషల్‌ మెనూని అందిస్తున్నాడు చెఫ్‌ డీకే. ఈ మెనూలో పనసపండు విత్తనాలు, బాదం హల్వా, సెలేరి, పాలకూర సలాడ్, యాపిల్‌ పల్ప్‌ పై, బ్రాకలీ, పుదీనా కాడల ముక్కల చట్నీ, జ్యూస్‌ తీయగా మిగిలిపోయిన బీట్‌రూట్‌తో రసం, క్యారట్‌ తొక్కల సలాడ్‌వంటివి ఉన్నాయి. ఈ డిష్‌లు రుచిగా, శుచిగానేగాక పుష్కలంగా పోషకాలు ఉండేలా వడ్డించడం విశేషం.

A post shared by Chef Davinder Kumar (@chefdavinderkumar)

కుక్‌ బుక్స్‌..
కొత్త వంటలని కనిపెట్టడమేగాక తను చేసే వంటలతో చాలా కుక్‌బుక్స్‌ను రాశాడు చెఫ్‌ డీకే. ఈ బుక్స్‌లో ‘కబాబ్‌ చట్నీ అండ్‌ బ్రెడ్‌’, జస్ట్‌ కబాబ్‌: ఫర్‌365 కబాబ్స్‌ అండ్‌ లీప్‌ ఇయర్‌’, సూప్స్, ఫోర్‌ సీజన్స్, సీజనల్‌ సలాడ్, సెకండ్‌ మీల్స్‌ వంటివి ఉన్నాయి.  పుస్తకాల్లో కొన్నింటికి గౌరవ సత్కారాలు కూడా అందుకున్నారు. లీ మెరిడియన్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా 7500 కేజీల కేక్‌ను తయారు చేసి లిమ్కాబుక్‌ రికార్డుల్లో నిలిచారు. అంతర్జాతీయ మెడల్స్‌తో పాటు, గోల్డెన్‌ హ్యాట్‌ చెఫ్‌ అవార్డు, భారత పర్యాటక మంత్రిత్వ శాఖతో బెస్ట్‌ చెఫ్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు, జాతీయ టూరిజం అవార్డులను అందుకున్నారు.        

      

A post shared by Trends9 (@trends9official)

మరిన్ని వార్తలు