చదువే మనిషికి నిజమైన సంపద..

5 Jul, 2021 07:21 IST|Sakshi

మంచి మాట 

‘కళాశాల ప్రాంగణం దాటిన తరవాత మనిషిలో మిగిలిన సారమే అసలైన చదువు’ అన్నాడు ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌. చదువు వల్ల పొందిన జ్ఞానం, విచక్షణ, వివేకం, వినయం, సంస్కారం అన్నీ జీవితంలో కనిపించాలి. చదువు మనిషికి ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. తన కాళ్ళ మీద తాను నిలబడటానికి చదువు దోహదం చేయాలి. అర్థవంతంగా జీవించటం నేర్పాలి. అది ఎంత చిన్న చదువైనా, పెద్ద చదువైనా ఆర్థిక భద్రతనిచ్చి, తద్వారా సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. చదువుకు శ్రద్ధ అవసరం. మనిషిని మనీషిగా చేసేది ఈ శ్రద్ధే!

చదువు, ప్రశ్నించే తత్వాన్ని, ప్రతీది తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగించాలి. ప్రశ్న జ్ఞానార్జనకు సంకేతం. మూఢ నమ్మకాలను, అంధవిశ్వాసాలను పోగొట్టి, తార్కిక జ్ఞానాన్ని ఇవ్వాలి. హేతుబద్ధంగా ఆలోచించటం నేర్పాలి. కేవలం పుస్తకాలలోని చదువే చదువు కాదు. నాలుగు గోడల మధ్య తరగతి గదిలో చదివే చదువు వ్యక్తి వికాసానికి సరిపోదు. పూర్వకాలంలో గురుకుల విద్యలో శిష్యులకు అవసరమైన విద్యలు నేర్పించాక, దేశాటనానికి పంపేవారు గురువులు. వివిధ ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడి చారిత్రిక విశేషాలను తెలుసుకోవటం చదువులో భాగమే! కొత్త ప్రదేశాలలో కొత్త వారితో పరిచయాలు పెంచుకోవటం, కొత్త భాషలు నేర్వటం కూడా జ్ఞానార్జనే!

19వ శతాబ్ది ప్రారంభంలో సంఘసంస్కర్తలందరూ స్త్రీల సమస్యలకు వారి అజ్ఞానం, అవిద్యే కారణమని భావించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ప్రాథమిక పాఠశాల చదువు, ఇంటి చదువుతోనే ఎంతో జ్ఞానం పొంది, తమ సమస్యలను తామే పరిష్కరించుకున్న పాత్రలను సాహిత్యంలో చూస్తాం. చదువు వ్యక్తిత్వాన్ని వికసింప చేసి, శీలనిర్మాణానికి దోహదం చేయాలి. బుద్ధిని వికసింప జేసి, తమ సమస్యలకు తామే పరిష్కారాన్ని తెలుసుకునే ఆలోచనాశక్తిని పెంచాలి.

చదువే మనిషికి నిజమైన సంపద. ఇది ఉపయోగిస్తుంటే తరిగి పోయేది కాదు. ఇచ్చేకొద్ది వృద్ధి పొందే సంపద. విద్యాసంపన్నులు ఎక్కడకు వెళ్లినా గౌరవం పొందుతారు. సమాజంలో ఉపాధ్యాయులకున్న విలువ, గుర్తింపు సాటిలేనిది. చదువు ఇది మంచి... ఇది చెడు– అనే వివేక చతురత నిస్తుంది. చదువుతోనే మనిషి సమాజం లో తానేమిటో నిరూపించుకునే చైతన్యాన్ని పొందాలి. వ్యక్తీకరణ సామర్థ్యాన్నివ్వాలి. మార్కులు, శ్రేణులు చదువుకు కొలబద్దలు కావు. ముఖ్యంగా ఇప్పటి చదువుల్లో వ్యక్తికరణ నైపుణ్యాలకే పెద్దపీట. చదువు నేర్వటంలో ప్రాథమిక, ప్రధాన అంశం వినటం. ఇందులో పట్టు సాధిస్తే, సందేహాలు కలగటం, ప్రశ్నించడం, జ్ఞానాన్వేషణ, జ్ఞానార్జన వంటివి సాధ్యమవుతాయి.

బాల్యం నుంచి తల్లితండ్రులు పిల్లలలో ఆరోగ్యకరమైన సొంత ఆలోచనా శక్తిని, వ్యక్తిత్వాన్ని చదువు ద్వారా పెంపొందించాలి. పెద్దయ్యాక, వాళ్ళేం కావాలనుకుంటున్నారో వాళ్లే నిర్ణయించుకోగలిగినంత ఆలోచనా స్థాయి వారికి రావాలి. నచ్చిన చదువు ఏదైనా సరే, వాళ్ళు అందులో ముందుంటారు. ఆ చదువును సార్థకం చేసుకోగలుగుతారు. ప్రతి వ్యక్తిలో అంతర జ్ఞానం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయటమే చదువు చేసే పని. చదువు పరమార్థం జ్ఞానం పొందటం. ఉద్యోగం, చదువుకు ఉన్న ఫలితాలలో ఒక అంశం మాత్రమే! చదువంటే ఉద్యోగం కోసమే అనే అభిప్రాయం విద్యార్థులలో ముందు తొలగాలి. చదువు, మానసిక, నైతిక శక్తులను పెంపొందిస్తుందని గుర్తెరగాలి.

చదువు జీవితానికి వెలుగు నిస్తుంది. గొప్ప మేధావులను తయారు చేస్తుంది. పూర్వం చదువును మూడవ కన్నుగా భావించారు. దేశంలో జరిగే అన్యాయాలను, ఘోరాలను, దౌర్జన్యాలను విద్యావికాసం ద్వారానే నిరోధించగలం. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలో చదువు పై ఆధారపడి ఉంటుంది. అందుకే, దేశం విద్యారంగం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే, ఒక స్థాయి వరకే ఎవరికైనా ఒక పాఠశాల అధ్యాపకుడు ఉంటారు. ఆ నిర్ణీత విద్యాభ్యాస సమయం ముగిసాక, మనిషి విశాల ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అప్పటి నుండి విశ్వంలో ప్రతివారి నుండి, ప్రతి అంశం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు.

చదువుకు అంతం ఉండదు. ఉద్యోగం వచ్చేసిందనో, పెళ్లయి పోయిందనో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టకూడదు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త పుస్తకాలను చదువుతూనే ఉండాలి. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే, మెరుగు పరచుకుంటూనే ఉండాలి. మనిషి నిత్య విద్యార్ధిగా ఉండాలి. చదువు... స్వేచ్ఛ అనే అద్భుతమైన ప్రపంచపు తలుపును తెరిచే తాళం చెవి లాంటిదని మేధావులు చెపుతారు. చదువు బానిసత్వం నుంచి, ఆత్మ న్యూనత నుంచి విముక్తి కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువులో సారాన్ని, విలువలను గ్రహించి, జీవితానికి అన్వయించుకోవాలి. మంచి సమాజ నిర్మాణానికి తాము చదువుకున్న చదువు ద్వారా సహకరించాలి. చదువు అనే బంగారు పళ్లెరం కాంతులీనటానికి జీవితానుభవం అనే గోడ చేర్పులు కావాలి.  
– డాక్టర్‌ చెంగల్వ రామలక్ష్మి

మరిన్ని వార్తలు