భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్‌ టీచర్‌గా సూపర్‌ క్రేజ్‌

16 Sep, 2023 11:54 IST|Sakshi

కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్‌ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి.  

బర్మాకు చెందిన మెర్లిన్‌ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. 

దుస్తులు కొనివ్వండి బాబూ...
ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్‌కిడ్‌’అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా సోషల్‌ సర్వీస్‌ చేస్తోన్న మొహమ్మద్‌ ఆషిక్‌ కంటపడింది మెర్లిన్‌. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్‌. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్‌ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్‌. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్‌ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్‌ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. 

యాచించ కూడదనీ...
మెర్లిన్‌ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్‌ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్‌ విత్‌ మెర్లిన్‌’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్‌ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్‌.

తన విద్యార్థులసాయంతో...
ఆషిక్‌ పోస్టు చేసిన మెర్లిన్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్‌ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్‌ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు.

కొంతమంది ఆమెతో వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్‌ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్‌ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది.  

A post shared by Merlin (@englishwithmerlin)

A post shared by Merlin (@englishwithmerlin)

మరిన్ని వార్తలు