సిజేరియన్‌ అయిన అమ్మలు చ్యూయింగ్‌ గమ్ నమిలితే‌...

6 Mar, 2021 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాఫీ విరేచనానికి చ్యూయింగ్‌ గమ్‌

సిజేరియన్‌ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు రోజుకు మూడుసార్లు చ్యూయింగ్‌ గమ్‌ నమిలితే పేగుల కదలికలు బాగా మెరుగుపడతాయంటున్నారు సైంటిస్టులు. సిజేరియన్‌ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతోపాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్‌ పోవడం, మలబద్దకం వంటి పేగులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్‌ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే.

అయితే కేవలం చ్యూయింగ్‌గమ్‌ నలమడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు. చ్యూయింగ్‌ గమ్‌ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిమ్యూలేషన్స్‌ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి.

ఇక రెండోది చ్యూయింగ్‌ గమ్‌ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్‌ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్‌ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు  హెచ్చరిస్తున్నారు.

చదవండి: చనుబాలు ఇస్తున్నారా? అయితే..

మరిన్ని వార్తలు