నది ఇచ్చిన కూతురు

24 Apr, 2021 00:54 IST|Sakshi
సోని యాదవ్‌, 2016 సెప్టెంబర్‌లో మహానదిలో కొట్టుకొని వచ్చిన అనంతరం ఒరిస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోని యాదవ్‌

లోకంలో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతాయి. కాని మొన్న ఒడిసాలో జరిగిన పెళ్లి ఒక నది పట్టుబట్టి చేయించినట్టుగా ఉంది. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి మహానదిలో మునిగిపోబోతే ఆ నది పరుపులా మారి 50 కిలోమీటర్ల దూరంలో ఒక బెస్తవాడికి ఆ అమ్మాయిని చేర్చింది. బెస్తవాడు పేదవాడు– హృదయానికి కాదు. పెంచుకున్నాడు. ఊళ్లో అందరూ ఆ అమ్మాయిని ‘మహానది అమ్మాయి’ అని దగ్గరకు తీశారు. ఐదేళ్లు గడిచాయి. ఊరంతా డబ్బు పోగేసింది. ఎం.ఎల్‌.ఏ కన్యాదాతగా కూచున్నాడు. ఓహ్‌... ఆ పెళ్లి ఎంత హృదయపూర్వకమైనది.

ఒడిస్సా, చత్తిస్‌గఢ్‌లలో పారే మహానది పొడవు దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుందిగాని సోని యాదవ్‌ విషయంలో ఆ నది 50 కిలోమీటర్లు చాల్లే అని అనుకున్నట్టు ఉంది. నదిలో కాళ్లు కడుక్కుంటూ పొరపాటున జారి మునిగిపోబోయిన ఆ అమ్మాయిని చత్తిస్‌గఢ్‌లోని రాయఘర్‌ నుంచి ఒడిసాలోని ఝర్‌సుగ్‌దా వరకూ చేర్చింది. అంత దూరం సోని యాదవ్‌ను ప్రాణాలతోనే ఉంచింది. చిత్రమే ఇది.

2016 సెప్టెంబర్‌లో మహానదిలో కొట్టుకొని వచ్చిన అనంతరం ఒరిస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోని యాదవ్‌

2016 సెప్టెంబర్‌ 14న చత్తిస్‌గఢ్‌లోని మహానది ఒడ్డున ఉండే చంద్రహాసిని దేవి ఆలయానికి 18 ఏళ్ల సోని యాదవ్‌ తన బంధువులతో వచ్చింది. అప్పటికే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. బంధువులే పెంచుతున్నారు. పూజ అయ్యాక నదిలో కాళ్లు కడుక్కుందామని దిగిన సోని పొరపాటున నదిలో పడిపోయింది. ప్రవాహ ఉధృతికి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయితే చేయాల్సింది అంతా మహానదే చేసింది.


పెంపుడు తల్లిదండ్రులతో సోని యాదవ్‌

సాయంత్రం నదిలో పడితే 12 గంటల పాటు చక్కగా సోనిని తేల్చుకుంటూ రాష్ట్రం దాటి పొరుగునే ఉండే ఒడిసాలోని ఝర్‌సుగ్‌దా జిల్లాలోకి తెల్లవారుజాముకు తీసుకెళ్లింది. ఆ జిల్లాలోని ‘కుశ్‌మేల్‌’ అనే గ్రామానికి చెందిన బెస్తవాడు సన్యాసి కాలో ఆ సమయంలో పడవతో మహానదిలో చేపలు పడుతున్నాడు. దూరంగా తేలుకుంటూ వస్తున్న మానవ ఆకారం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పడవను చేర్చి సోని యాదవ్‌ను పడవలోకి లాగాడు. హడావిడిగా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. సోని బతికింది. ‘నీళ్లల్లో పడ్డాక తల నీటిపైకి పెట్టి కాళ్లు ఆడించడమే నేను చేయగలిగాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు’ అని సోని అంది.

2021 ఏప్రిల్‌ 21న సోని వివాహం

ఆ అమ్మాయి కోలుకున్నాక సన్యాసి కాలో ఆమె వివరాలు కనుక్కొని ఇంటికి దింపుతానని అన్నాడు. కాని సోని నిరాకరించింది. తనకు ఎవరూ లేరని, ఇక్కడే ఉండిపోతానని అంది. సన్యాసి కాలో ఆ అమ్మాయిని పెంపుడు కూతురు చేసుకున్నాడు. ఊళ్లో ఈ సంగతిని అందరూ ఆహ్వానించారు. అంతే కాదు ‘మహానది అమ్మాయి’ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా ఆ చత్తిస్‌గఢ్‌ అమ్మాయి ఒడిస్సాలోని ఆ ఊరినే తన ఊరు చేసుకుంది. టైలరింగ్‌ నేర్చుకుంది. అందరి బట్టలూ కుట్టసాగింది.

పెళ్లీడు వచ్చిన సోనికి తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నాడు కాలో. కాని అతనికి ఉన్నదే అంతంతమాత్రం. ఊళ్లో అందరూ బెస్తవారే. వారి దగ్గర కూడా ఏముంటుంది కనుక. కాని అందరూ సంతోషంగా నడము బిగించి ఉన్నంత లో తలో చేయి వేసి అబ్బాయిని వెతికారు. కుర్రాడు పురుషోత్తం యాదవ్‌ భవన నిర్మాణ కార్మికుడు. స్థానిక ఎం.ఎల్‌.ఏకు ఈ విషయం తెలిసి తాను కన్యాదాతగా కూచుంటానని ముందుకు వచ్చాడు. ఏప్రిల్‌ 21న కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సోని వివాహం జరిగింది.

సోని అసలు బంధువులు, మారుతండ్రి బంధువులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అంపకాలు పెట్టే సమయంలో కాలో, అతని భార్య సోనిని సాగనంపుతూ కన్నీరు కార్చారు.

మహానది ఏమీ ఎరగనట్టుగా పారుతూ ఒడ్డును ఒరుసుకొని కొంత నురగను అక్షింతలుగా చల్లే ఉంటుంది.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు