Chikmagalur: చిక్‌మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం

18 Sep, 2021 08:52 IST|Sakshi

మనం ఏదైనా చేస్తే అది ప్రత్యేకంగా ఉండాలి. అలాంటిది మరొకటి లేదనేటట్లు కూడా ఉండాలి. అంతేకాదు... నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి వస్తువూ పర్యావరణానికి హాని కలిగించనిదై ఉండాలి. ఆ మెటీరియల్‌ అంతా భవనాన్ని కూల్చినప్పుడు తిరిగి మట్టిలో ఇట్టే కలిసిపోయేదై ఉండాలి... ఇది కర్నాటక, చిక్‌మగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కి వచ్చిన ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే చిక్‌మగళూరు, ఎఐటి కాలేజ్‌ రోడ్‌లో ఉన్న సన్యాట ఎకో రిసార్ట్‌.  

చూసి వద్దాం!
సోలార్‌ పవర్, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్, ఎర్త్‌ టన్నెల్స్‌తో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఎకో రిసార్టు నిర్మాణంలో ఇటుకల నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా తయారు చేశారు. పిల్లర్‌లకు కూడా ఇనుము ఉపయోగించలేదు. వర్షపు నీటి నిల్వ కోసం భూగర్భంలో యాభై వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకు ఉంది. బాత్‌రూమ్‌లో వాడిన నీటిని శుద్ధి చేసి టాయిలెట్‌ ఫ్లష్‌కు, మొక్కలకు చేరే ఏర్పాటు... ఇలా ఒక ప్రయోగమే జరిగింది. నాచురల్‌ ఎయిర్‌ కండిషనర్‌గా రూపుదిద్దుకున్న ఈ రిసార్ట్‌లో పదకొండు గదులున్నాయి. చిక్‌మగళూరు వాతావరణం వేడిగానే ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణంలో ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల మధ్యనే ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలతో ఈ ఎకో రిసార్టు చిక్‌మగళూరు పర్యాటక ప్రదేశాల జాబితాలో ఒకటైంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ రిసార్టులో బస చేయగలిగింది కొందరే, ఎక్కువమంది పర్యాటకులు ఈ రిసార్టును చూడడానికే వస్తుంటారు. రిసార్టు ఆవరణలో చిక్‌మగళూరు చుట్టు పక్కల తయారయ్యే హస్తకళాకృతుల స్టాల్స్‌ కూడా ఉంటాయి. చిక్‌మగళూరు టూర్‌లో చూడగలిగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో! అవి ఎంతెంత దూరాన ఉన్నాయో చూద్దాం.

ఇవన్నీ ఉన్నాయి!
బేలూరులో హొయసల రాజుల నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకలను చూడవచ్చు. ఇది చిక్‌మగళూరుకి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. బేలూరు చూసిన వాళ్లు హలేబీడును చూడకుండా ఉండలేరు. ఇది బేలూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది.
శృంగేరి మఠం... తుంగ నది తీరాన చిక్‌మగళూరుకు ఎనభై కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడే శారదా పీఠం కూడా ఉంది.
మహాత్మా గాంధీ పార్క్‌. ఇది చిక్‌మగళూరు బస్‌స్టాండ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరాన రత్నగిరి బోరెలో ఉంది.
బల్లాలరాయన దుర్గ ఫోర్ట్‌... ఇది డెబ్బై కిలోమీటర్ల దూరాన కొండ మీద ఉంది. కర్నాటక– ద్రవిడ నిర్మాణశైలుల సమ్మేళనం ఈ కోట.
కవికాల్‌ గండి వ్యూ పాయింట్‌... ఇది పద్దెమినిది కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి చిక్‌మగళూరులోని పర్యాటక ప్రదేశాలు కనువిందు చేస్తాయి. 
ఝరీ వాటర్‌ ఫాల్స్‌... దాదాపు తొంబై కిలోమీటర్ల దూరాన అత్తిగుండి గ్రామంలో ఉంది. తెల్లగా ఉండే నీటి ధారలను పాలతో పోలుస్తూ జలపాతానికి పాలధారను ఉపమానంగా చెప్పడం తెలిసిందే. అయితే ఇక్కడి వాళ్లు ఈ జలపాతం నీటిని మజ్జిగతో పోలుస్తారు. కాఫీ తోటల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. 
జెడ్‌ పాయింట్‌... ఇది అరవై కిలోమీటర్ల దూరాన పదిహేను వందల మీటర్ల ఎత్తు కొండ మీద ఉంది. ట్రెకింగ్‌ లవర్స్‌కు ఇది మంచి లొకేషన్‌.
కాఫీ మ్యూజియం... ఆరు కిలోమీటర్ల దూరాన దాసరహల్లిలో ఉంది. చిక్‌మగళూరు వెళ్లిన వాళ్లెవరూ ఈ కాఫీ మ్యూజియాన్ని చూడకుండా రారు. ఘుమఘుమలాడే కాఫీ గింజల పరిమళాన్ని ఆస్వాదిస్తూ... కాఫీ మొక్క నుంచి కాఫీ తయారయ్యే వరకు ప్రతి ప్రక్రియనూ చూడవచ్చు. 
ఖుద్రేముఖ్‌ నేషనల్‌ పార్క్‌... ఇది వంద కిలోమీటర్ల దూరాన ఉంది. ట్రిప్‌లో ఒక రోజును ఈ నేషనల్‌ పార్క్‌ కోసమే కేటాయించుకోవాలి.

ఏమి తినాలి? ఎక్కడ తినాలి?
చిక్‌మగళూరులోని మహారాజా రెస్టారెంట్‌లో మటన్‌ బిర్యానీ రుచి చూడాలి. 
బ్రేక్‌ఫాస్ట్‌కి టౌన్‌ క్యాంటీన్‌ ప్రసిద్ధి. ఇందులో వెన్న రాసిన క్రిస్పీ దోశె తిని మంచి కాఫీ తాగడం మర్చిపోవద్దు. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లో గులాబ్‌ జామూన్‌ ఇస్తారు.
మెసూర్‌ ఫుడ్స్‌లో... మైసూర్‌ మసాలా దోశె, మైసూర్‌ బజ్జీలు కన్నడదేశంలో పర్యటిస్తున్నామని గుర్తు చేస్తాయి.
చిక్‌మగళూరులో మాంసాహారులు, శాకాహారులతోపాటు వేగాన్‌లకు కూడా ప్రత్యేక రుచులు ఉంటాయి. 

మరిన్ని వార్తలు