వేసవి సెలవుల్లోనూ పిల్లలు నాలుగు గోడల మధ్యే ఉన్నారా?

11 May, 2022 10:28 IST|Sakshi

ఎండకాలం సెలవుల్లో కూడా పిల్లలు నాలుగు గోడల మధ్య ఉన్నారా? వారికి మీరు పాదలేపనం పూయడం లేదనే అర్థం. వారి చేతికి కథల పుస్తకం ఇవ్వండి. అందులో రాకుమారుడు వద్దన్నా ఉత్తరం వైపుకు వెళతాడు. పిల్లలూ వెళతారు. రాక్షసుడు ఉన్న చోటుకు గండభేరుండ పక్షి మీద చేరుకుంటాడు. పిల్లలూ చేరుకుంటారు. తెలివైన కొడుక్కే రాజ్యం ఇస్తానని రాజు అంటే ఆ తెలివి పుస్తకం చదివే పిల్లలకూ వచ్చి జ్ఞానరాజ్యం దక్కుతుంది. వేసవి అంటే పిల్లలకు ఆటలు పాటలతోపాటు  పుస్తకం కూడా. వారి చేతి నుంచి ఫోన్‌ లాక్కోండి. పుస్తకం ఇవ్వండి. 

ఇప్పటిలా పాడుకాలం కాదు. పూర్వం ఎండాకాలం సెలవులు ఎప్పుడొస్తాయా అని పిల్లలు కాచుక్కూచునేవారు. దేనికి? ఆడుకోవచ్చు. పాడుకోవచ్చు. కాని అసలు సంగతి కథలు ఎంత సేపైనా చదువుకోవచ్చు. అందుకే ఎదురుచూపు. పక్కింటి నుంచి, ఎదురింటి నుంచి, అద్దె పుస్తకాల షాపుల నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలజ్యోతి... ఇన్ని మేగజీన్లు... చాలక పాకెట్‌ సైజు పిల్లల నవలలు ‘మంత్రాల అవ్వ.. తంత్రాల తాత’, ‘భైరవ ద్వీపం’,‘కపాల మాంత్రికుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’... ఇవన్నీ చదవడం... చాలనట్టు మేజిక్‌ ట్రిక్కుల పుస్తకాలు, లెక్కలతో చిక్కులు, సైన్లు ప్రయోగాలు, సూపర్‌మేన్‌.. స్పైడర్‌మేన్‌ కామిక్స్‌... వీటన్నింటిలో కూరుకుపోయేవారు... ఊహల లోకాల్లో తేలిపోయేవారు. వేసవి కాలం మండే ఎండల కాలం అందరికీ. పిల్లలకు మాత్రం కథలు చదివే కాలం. పుస్తకాల్లో మునిగే కాలం.

సింద్‌బాద్‌... గలీవర్‌..
బాల్యంలో పుస్తకాలు చదివితే ఏమవుతుంది? సింద్‌బాద్‌.. గలీవర్‌ తెలుస్తారు. జీవితం అంటే ఉన్న చోటునే ఉండిపోవడం కాదని.. కదలాలని.. కొత్త ప్రపంచాలను చూడాలని... మనుషులను తెలుసుకోవాలని తెలుస్తుంది. అపాయాలు వచ్చినా విజయం వరిస్తుందనే ధైర్యం వస్తుంది. సింద్‌బాద్‌ సాహసాలు పిల్లల్ని ఉత్కంఠ రేపేలా చేస్తాయి. అతడు చేసిన సముద్ర యానాలలో ఎన్ని వింతలు. విడ్డూరాలు. సినిమా చూస్తే, గేమ్స్‌ చూస్తే వీలుకాని ఊహ, కల్పన చదవడం వల్ల పిల్లలకు వస్తుంది. వారి ఊహల్లో తామే సింద్‌బాద్‌లు అవుతారు. మత్స్యకన్యను చూస్తారు. రాకాసి సముద్రజీవితో తలపడతారు. ఇక గలీవర్‌ చేరుకునే లిల్లీపుట్‌ ల దేశం ఎంత వింత. చీమంత ఉన్నా వాళ్లు అందరూ కలిసి అపాయాన్ని ఎదుర్కొనాలని చూస్తారు. ఆ తర్వాత గలీవర్‌ మంచివాడని గ్రహిస్తారు. స్నేహితులను శత్రువులుగా పొరపడటం, శత్రువులను స్నేహితులుగా నమ్మడం ఈ పాఠాలు పిల్లలకు కథలే చెబుతాయి. అప్రమత్తం చేస్తాయి.

సమయస్ఫూర్తి
కథలు చదివితే సమయస్ఫూర్తి వస్తుంది. కఠినమైన సన్నివేశాలను కూడా సమయస్ఫూర్తితో దాటడం తెలుస్తుంది. మర్యాద రామన్న, బీర్బల్, తెనాలి రామలింగడు, షేక్‌ షిల్లీ, ముల్లా నసీరుద్దీన్, మర్యాద రామన్న వీరందరూ తమ కామన్‌సెన్స్‌ను ఉపయోగించే జటిల సమస్యలను ఛేదిస్తారు. పదహారు భాషలు తెలిసిన పండితుడు తన మాతృభాష కనిపెట్టమన్నప్పుడు తెనాలి రామలింగడు ఏం చేశాడు... ఒకే బిడ్డను ఇద్దరు తల్లులు నా బిడ్డంటే నా బిడ్డని కొట్లాడినప్పుడు మర్యాద రామన్న ఏం చేశాడు ఇవన్నీ పిల్లలకు తెలియాలి. అందుకు కథలు చదవాలి. ఇక చందమామలో చాలా కథలు పరీక్షలు పెడతాయి. ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు తెలివైన వారైతే వారికి ఉద్యోగం, రాచకొలువు, సింహాసనం దక్కుతుందనుకుంటే సాధారణంగా మూడోవ్యక్తే గెలుస్తాడు. అతని తెలివి పిల్లలకు తెలుస్తుంది. 

నీతి– బతుకునీతి
దేశదేశాల నీతి కథల భాండాగారం పిల్లల కోసం సిద్ధంగా ఉంది. మన పంచతంత్రం, అరేబియన్‌ నైట్స్, ఈసప్‌ కతలు... ఇవన్నీ నీతిగా బతకడం గురించి బతుకులో పాటించాల్సిన నీతి గురించి తెలియచేస్తాయి. బంగారు కడియం ఆశ చూపి గుటుక్కుమనిపించే పులులు, నమ్మించి మోసం చేసే గుంటనక్కలు జీవితంలో ఎదురుపడతాయని చెబుతూనే కలిసికట్టుగా ఉంటే వలను ఎగరేసుకుపోయి తప్పించుకోవచ్చని చెప్పే పావురాలను, వలను కొరికి ఉపయోగపడే స్నేహితులను చూపుతాయి. గుండె చెట్టు మీద ఉంది అని చావుతెలివి చూపి మొసలి నుంచి కాపాడుకునే కోతి పాఠం తక్కువది కాదు. నోర్మూసుకోవాల్సిన చోట నోరు మూసుకోకుండా తెరిచి ఆకాశం నుంచి కిందపడే తాబేలును చూసి ఎంతో నేర్చుకుంటారు. అత్యాశకు పోతే బంగారు గుడ్లు దక్కవని తెలుసుకుంటారు.

రాకుమారుని వెంట
ఎన్నో కతల్లో రాకుమారుడు సాహసాలు చేస్తాడు. పేదరాశి పెద్దవ్వ దగ్గర బస చేస్తే‘ఏ దిక్కయినా వెళ్లు కాని ఉత్తర దిక్కు మాత్రం వద్దు’ అంటుంది. రాకుమారుడు అటే వెళ్లి కష్టనష్టాలకు ఓర్చి విజయం సాధిస్తాడు. రిస్క్‌ అవతల కూడా అద్భుత విజయం ఉంటుంది అని ఈ కథలు చెబుతాయి. భట్టి విక్రమార్క కథలు తెగువను నేర్పిస్తాయి. ఎంతటి భయంకర మాంత్రికుణ్ణయినా ప్రాణం కనిపెట్టి తుద ముట్టించవచ్చని ఇతర కథలు చెబుతాయి.

కథలు చదివిన వారి తెలివి, భాష, వకాబులరీ, ఉచ్ఛరణ... ఇవన్నీ కథలు చదవని వారి కంటే ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్కూళ్లు తెరిస్తే ఎలాగూ ఆ పాఠాల్లో పడక తప్పదు. నెల రోజులు దాదాపు చేతిలో ఉన్నాయి.పిల్లల్ని పుస్తకాల లోకంలోకి తోయండి.

మరిన్ని వార్తలు