చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!

14 Nov, 2021 11:46 IST|Sakshi

‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్‌. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది.

సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది.

దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి.

తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు.

నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్‌ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు.

పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్‌ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్‌ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది?

ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది.

నవంబర్‌ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ.

చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్‌లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం.

బాలల వికాసమే సమాజ వికాసం.

– బాలల దినోత్సవం ప్రత్యేకం

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

మరిన్ని వార్తలు