మిరప సహా కూరగాయలు, అలంకరణ మొక్కలకూ కొత్త రకం తామర పురుగుల బెడద

23 Nov, 2021 11:03 IST|Sakshi

రసాయనిక పురుగుమందులను విచ్చలవిడిగా చల్లొద్దు

బయో మందులు వాడితే రసంపీల్చే పురుగుల తీవ్రత పెరుగుతుంది 

డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రకటన

మిరప రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న కొత్త రకం తామర పురుగులు మిరప పూలతో పాటు లేత మిరప కాయలను కూడా ఆశిస్తున్నట్లు డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. లక్షలాది హెక్టార్లలో సాంద్ర పద్ధతిలో సాగులో ఉన్న మిరప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. మిరప తోపాటు టమాటో, బంగాళదుంప, వంగ వంటి సొలనేసియే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలకు కూడా కొత్త రకం తామర పురుగులు సోకే ప్రమాదం వున్నందున అప్రమత్తంగా ఉండాలని డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది.

 గత ఏడాది జనవరి–ఫిబ్రవరిలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండలాల్లో మొట్టమొదటి సారిగా కొత్త రకం తామర పురుగులు మిరప పూలను ఆశిస్తున్నట్లు లాం లోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే గుంటూరు జిల్లాలో కొత్త రకం తామర పురుగు మిరప తోటలను ఆశించిందని లాం ఉద్యాన శాస్త్రవేత్తలు గమనించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌ తదితర జిల్లాల్లోని మిరప తోటలను తామరపురుగు ఆశించిందని సమాచారం.  

బెంగళూరులోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వ్యవసాయ సంబంధ పురుగు వనరుల జాతీయ బ్యూరో (ఎన్‌.బి.ఎ.ఐ.ఆర్‌.) శాస్త్రవేత్తలతో సంప్రదించిన తర్వాత ఇవి ‘త్రిప్స్‌ పార్విస్పైనస్‌’ అనే కొత్త రకం తామర పురుగులని గుర్తించినట్లు డా. వైఎస్సార్‌ హెచ్‌.యు. వైస్‌ ఛాన్సలర్‌ డా. టి జానకిరాం, పరిశోధనా సంచాలకులు డా. ఆర్‌.వి.ఎస్‌.కె. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ కొత్త రకం తామర పురుగులు ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. హవాయి, ఇండోనేషియా దేశాల్లో ఈ తామరపురుగులు సొలనేసియే కుటుంబానికి చెందిన మిరపతో పాటు టమాటో, వంగ, బంగాళ దుంప వంటి కూరగాయ మొక్కలను, అలంకరణ మొక్కలను కూడా ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

కొందరు రైతులు కొత్త రకం తామర పురుగులను చూసి ఎర్రనల్లి అని భావించి సంబంధిత మందులు వాడుతున్నారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డా. ఆర్‌.వి.ఎస్‌.కె. రెడ్డి తెలిపారు. బయో మందులు వాడితే రసంపీల్చే పురుగుల తీవ్రత పెరుగుతుందన్నారు. 

ప్రస్తుతం ఈ పురుగు ఆశించిన పొలాల్లో రైతులు భయాందోళనలో విపరీతమైన, విచక్షణారహితంగా పురుగుమందులను కొడుతున్నారు. తద్వారా పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల తాము సిఫారసు చేసిన పురుగుమందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయటం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చని డా. ఆర్‌.వి.ఎస్‌.కె. రెడ్డి వివరించారు. 

సందేహాలు తీర్చుకోవటం ఎలా?
ఈ సమస్య గురించి రైతులు మరింత సమచారం తెలుసుకోవాలంటే.. డా. వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని లామ్‌ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి – సీనియర్‌ శాస్త్రవేత్త డా. సి. శారద (94904 49466), శాస్త్రవేత్త డా. కె. శిరీష (99891 92223)లను అన్ని పని దినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాల్‌ చేసి మాట్లాడవచ్చు. 

రేపు వెబినార్‌
అధిక వర్షాల సందర్భంగా ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలపై ఈ నెల 24 (బుధవారం) ఉదయం 11 గం. నుంచి మ. 1.30 గం. వరకు డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం జూమ్‌ ఆప్‌ ద్వారా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. జూమ్‌ మీటింగ్‌ ఐ.డి.. 823 5000 1594 పాస్‌వర్డ్‌ – 863362. యూట్యూబ్‌ ద్వారా కూడా పాల్గొనవచ్చు.  

మిద్దె తోటల సాగుపై 3 రోజుల ఆన్‌లైన్‌ కోర్సు
ఇంటిపై కూరగాయలు, పండ్ల సాగులో మెలకువలు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల ప్రయోజనార్థం డిసెంబర్‌ 16–18 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో సర్టిఫికెట్‌ కోర్సును నిర్వహించాలని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విద్యా సంస్థ (ఇ.ఇ.ఐ.) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆసక్తి గల గృహిణులు, ఉద్యోగులు, యువత తమ ఇంటి నంచే కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా శిక్షణ పొందవచ్చని ఇ.ఇ.ఐ. సంచాలకులు డాక్టర్‌ ఎం. జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్లు డా. ఆర్‌. వసంత, డా. పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆన్‌లైన్‌ కోర్సు జరగనుంది. వంద మందికి మాత్రమే ప్రవేశం.
కోర్సు ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్‌ కోసం...
https://pjtsau.edu.in/www.eeihyd.org/ 
https://forms.gle/wPriDddKVao9Ecj16

ఆకాశ్‌ చౌరాసియా 5 రోజుల శిక్షణా శిబిరం
సేంద్రియ సేద్య పద్ధతిలో బహుళ అంతస్థుల వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ 14 జాతీయ అవార్డులు దక్కించుకున్న యువ రైతు శాస్త్రవేత్త ఆకాశ్‌ చౌరాసియా తెలంగాణలో 5 రోజుల ఆచరణాత్మక శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 11 నుంచి 15వ తేదీ వరకు మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లెలోని ‘ఐ.డి.వి.ఎం. కామ్యవనం’ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుంది. మల్టీ లేయర్‌ ఫార్మింగ్‌ సహా 11 అంశాలపై శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన ఆకాశ్‌ చౌరాసియా ఆరుతడి పంటల ద్వారా ఏడాది పొడవునా అధికాదాయం పొందే ఆచరణాత్మక మార్గాలపై శిక్షణ ఇవ్వటంలో ఆయన ప్రసిద్ధి పొందారు. 50 మందికే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనదలచిన వారు భోజనం, వసతి, శిక్షణ రుసుముగా రూ. 4 వేలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ తదితర వివరాల కోసం.. 94495 96039. 

- పతంగి రాంబాబు, సాగుబడి

చదవండి: డ్యామిట్‌!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప..

మరిన్ని వార్తలు