Cold Drink: 1.5 లీటర్ల కోల్డ్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..

7 Nov, 2021 13:03 IST|Sakshi

కొన్నిసార్లు అత్యుత్సాహంతో చేసే పనులు తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయి. ఓ వ్యక్తి ఎండవేడిని తట్టుకోలేక ఒకేసారి ఒకటిన్నర లీటర్ల కూల్‌డ్రింక్‌ తాగాడు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అసలేంజరిగిందంటే..

చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్‌ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోయిందని, గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారట. 

క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కడుపులో అధిక మోతాదులో గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. చికిత్స సమయంలో యువకుడి ఛాతీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో హెపాటిక్ ఇస్కీమియాకు గురయ్యాడు (అంటే లివర్ షాక్‌కు గురవ్వడం). ఫలితంగా అతనికి మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు. ఐతే గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ 18 గంటల చికిత్స తర్వాత మరణించాడని నివేదిక తెల్పింది. 

చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్‌ అరెస్ట్‌.. ఇంకా..

మరిన్ని వార్తలు