‘మీటూ’కి కొత్త వెర్షన్‌!

17 Apr, 2021 05:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం : దేవుడా! మళ్లీ ఇంకో మెసేజ్‌!!

‘నేను కూడా’ (మీటూ) అంటూ లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా బయటికొచ్చి చెప్పుకోవడం ఒక ఉద్యమంలా నాలుగేళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని నిందితులు ఆక్రోశించినా.. ‘ఎప్పుడు జరిగితేనేం.. జరిగిందా లేదా?’ అని కోర్టులు కూడా బాధిత మహిళలకు అండగా ఉండటంతో పదీ పదిహేనేళ్ల క్రితం తమపై జరిగిన లైంగిక వేధింపులపైన కూడా ఇప్పుడు మహిళలు పోరాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చైనా మహిళ తన బాస్‌తో మరో పదేళ్ల తర్వాత కాకుండా.. అక్కడికక్కడే, అప్పటికప్పుడే తేల్చేసుకోవడంతో ‘మీటూ’కి ఒక కొత్త ఉద్యమరూపం వచ్చినట్లయింది.

 పని చేసే చోట మహిళలపై వేధింపులు చైనాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. కనుక ఇది చైనా స్టోరీ అని పక్కన పడేసేందుకు లేదు. అక్కడి హైలాంగ్జియాన్‌ ప్రావిన్స్‌ లో ‘పేదరిక నిర్మూలన ప్రభుత్వ కార్యాలయం’ ఒకటి ఉంది. ఆ కార్యాలయ అధికారి వాంగ్‌. ఆయనే తన సిబ్బంది అందరికీ బాస్‌. ఝౌ అనే యువతి కూడా అక్కడ పని చేస్తోంది. ఝౌ అనేది ఆమె ఇంటి పేరు. వారిద్దరి అసలు పేర్లను బయట పెట్టవద్దని ప్రభుత్వం అక్కడి వార్తా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. జరిగిందేమిటో ఇప్పటికే పది లక్షల మందికి పైగా వైరల్‌ అవుతున్న ఓ వీడియోలో చూశారు కనుక వారి పేర్లతో పట్టింపు ఎవరికి ఉంటుంది! మొత్తానికి విషయం ఏమిటంటే బాస్‌ తన కింది మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించాడు.


దాంతో అతడిని ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ మధ్యలో ఏం జరిగిందన్నది మొత్తం 14 నిముషాల వీడియోగా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ప్రభుత్వం మాత్రం వాంగ్‌ని ‘లైఫ్‌ డిసిప్లిన్‌ కారణాల వల్ల’ తీసేస్తున్నట్లు ప్రకటించింది కానీ విషయం అది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక మహిళను వేధించిన కారణంగా ఒక అధికారిని తీసివేయవలసి వచ్చింది అని బహిరంగం గా ఒప్పుకోవడం చైనా ప్రభుత్వానికి పరువు తక్కువ. అందుకే డిసిప్లిన్‌ అనే మాటతో సరిపెట్టేసింది.
∙∙
వాంగ్‌ మొదట ఝౌ కు టెక్స్‌ట్‌ మెసేజ్‌ పంపడంతో ఇదంతా ఆరంభమైంది. అది అభ్యంతరకరమైన మెసేజ్‌. ఝౌ కూడా మెసేజ్‌తోనే అతనిని ఖండించవచ్చు. కానీ అలా చేస్తే మెసేజ్‌లతో సాగదీస్తాడని భయపడి, నేరుగా వెళ్లి చెప్పింది.. ‘బాస్, నాకు ఇలాంటివి నచ్చవు’ అని. అలా చెప్పి, ఇలా తన సీట్‌లోకి వచ్చేసరికి మళ్లొక మెసేజ్‌! బాస్‌ తన క్యాబిన్‌లో తను ఉండేవాడు, అక్కడి నుంచి మెసేజ్‌ల రూపంలో ఈమె ఫోన్‌లోకి వచ్చేసేవాడు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతోంది. చివరికి  విసుగెత్తిపోయిన ఝౌ.. నేరుగా అతడి క్యాబిన్‌లోకి వెళ్లింది. మామూలుగా వెళ్లలేదు. చేత్తో తుడుపు కర్రను తీసుకెళ్లింది. ‘‘నీకెంత చెప్పినా బుద్ధి లేదురా వెధవా..’అని ఆ కర్రతో ముఖం మీద, భుజం మీద బాది బాది వదిలింది. అతడేం మాట్లాడలేదు. కుర్చీలోంచి కదల్లేదు.

ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఝౌ అతడి టేబుల్‌ మీద ఉన్న సామగ్రినంతా విసిరిపారేసింది. అతడిపై ముఖంపై నీళ్లు కొట్టింది. తుడుచుకుంటున్నాడు, మళ్లీ ఆమెనే చూస్తున్నాడు. పద్నాలుగు నిముషాలు పాటు ఝౌ అతడిని తిడుతూనే, కొడుతూనే ఉంది. ఆ మనిషి చలించలేదు. మధ్య మధ్య ఝౌ, అతడు తనకు ఎలాంటి మెసేజ్‌లు పంపుతున్నాడో ఎవరికో ఫోన్‌ చేసి చెబుతోంది. ఆఫీస్‌ స్టాఫ్‌ ఎవరూ బాస్‌కి సపోర్ట్‌గా ఆమెను అడ్డుకోలేదు. ఒకరెవరో వీడియో షూట్‌ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తయ్యేసరికి అతడి పనీ అయిపోయింది. నిరుత్తరుడై, నిమిత్తమాత్రుడై అలా కూర్చుండిపోయాడు. ‘సారీ’ అనలేదు, ‘నేననలా చెయ్యలేదు’ అనీ అనలేదు. పైగా ‘అదంతా జోక్‌’ అని తుడిచేసుకున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని సీరియస్‌గా తీసుకుని సీట్‌లోంచి తొలగించింది.                

తుడిచే కర్రతో బాస్‌ను కొడుతున్న ఝౌ (వీడియో క్లిప్స్‌)

మరిన్ని వార్తలు