Chinmayi Tripathi: కవిత్వం పాడే అమ్మాయి.. తనకంటూ రాక్‌ బ్యాండ్‌.. దేశమంతా తిరుగుతూ!

17 Sep, 2022 08:22 IST|Sakshi
చిన్మయి త్రిపాఠి(PC: Chinmayi Tripathi)

కవిత్వం పాడే అమ్మాయి

తిలక్‌ని, కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని, జాషువాని పాడుతూ ఒక రాక్‌బ్యాండ్‌ ఉంటే ఎలా ఉంటుంది? తెలుగులో అలాంటిది లేదు. కాని చిన్మయి త్రిపాఠికి కవిత్వం అంటే ఇష్టం.

కబీర్‌ని, తులసీదాస్‌ని, ఆధునిక హిందీ కవులను ఆమె తన రాక్‌ బ్యాండ్‌ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది. ‘మ్యూజిక్‌ అండ్‌ పొయెట్రీ స్టుడియో’ పేరుతో చేస్తున్న ఈ కృషి చిన్మయిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

స్టేజ్‌ మీద ఇద్దరు ముగ్గురు వాద్యకారులు తప్ప ఎక్కువ మంది ఉండరు. చిన్మయి త్రిపాఠి తన భుజానికి ‘దోతార’ అనే సంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకుని పాడటం మొదలెడుతుంది. పాటంటే పాట కాదు. కవిత్వం. ఉదాహరణకు ప్రఖ్యాత హిందీ కవి వినోద్‌ కుమార్‌ శుక్లా రాసిన ‘మా ఇంటికి రాని అతిథుల కోసం’ అనే కవితను పాడుతుంది.

‘మా ఇంటికి కొందరు అతిథులు ఎప్పటికీ రారు.
కొండలు, నదులు, రంగు రంగు చెట్లు,
విరగపండిన పొలాలు
ఇవి ఎప్పటికీ రావు.

నేనే ఆ పొలాల వంటి మనుషులను కలవడానికి వెళతాను.
నదుల వంటి మనుషుల్ని, కొండల వంటి, కొండ కొసల వంటి,
చెట్లతో నిండిన అడవుల వంటి మనుషులను కలవడానికి
వెళతాను.

ఇదేదో నేను తీరుబడి చూసుకొని చేసే పని కాదు.
చాలా అత్యవసరమైన పని అన్నట్టుగా వెళ్లి కలుస్తాను.
మా ఇంటికి ఎప్పటికీ రాని అతిథుల కోసం నేనే బయలుదేరుతాను’

ఈ కవిత ఆమె పాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె సుశీల్‌ శుక్లా అనే కవి రాసిన ‘వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను పాడుతుంది. ‘ఎన్ని గూళ్లను అల్లి ఉంటావు. ఎన్ని గాలులను కుట్టి ఉంచాము. ఎన్ని నీడలను ముక్కలు ముక్కలు చేసి కింద పరిచి ఉంటావు... ఓ వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను చాలా అందంగా పాడుతుంది.

చిన్మయి త్రిపాఠిని చూస్తుంటే ఇలాంటి గాయని తెలుగులో గొప్ప గొప్ప కవిత్వాన్ని పాడేలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన చిన్మయి త్రిపాఠి ‘మ్యూజిక్‌ అండ్‌ పొయెట్రీ స్టుడియో’ స్థాపించి గాయకుడు, జీవన సహచరుడు అయిన జోయెల్‌ ముఖర్జీతో కలిసి హిందీ కవిత్వాన్ని దేశమంతా పాడుతోంది.

నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది
‘మాది ఢిల్లీ. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాను. కాని అందరిలా చదువులో కొట్టుకుపోయాను. ఎం.బి.ఏ చేసి ఉద్యోగం మొదలెట్టాక నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది. ‘స్పైస్‌ రూట్‌’ అనే ర్యాక్‌ బ్యాండ్‌ మొదలెట్టాను. కాని అది ఎక్కువ రోజులు నడవలేదు.

ఒకరోజు స్నేహితులతో మాట్లాడుతుంటే ఇవాళ్టి పాటల్లో సరైన కవిత్వమే ఉండటం లేదన్న చర్చ వచ్చింది. హిందీలో భారతీయ సాహిత్యంలో ఎంతో గొప్ప కవిత్వం ఉంది. దానిని మళ్లీ ఈ తరానికి వినిపిస్తే ఎలా ఉంటుంది... అనిపించింది.

ఈ విషయాన్ని నేనో క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో షేర్‌ చేసుకున్నాను. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వెంటనే రంగంలో దిగాను’ అంటుంది చిన్మయి త్రిపాఠి. 

చిన్మయి కూడా కవిత్వం రాస్తుంది. చాలా కవిత్వం చదువుతుంది. కనుక ఆ కవిత్వం మీద ప్రేమతో పాడటం వల్ల వెంటనే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. కబీర్‌ దాస్‌తో మొదలెట్టి హిందీలో ఆధునిక కవులు– హరివంశ్‌రాయ్‌ బచ్చన్, మహదేవి వర్మ, నిరాలా, ధర్మ్‌వీర్‌ భారతి... వీరందరి కవిత్వాన్ని తనే ట్యూన్‌ కట్టి పాడుతుంది. చిన్మయి గొంతు చాలా భావాత్మకంగా ఉంటుంది. అందుకని కవిత్వంలో ఉండే ఎక్స్‌ప్రెషన్‌ బాగా పలుకుతుంది.

‘మన దేశంలో ఉర్దూలో చాలా మంచి కవిత్వం వచ్చి మరుగున పడిపోయింది. ఇప్పుడు దానిని వెతికి తీసే ప్రయత్నంలో ఉన్నాను’ అంటుంది చిన్మయి. ముంబైలో ఉంటూ తన బ్యాండ్‌తో తిరిగే చిన్మయి లండన్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు అక్కడి ఇంగ్లిష్‌ ప్రేక్షకులకు హిందీ తెలియకపోయినా ఆ శబ్దాలకు తన్మయులయ్యారని చెబుతుంది చిన్మయి. తన ప్రదర్శనల్లో కశ్మీరీ, బెంగాలీ కవిత్వం కూడా పాడుతోంది చిన్మయి.

‘త్వరలో నేను భగవద్గీతను ఆధునిక సంగీత పరికరాలతో పాడాలని నిశ్చయించుకున్నాను. అదీ ఒక గొప్ప కవిత్వమే కదా’ అంటుంది చిన్మయి. మనకు ఘంటసాల పాడిన భగవద్గీత తెలుసు. ఆధునిక లయతో చిన్మయి ఎలా పాడుతుందో చూడాలి.

చదవండి: గూగుల్‌ను వీడి.. పర్యావరణ పరిరక్షణ కోసం!
నెదర్లాండ్స్‌ అమ్మాయి.. వ్యాన్‌నే ఇల్లుగా చేసుకుని! మన దేశమంతా చుట్టేస్తూ!

A post shared by Chinmayi (@chinmayitripathi)

మరిన్ని వార్తలు