యేసును మురిపించిన జక్కయ్య విశ్వాసం

14 Feb, 2021 07:40 IST|Sakshi

జీవం లేని బలమైన దుంగలు ప్రవాహంలో కొట్టుకుపోతే, జీవమున్న చిన్నారి చేపపిల్లలు ప్రవాహానికి ఎదురీదుతాయి. లోకంతో పాటు కొట్టుకుపోయే జీవితానికి జక్కయ్య అసలైన ఉదాహరణ. బోలెడు డబ్బు, సామాజిక ప్రాబల్యం జక్కయ్య సొంతం. జక్కయ్య అనే హెబ్రీ పేరుకు ‘పవిత్రుడు’ లేదా ‘నీతిమంతుడు’ అని అర్థం. జక్కయ్య ఎలాంటి వాడు కావాలని తల్లిదండ్రులు ఆశపడ్డారో వాళ్ళతనికి పెట్టిన ఈ పేరునుబట్టి అర్ధం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రబద్ధంగా, తలిదండ్రులు బహుశా అతన్ని ఎనిమిది రోజుల శిశువుగా ఉన్నపుడే సున్నతి కోసం, తాముండే యెరికోకు దగ్గరే గనుక, యెరూషలేము ఆలయానికి తీసుకళ్లారేమో. పన్నెండేళ్ళు పూర్తయినపుడు యూదులంతా చేసే ‘బార్‌ మిట్జ్వా’ అనే ఉత్సవాన్ని కూడా అతని తల్లిదండ్రులు ఆలయంలో అట్టహాసంగా చేశారేమో.

కానీ చివరికి అతని జీవితం మాత్రం వాటన్నింటికీ విరుద్ధమైంది. లోకానికి ఎదురీది మహావిశ్వాసి కావాల్సిన జక్కయ్య, లోకమలినానికి మారుపేరయ్యాడు( లూకా 19:7). ఇది అతని తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చిన పరిణామం. దేవుని ప్రేమను విస్మరించి, లోకంతో పాటు కొట్టుకోవడంలో అంతకాలం అతనికి ఆనందం, సౌలభ్యం దొరికింది. అయితే అంతమాత్రాన అతను దేవుణ్ణి ఏమీ విడిచిపెట్టలేదు. దేవుడతనికి జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాకపోతే జక్కయ్యకు లోకమే సర్వస్వమ్‌ అయ్యింది. అదీ అతని సమస్య, అదే మనలో చాలా మందికున్న సమస్య కూడా. 

అలా లోకపరంగా ఎంతో ఉత్తేజంతో జీవించాడు కాని ఆత్మీయంగా చాలా స్తబ్దంగా ఉండిపోయాడు. అంటే, జక్కయ్య తాజ్‌ మహల్‌ లాంటివాడన్నమాట.  తాజ్‌ మహల్‌ బాహ్యంగా కళ్ళు చెదిరేంత సుందరమైన, గొప్ప కట్టడమైనా లోలోపల కుళ్ళుకంపు కొట్టే సమాధే కదా!! రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే పనిలో జక్కయ్య తన అంతరాత్మను తాకట్టుపెట్టి అవినీతిపరుడు, ధనవంతుడు కూడా అయ్యాడు. ధనవంతుడవడం పాపం కాదు, కానీ దొడ్డిదారిలో ధనార్జన చెయ్యడం, దేవుని మీద కాకుండా, డబ్బు మీదే ఆధారపడి జీవించడం పాపం. నీతిమంతుడు ఏడుసార్లు పడ్డా తిరిగి పైకి లేస్తాడన్న బైబిల్‌ సూక్తి ప్రకారం (సామె 24:16), అంతగా పడిపోయిన జక్కయ్య, తన జీవితంలో ఒక దశలో ఇక తాను ఆత్మీయంగా తిరిగి పైకి లేవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యేసు వస్తున్నాడని తెలిసి యెరికోలో ఒక చెట్టెక్కి యేసు కోసం ఎదురు చూశాడు. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఇదొక మహత్తరమైన నిర్ణయం.

అలాంటి నిర్ణయాన్ని ప్రభువు కూడా గొప్పగా హర్షిస్తాడు. జక్కయ్యలో ఇన్ని లోపాలున్నా అతనిలో యేసుప్రభువు చూసిన ఒక గొప్ప సుగుణమేమిటంటే, అతను కేవలం యేసు కోసమే యేసు వద్దకొచ్చాడు. జనమంతా స్వస్థతలు, సంపదలు, సమస్యల పరిష్కారం కోసం యేసు వద్దకు తరలివస్తున్న రోజుల్లో, జక్కయ్య మాత్రం యేసే కావాలనుకొని, యేసు మాత్రమే తనకు చాలుననుకొని, యేసును ఆశ్రయించాడు, అలా యేసును జక్కయ్య, అతని కుటుంబం కూడా సంపూర్ణంగా పొందారు. తన డబ్బంతా పేదలకు, తనవల్ల అన్యాయం జరిగిన వారికి పంచి, డబ్బు కన్నా యేసే తనకు ముఖ్యమని, తాను డబ్బు మనిషిని కాదని, యేసుమనిషేనని ఆచరణలో రుజువుచేసుకున్నాడు, ఇదే అత్యున్నతమైన శ్రేణికి చెందిన విశ్వాసం. అందుకే జక్కయ్య అబ్రాహాము కుమారుడన్న బిరుదును ఏకంగా యేసు నుండే పొంది, తన విశ్వాసానికి ప్రభువు నుండే ప్రామాణికతను సంపాదించుకున్నాడు.      

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు