అందాల తారల క్రిస్మస్‌ గీతాలు

20 Dec, 2020 09:26 IST|Sakshi

సాహిత్యం  –   క్రిస్మస్‌ ప్రత్యేకం

డిసెంబర్‌ మాసం కోసం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు. రంజాన్‌ మాసంలాగే నెలరోజుల నుంచే వేడుకల కోసం సిద్ధపడుతుంటారు. చర్చీలన్నీ ప్రత్యేక ప్రార్థన గీతాలతో మార్మోగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా యువతీ యువకులు సంగీత వాయిద్యాలతో ‘క్రిస్మస్‌ క్యారల్స్‌’ పేరుతో ఇంటింటికీ తిరిగి పాటలు పాడుతారు. ‘హ్యాపీ క్రిస్మస్‌! మెరీ క్రిస్మస్‌!’ అంటూ జింగిల్‌ బెల్స్‌లా ప్రతిధ్వనిస్తుంటారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెబుతారు. వాతావరణమంతా క్రిస్మస్‌ గుబాళింపులతో చలికాలపు రాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ధనిక దేశాలు ఉత్సవాలను ఎంత ఆడంబరంగా జరుపుకున్నా, భారతదేశంలోని దళితవాడలు కూడా ఉన్నంతలో ఘనంగానే పండుగ జరుపుకుంటాయి. తమ తమ పేటల ముందు పోటీలు పడుతూ పెద్ద పెద్ద నక్షత్రాలు అలంకరిస్తారు. వాటి ప్రభలు నలువైపులా ధగధగలాడుతూ ఉంటాయి. ఈ సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కన్నుల పండుగలా కనిపిస్తుంది.

క్రిస్మస్‌ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది పాటలు. విశ్వమంతా క్రిస్మస్‌ జరుపుకునే రోజుల్లో వారి వారి భాషల్లో హుషారుగా పాటలు పాడుకుంటారు. పారవశ్యానికి లోనవుతారు. తెలుగులో కూడా గొప్ప క్రిస్మస్‌ సాహిత్యం ఉంది. ఏ మతానికైనా సాహిత్యమే ప్రాణాధారం. అవి భజనలు అయినా, స్తుతి గీతాలైనా భక్తుల్ని, శ్రోతల్ని ఆకట్టుకుంటాయి. క్రైస్తవమతం తెలుగు ప్రాంతాల్లో పాదం మోపాక ఇక్కడి భాష సంస్కృతులతో, సంగీతాలతో మేళవించిన ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ ఆవిర్భవించాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణా ఏర్పడ్డాక  ‘ఆంధ్ర’ శబ్దానికి బదులు, ‘తెలుగు క్రై స్తవ కీర్తనలు’ అని పేరు మార్చుకున్నారు. అయితే తొలినాటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథాన్ని 1866లో ప్రథమ విదేశీ తెలుగు వాగ్గేయకారుడు విలియం డాసన్‌ ప్రచురించాడు.

అతడు అచ్చం పదహారణాల తెలుగువాడిలా వేషంకట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చిడతలు వాయిస్తూ భక్తి పారవశ్యంలో శ్రీకాకుళం వీధుల్లో తన స్వీయ సంకీర్తనలు పాడేవాడు. మచ్చుకి ఒక పాట వినండి. అతడి భాషా పటిమ మనల్ని అబ్బురపరుస్తుంది. విలియం డాసన్‌.78వ కీర్తన.

పల్లవి: యేసు భజనయే మనలను
ఆ సుగతికి దీయు – జనులారా
దాస జనులు జేయు, పలు
దోసములు మోయు
చరణం: అక్షయ కరుణేక్ష భువన
రక్షణ ఖల శిక్షా
ధ్యక్ష బుధ పక్ష కృత
మోక్షమను దీక్షన్‌
రెవరెండ్‌ విలియం డాసన్‌ విదేశీయుడైనప్పటికీ ఇతడి శబ్దాలంకార ప్రావీణ్యం ఆశ్చర్యపరుస్తుంది. నమ్మశక్యం కాని నిజమేమిటంటే ఇతడే తొలి తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. ఈయన తర్వాతే పురుషోత్తము చౌధరి డాసన్‌ దొరతో కలిసి ఎన్నో కీర్తనలు రాయడం గమనించాల్సిన అంశం. ఇద్దరూ సమకాలీనులే. అయితే, ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. ‘చౌధరి’ కులవాచకం కాదు. ‘చౌ’ అంటే æనాలుగు. ‘ధరి’ అంటే భూమి. నాలుగు పరగణాల నేలకు అధిపతిని ఉత్తరభారతంలో ‘చౌధరి’ అని పిలుస్తారు. ఉదా: బాబూ ఖాన్‌ చౌధరి, సలీల్‌ చౌధరి. అయితే పురుషోత్తముడు బెంగాలీ బ్రాహ్మడు. తెలుగువాడు కాదు. ఒడిశాకు వలస వచ్చినవాడు. బహుభాషా కోవిదుడు. క్రీస్తు భక్తుడు. ఆ తరువాత కాలంలో 1893లో విలియం డాసన్‌తో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం తేవడంలో కీలక పాత్ర నిర్వహించాడు.
∙∙ 
ఇప్పటి ఆధునిక సంగీతపు హోరులో పాటల భావం సరిగా వినిపించడంలేదు. పాత కాలంలోనైతే క్రీస్తు జయంతి సందర్భంగా ఏ చర్చిలో విన్నా తెలుగు కీర్తనలు వినబడుతూ ఉండేవి. (109) ఎన్‌. డీ. ఏబెల్‌ గారు రచించిన ఈ కీర్తన ఎంతో ప్రసిద్ధమైనది.
‘చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వజనాంగామా
సంతస మొందుమా’
బిలహరి రాగంలో త్రిపుట తాళంలో శాస్త్రీయంగా పాడుకునే ఈ కీర్తన ఈనాటికీ చెక్కు చెదరలేదు. చెవులకు ఇంపు కలిగించడం మానలేదు. అలాంటిదే మరోగీతం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల లోనిదే, వరుస సంఖ్య 112.
‘రక్షకుండుదయించి నాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారె గొల్ల బోయలార
తక్షణమే బోయిమనని
రీక్షణ ఫల మొందుదము
చ: దావీదు వంశమందు 
ధన్యుడు జన్మించినాడు
దేవుడగు యెహావా మన
దిక్కుచేరి చూచినాడు’
మధ్యమావతి రాగంలోఅట తాళంలో పుట్టిన ఈ ప్రఖ్యాత క్రిస్మస్‌ కీర్తనకారుడు పందొమ్మిదో శతాబ్దపు మోచర్ల రాఘవయ్య. మరో ప్రసిద్ధ క్రీస్తు జనన విశేష గీతాన్ని (121) కొమ్ము కృప రాసింది.

‘శ్రీ యేసుండు జన్మించె రేయిలో– నేడు
పాయక బెత్లేహేము యూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున– నిమ్మాను యేలనెడి నామమందున.’

ఈ విఖ్యాత గీతం కర్ణాటక ముఖారి రాగంలోనూ అట తాళంలోనూ లయాన్వితంగా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఇద్దరు ముగ్గురు స్త్రీ కీర్తనకారులుండడం గమనించవలసిన అంశం. ఒకరు పైగీతం రాసిన కొమ్ము కృప. మరొకరు వేశపోగు గుల్బానమ్మ (గుల్‌+బానో+అమ్మ). పరిశోధన దృష్టితో పరిశీలిస్తే మొట్టమొదటి క్రైౖస్తవకీర్తన రాసిన తొలి తెలుగు క్రైౖస్తవకీర్తనకారిణి వేశపోగు గుల్బానమ్మగా గుర్తించాలి. ఇక మూడవ గీత రచయిత్రి పిల్లి విజయ చార్లెస్‌. ఈమె పేరు ఈ మధ్యనే పరిష్కరణ ప్రతిలో చేర్చారు.
∙∙ 
క్రైౖస్తవమతం లేదా మార్గం తెలుగు ప్రాంతాల్లో ప్రవేశించిన తరువాత 1746లో బెంజిమన్‌ షుల్జ్‌ ‘నూరు జ్ఞాన వచనాలు’ అనే తొలి తెలుగు క్రైౖ స్తవ పుస్తకం ప్రచురించాడు. ఇదే తెలుగులో అచ్చయిన మొదటి గ్రంథం. చాలాకాలం అజ్ఞాతంగా ఉండిపోయింది. 
కొన్ని శతాబ్దాల తరువాత వాసిరెడ్డి పద్మ, సన్నిధానం నరసింహ శర్మ (సేకరణకర్త), ఎండ్లూరి సుధాకర్‌ సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. 2006లో ఈ గ్రంథాన్ని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు రాజమండ్రి సమీపంలో ఉండే మధురపూడి విమానాశ్రయంలో ఆవిష్కరించారు. సాహిత్య చరిత్రలో అదొక మరపురాని సంఘటన.ఈ గ్రంథాన్ని కె.ఎన్‌. వెస్లీ ప్రచురించడం విశేషం.

జర్మన్‌ సౌవార్తికుడు (మిషనరీ) బెంజిమన్‌ షుల్జ్, ఇద్దరు తెలుగు స్వర్ణకారుల చేత అచ్చులు పోయించి ‘నూరుజ్ఞాన వచనాలు’ జర్మనీ దేశంలో ప్రచురించాడు. అప్పటికింకా ప్రెస్‌ రాలేదు, ‘వావిళ్ళ’వారు కూడా  పుట్టనేలేదు. ఈక్రమంలో విలియం కేరీ అనే మరో సౌవార్తికుడు1818లో మొట్టమొదటిసారి ‘పరిశుద్ధ గ్రంథం’ పేరుతో తెలుగు బైబిల్‌ తీసుకువచ్చాడు. ఆ తరువాత చాలా బైబిళ్ళు తర్జుమా చేయబడ్డాయి. ఈనాటికీ ఎంత పేద క్రైస్తవుల ఇంట్లోనైనా ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనల పుస్తకం, తెలుగు బైబిల్‌ ఖచ్చితంగా ఉంటాయి. ఇవే తమ ఆస్తులుగా ఆ విశ్వాసులు భావిస్తూ ఉంటారు.
∙∙ 
ఎందరో గీతరచయితలు అజారమరమైన కీర్తనలు రచించి ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనలకు తెలుగు శోభను సంతరించారు. కథోలిక (కాథలిక్‌) గీతాలు కూడా విశేష ప్రాముఖ్యాన్ని పొందాయి. 
క్రిస్మస్‌ గీతాల వస్తురూపాలన్నీ క్రీస్తు జన్మదిన విశేషాల మీదే ఆధారపడి ఉంటాయి. అట్లా అని ఇతర ప్రక్రియలు లేవా అంటే చాలానే ఉన్నాయి. తెలుగు క్రైౖ స్తవ సాహిత్యానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రబంధాలు, కావ్యాలు, నాటక నాటికలు, గేయ మాలికలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం గుర్రం జాషువ 1921లో ‘చిదానంద ప్రభాతము’ అనే క్రిస్మస్‌ నాటకం సంప్రదాయ పద్ధతిలో రాశాడు.’క్రీస్తు చరిత్ర’ (1964) అనే కావ్యం కూడా వెలువరించాడు. ఈ కావ్యానికి 1965లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అటు నాటకానికి, ఇటు కావ్యానికి దళిత క్రై స్తవుడిగా జాషువాయే ‘ఆదికవి’ అనడంలో అనౌచిత్యం లేదు.
మళ్లీ క్రిస్మస్‌ గీతాల దగ్గరికి వస్తే తొలినాటి పాటలన్నీ జర్మన్‌లోంచో, ఆంగ్లంలోంచో అనువాదం చేసుకున్నవే. వీటి స్వరగతులు కూడా యథాతథంగా ఉంటాయి. అందరికీ తెలిసిన ఈ ఉభయ భాషల గీతం పరిశీలించండి.
"Silent night, ho-ly night
All is calm, all is bright
Round you virgin mother and child
Holy infant so tender and mild 
Sleep in heavenly peace"

‘శుద్ధ రాత్రి! సద్దణంగ
నందరు నిద్రపోవ
శుద్ధ దంపతులే మేల్కొనంగా
బరిశుద్ధుడౌ బాలకుడా!
దివ్య నిద్ర పోమ్మా!
దివ్య నిద్ర పోమ్మా!!
ఈ ప్రపంచ ప్రసిద్ధి పొందిన గీతాన్ని అన్ని ఖండాల ప్రజలు తమ తమ భాషల్లో భావ గాంభీర్యంతో, ఏక కంఠంతో పియానో శ్రుతులతో అత్యంత ప్రేమగా పాడుకుంటారు.
క్రిస్మస్‌ రోజుల్లో ఏ క్రైౖస్తవ గృహాన్ని సందర్శించినా సందడే సందడి. అతిథులతో ఆత్మీయులతో, రకరకాల కేకు రుచులతో పిల్లలూ పెద్దలు క్రిస్మస్‌ తాతలతో కేరింతలు కొడుతూ ఉంటారు. బాలక్రీస్తు గీతాలకు తన్మయులవుతారు. ఆకాశం రంగులీనుతూ ధగధగా మెరిసిపోతున్నపుడు ఎక్కడి నుంచో ‘నడిపించు నా నావ’, ‘మార్గము చూపుము ఇంటికి/నా తండ్రి ఇంటికి’ లాంటి పాటలు రాసిన ప్రసిద్ధ గీతరచయిత రెవ.డా.ఎ.బి మాసిలామణిగారి’ అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో/ అవతార మూర్తి యేసయ్యకీర్తి అవని జాటుచున్‌’ అనే గీతం విన్నప్పుడు మనం కూడా ఆ ఆనందసముద్రంలో తేలిపోతుంటాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మమత, సమత, మానవత ప్రకటించాడు. ‘నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించ’మని గొప్ప శాంతిసందేశాన్ని అందించి సిలువ మీద నెత్తుటి కొవ్వొత్తిలా కరిగిపోయాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి అత్యవసరమైనది ప్రేమ. ఆ ప్రేమమయుని జన్మదినమే క్రిస్మస్‌.
-ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌

మరిన్ని వార్తలు