నేను ప్రేమించిన యేసు.. మహాత్మ గాంధీ సందేశం

19 Dec, 2021 16:36 IST|Sakshi

క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని.  ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమని చూపిస్తూ ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు.

లండన్‌లో 1931 డిసెంబర్‌లో జరిగిన రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన గాంధీజీ తన బృందంతో సముద్రమార్గంలో ఇండియాకి తిరిగి వస్తూ ‘క్రిస్మస్‌’ రోజున చేసిన ప్రసంగమిది. ప్రతిరోజూ ఆయన ఉదయం చేసే ప్రార్థనలో పాల్గొనే కొందరు ఆరోజు ఆయన్ని జీసస్‌ గురించి మాట్లాడమని కోరడంతో... గాంధీజీ మాట్లాడారు. అదే రోజు ఓడలో వున్న అసోసియేట్‌ ప్రెస్‌ ఆఫ్‌ అమెరికా ప్రతినిధి మిస్టర్‌ మిల్స్‌ ఆ ప్రసంగ పాఠం తనకు చెప్పమని అడిగి రాసుకున్నారు. అదే వారం అది వ్యాసంగా ‘యంగ్‌ ఇండియా’, ‘హరిజన్‌’ పత్రికల్లో వచ్చింది. ‘గాంధీస్‌ క్రిస్టమస్‌ సెర్మన్‌’ శీర్షికతో   1932, జనవరి7న ‘ది గార్డియన్‌’ పత్రికలో వచ్చింది. మొదటిసారి దీని తెలుగు అనువాదం ‘సాక్షి’ పాఠకుల కోసం..  

ఒక హైందవ మతస్థుడనైన నేను యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన బోధల గురించి ఎలా తెలుసుకున్నానో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆశిస్తున్నాను. దాదాపుగా నలభై ఐదేళ్ళ కిందటే నాకు ‘పరిశుద్ధగ్రంథం’తో పరిచయం అయింది. హోటల్‌లో పరిచయమైన నా  స్నేహితుడి ప్రోత్సాహం వల్లే ఇదంతా జరిగింది. పరిశుద్ధగ్రంథాన్ని మొదటిసారి చదివినప్పుడు నాకు పాత నిబంధన గ్రంథం మీద అంతగా ఆసక్తి కలగలేదు. కానీ, ఎప్పుడైతే నేను కొత్త నిబంధన చదవడం మొదలుపెట్టానో నాకు క్రీస్తు బోధల మీద ఒక అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా ‘కొండ మీద ప్రసంగం’ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ప్రసంగం చిన్నతనంలో నేను నేర్చుకున్న విలువలని గుర్తు చేసింది. అది నా జీవన విధానానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. 

వేరే మతస్థుడనైన నాకు ఆ ప్రసంగం అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చును. కానీ ఇది చెడుశక్తులతో సహా ఎవరికీ హాని కలిగించనిది. దీన్ని చదివాక నేను తెలుసుకున్నదేమిటంటే, యేసుక్రీస్తు ఒక కొత్త ధర్మాన్ని బోధించడానికి వచ్చారని. నిజానికి ఆయన తాను కొత్త ధర్మాన్ని ఇవ్వడానికి రాలేదు అని చెప్పినప్పటికీ, పాతనిబంధనలోని మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరణ సాధ్యమైనరీతిలో సరళతరం చేయడానికి ఆయన వచ్చారు. కంటికి కన్ను, పంటికి పన్ను చట్టం కాకుండా, ఒక అంగీ అడిగితే రెండు అంగీలు ఇవ్వడం, ఒక మైలు తోడు రమ్మంటే, రెండు మైళ్ళు వెళ్ళమనే సహృదయతను ఆయన బోధించారు. ఈ మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ బాల్యంలోనే నేర్చుకోవడం చాలా అవసరమని నేను భావించాను.

చిన్నతనంలో క్రైస్తవం అన్నా, క్రైస్తవులు అన్నా నాకొక దురభిప్రాయం ఉండేది. వారికి ఒక చేతిలో మద్యం, మరో చేతిలో మాంసం ఉంటాయని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను ‘కొండ మీద ప్రసంగం’ చదివానో, వారిపట్ల నాకున్న ఈ చెడు అభిప్రాయం పటాపంచలయ్యింది. ఆ తరువాత, దేవునికి నిజంగా భయపడే నా క్రైస్తవ స్నేహితులు కొందరు క్రైస్తవంపై నాకున్న సదభిప్రాయాన్ని మరింత పెంచారు. క్రైస్తవ జీవితం చాలావరకు ‘కొండ మీద ప్రసంగం’లో ఇమిడి ఉంది. ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని కోరుకున్నట్లయితే అతను యేసుక్రీస్తు ‘కొండ మీద చేసిన ప్రసంగం’లోని అంశాలను నిజాయితీగా ఆచరిస్తే చాలు. నా జీవితంలో నేనెన్నడూ యేసుక్రీస్తు  ఉనికిని గురించి సందేహించలేదు.

ఒకవేళ ఎవరైనా ఆయన అసలు ఇక్కడ జన్మించలేదని నిరూపించినా, నేను ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వను. నాలుగు సువార్తలు రాసిన వ్యక్తులు, వారికి క్రీస్తుతో ఉన్న సాన్నిహిత్యం, వారు ఆయనను చూసిన విధానాన్ని బట్టి ఆయనని వారు వివరించారు. కానీ, నాకు మాత్రం ‘కొండ మీద ప్రసంగం’ మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని చదివి, అర్థం చేసుకున్నాక– నేను తెలుసుకున్నదేమిటంటే క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమను చూపిస్తూ ప్రతీకారం, ఈర‡్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఆటంకాల్ని అధిగమిస్తాడు. ఇటువంటి జీవన విధానం అవలంబించడం ఒకింత కష్టంగానూ, ఎదుటివారికి అర్థం కానట్లుగానూ ఉంటుంది. 

దీన్ని కేవలం మనసుతో మాత్రమే చూడగలం. విషాదమేమిటంటే ఈ విధమైన క్రైస్తవం చాలామందికి అర్థం కాకుండా ఉంది.  దేవుని దయ వలన పరిశుద్ధగ్రంథం కొందరు విధ్వంసకారుల నుంచి భద్రపరచబడింది. బ్రిటిష్‌ వారు, ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ వారు పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భాషల్లో తర్జుమా చేశారు. ఆ తర్జుమాలు సమయం వచ్చినప్పుడు, వాటి ఉద్దేశాన్ని నెరవేర్చాయి. యేసుక్రీస్తు బోధించిన ఈ అంశాలను మనం ఆచరించకపోతే, రెండువేల సంవత్సరాల పాటు ఉన్న ఈ సజీవ నమ్మకానికి అర్థం లేనట్లే. మనం పాడుకునే ‘పరలోకమందున్న దేవునికి సమస్త మహిమ, భూమి మీద ఆయన భక్తులకి సమాధానం కలుగును గాక...’ అనే పాటలో ఉన్నట్లుగా దేవునికి మహిమ, మనకి సమాధానం రెండూ కలగవు. 

మనలోని ఆత్మీయ తృష్ణ చల్లారేంత వరకూ, క్రీస్తు మన హృదయంలో జన్మించేంత వరకూ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో జన్మించడం వలన నిజమైన శాంతి నెలకొంటుందో, అప్పుడు మనకిక వేరే సాక్ష్యాలు అవసరం లేదు. అది మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తుంది. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ మార్పు కనపడుతుంది. నా మటుకు ఈ పాటకు  అసలైన అర్థం ఇదేనని తోస్తుంది. 

క్రీస్తు మనలో జన్మించడం అన్నది కేవలం ఒకరోజుకే పరిమితమయ్యేది కాదు. మన జీవితాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ లోకంలోని మతాల గురించి నేను ఆలోచించినప్పుడల్లా, ఈ భూమి మీదకి దిగివచ్చిన మహోన్నతమైన గురువుల గురించి ఆలోచిస్తాను. వారి పుట్టుకకి కారణం– నేను మొదట చెప్పినట్టుగా, వారు ఈ భూమి మీద ఒక సత్యాన్ని ప్రచురించడానికి అవతరించారు. దానికి ఏ గుర్తు, సాక్ష్యం అవసరం లేదు. ఆ సత్యాన్ని వాళ్ళు జీవించిన జీవన విధానం ద్వారా లోకానికి తెలియజేశారు. ఈ సత్యం ఎన్నటికీ ఆగిపోదు, నాశనం చెందదు.

క్రీస్తు తమలో జన్మించనంత వరకూ ఎవరైనా ‘క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ తెలియజేస్తే, అది అర్థం లేనిదే అవుతుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారి శాంతిని తాను ఆకాంక్షించకుండా, తనకు శాంతి కలగాలని కోరుకోవడం దురాశ అవుతుంది. ‘యూక్లిడ్‌ సూత్రం’ ప్రకారం ఎవరైతే తన చుట్టూ ఉన్న వారి శాంతిని కోరుకుంటారో, వాళ్ళ జీవితాల్లో కూడా శాంతి నెలకొంటుంది. ఇందుకు భిన్నంగా ఉండేవారి జీవితాల్లో, చిన్నచిన్న కలహాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. కేవలం, యేసుక్రీస్తు  ఈ చారిత్రాత్మక జన్మని మాత్రమే మనం స్మరించుకుంటూ, ఆయన సిలువ త్యాగాన్ని విస్మరిస్తే, ఈ పర్వదినానికి విలువ లేనట్లే! అప్పుడు మన విశ్వాసం మృతమైన విశ్వాసం అవుతుంది.. తెలుగు అనువాదం: సి. షఫేల ఫ్రాన్కిన్సన్‌

మరిన్ని వార్తలు