సిగరెట్‌ సూసైడ్‌లను ప్రేరేపిస్తుందా? 

18 Feb, 2021 00:11 IST|Sakshi

సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక (సూయిసైడల్‌ టెండెన్సీస్‌) చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయంటూ హెచ్చరిస్తున్నారు  అమెరికాకు చెందిన పరిశోధకులు. మోకాలికీ, బోడిగుండుకీ ముడివేస్తున్నట్లు అనిపిస్తున్నా ఇది ప్రత్యక్ష అధ్యయనంలో పరోక్షంగా తేలిన వాస్తవమంటున్నారు.  యూఎస్‌లో ఆత్మహత్యలపై పరిశోధన చేస్తున్న కొందరు నిపుణులు చెబుతున్న  ఫలితాల ప్రకారం... సిగరెట్‌ అలవాటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల తర్వాత పొగతాగే అలవాటు గణనీయంగా తగ్గడంతోపాటు దాంతో విచిత్రంగా ఆత్మహత్యలు కూడా 15 శాతం తగ్గాయని వివరించారు.

అయితే దీనికి ఆత్మహత్యలకూ సిగరెట్‌ అలవాటుకూ ఎలా ముడిపెడతారన్న అడిగినప్పుడు వారు మరో దృష్టాంతం చూపారు. సిగరెట్లపై టాక్సులు తగ్గించిన అక్కడి కొన్ని రాష్ట్రాలలో ఆత్మహత్యల శాతం 6 శాతం పెరిగాయని గణాంకాలు చూపారు. డ్రగ్స్‌ అలవాటు ఉన్నవారిలో సూసైడల్‌ టెండెన్సీస్‌ పెరిగినట్లే... నికోటిక్‌కు బానిసలైన వారిలోనూ యాంగై్జటీ, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయనీ, డిప్రెషన్‌ ఉన్నవారికి ఆత్మహత్యావాంఛ ఒక లక్షణమని చెబుతూ ఈ పరిశోధన ఫలితాలను  ‘నికోటిక్‌ అండ్‌ టొబాకో రీసెర్చ్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు. 

మరిన్ని వార్తలు