Climate: కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ.. కాఫీ తాగినంత సులువు!

30 Sep, 2022 14:00 IST|Sakshi
అనిరుద్‌ - జయరాం(PC: Anirudh Gupta/ Siddhanth Jayaram Twitter)

మరో ప్రపంచం వెలుగులో...

‘కర్బన తటస్థత’.. ‘కర్బనరహితం’ గురించి మాట్లాడటానికి ‘కాప్‌26’ మాత్రమే వేదిక కానక్కర్లేదు. మన ఇల్లు కూడా అందుకు వేదిక కావచ్చు. పర్యావరణ అనుకూల జీవనశైలికి వ్యవస్థాగత ప్రయత్నాలే కాదు, వ్యక్తిగత స్థాయిలో జరిగే ప్రయత్నాలు కూడా ముఖ్యం అని నమ్ముతుంది క్లైమెస్‌...

‘ఇచట ఉంది...అచట లేదు’ అని కాకుండా ఎక్కడ చూసినా కర్బన ఉద్గారాలు కలవరపరుస్తూనే ఉన్నాయి. కర్బన ఉద్గారాలు అనే మాట వినబడగానే పెద్ద పెద్ద పరిశ్రమలు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. అయితే మెయిల్, మెసేజ్‌లు పంపడం, ఫోటోలు డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ రూపాల్లో కర్బన ఉద్గారాలు వెలువడడానికి మనం ఏదో రకంగా కారణం అవుతున్నాం.

ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 3.7 శాతం వాటా ఇంటర్నెట్, వివిధ రకాల గ్యాడ్జెట్‌లదే. విమానాల నుంచి వెలుబడే ఉద్గారాలకు ఇది సమానం!
ఈ నేపథ్యంలో బెంగళూరు, దిల్లీ కేంద్రంగా సిద్దార్థ జయరామ్, అనిరుథ్‌ గుప్తాలు  క్లైమెట్‌ యాక్షన్‌ ఫైనాన్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ క్లైమెస్‌ మొదలుపెట్టారు.

యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పొలిటికల్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన అనిరుథ్‌ గుప్తా ఒక స్వచ్ఛందసంస్థను మొదలుపెట్టాడు. ఆ తరువాత జయరామ్‌తో కలిసి ‘క్లైమెస్‌’కు శ్రీకారం చుట్టాడు. జయరామ్‌ ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు.

హోటల్లో కప్పు కాఫీ తాగడం నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ కారణాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది క్లైమెస్‌. ‘క్యాలిక్‌లెట్, ట్రాక్‌ అండ్‌ రెడ్యూస్‌’ అనే నినాదంతో కర్బనరహిత విధానాల ఆచరణపై అవగాహన కలిగిస్తుంది.

రిలయన్స్‌తో సహా దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్దిష్టమైన కాలవ్యవధితో శూన్య ఉద్గారాల స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కృషి చేస్తున్నాయి. 2070 నాటికి జీరో ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనేది మన దేశ లక్ష్యం.

అది విజయవంతం కావాలంటే వ్యవస్థగతంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా కార్యాచరణ కావాలి. దీనికి క్లైమెస్‌ నిర్మాణాత్మక రూపాన్ని ఇస్తుంది.
‘తెల్లారి లేచింది మొదలు ఏదో ఒక సమయంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం గురించి ఆందోళన పడుతుంటాం. మనిషి మనుగడ, కర్బన ఉద్గారాలు అవిభాజ్యం అని కూడా అనిపిస్తుంటుంది. కాని ఇది నిజం కాదు. కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ సాధ్యమే. అది జటిలమైన ప్రక్రియ కాదు. కాఫీ తాగినంత సులువు’ అంటోంది క్లైమెస్‌.

ప్రస్తుతం ఎనిమిది బ్రాండ్లతో మాత్రమే కలిసి పనిచేస్తున్న ‘క్లైమెస్‌’ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అయితే దానికి బలమైన భవిష్యత్‌ ప్రణాళిక ఉంది.
‘రాబోయే నెలల్లో కొన్ని బ్రాండ్ల నుంచి ఎన్నో బ్రాండ్లకు విస్తరిస్తాం’ అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు జయరామ్‌.

‘క్లైమెట్‌–పాజిటివ్‌ ఫీచర్స్‌తో సులభంగా యాక్సెస్‌ అయ్యే సౌకర్యం, పారదర్శకత, ఆర్థిక భారం లేకుండా ఉంటే ప్రజలు మనకు మద్దతు ఇస్తారు’ అంటున్నాడు అనిరుద్‌.
రాబోయే కాలంలో మనకు ఎదురయ్యే అతి పెద్ద సవాలు వాతావరణంలో చోటు చేసుకొనే మార్పులు.

‘మన వంతుగా ఏ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్‌ మసక బారే ప్రమాదం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు ఇద్దరు మిత్రులు.
వ్యక్తిగత స్థాయిలో మనం ఏంచేయగలం అని తెలుసుకోవడానికి ‘క్లైమెస్‌’ సైట్‌లోకి వెళితే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కొత్త దారి దొరుకుతుంది.

చదవండి: Cyber Security Tips: పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? డిజిటల్‌ రాక్షసులుగా మారకుండా..
Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా..

మరిన్ని వార్తలు