Akanksha Kumari: అండర్‌మైన్‌ తొలి మహిళా ఇంజనీర్‌గా!

2 Sep, 2021 03:43 IST|Sakshi
సహచరులతో ఆకాంక్ష కుమారి

బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్‌ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్‌ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్‌మైన్‌ ఇంజనీర్‌గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు?

గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్‌ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి.

అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్‌ ఇంజనీరింగ్‌ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్‌ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్‌క్లాస్‌ మైనింగ్‌ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్‌ జింక్‌లో ఉపరితల మేనేజర్‌ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్‌ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి.

50 ఏళ్లలో తొలిసారి
కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్‌ ఇండియా లిమిటెడ్‌’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌’ సెప్టెంబర్‌ 1న తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్‌’ లో ఆమెను అండర్‌గ్రౌండ్‌ కార్యకలాపాలకు నియమించి మైనింగ్‌ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్‌గ్రౌండ్‌ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్‌ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా.

అంత సులభం కాలేదు
భారత గనుల చట్టం 1952లోని సెక్షన్‌ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్‌గ్రౌండ్‌ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్‌ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది.

భిన్న విద్యార్థి
జార్ఘండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్‌ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్‌ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్‌) బిట్స్‌లో మైనింగ్‌ ఇంజనీరింగ్‌ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్‌ జింక్‌ రాజస్థాన్‌ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌ ఇంజనీరుగా డిజిగ్నేషన్‌ పొందింది.

అయినా జాగ్రత్తలే
ఆకాంక్ష కుమారి అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్‌ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్‌ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్‌లైట్‌ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు.

మరిన్ని వార్తలు