శతక నీతి – సుమతి: సత్సాంగత్య ఫలం

18 Apr, 2022 00:29 IST|Sakshi

మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుపకాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగదీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంతా అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మలనుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి.

ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్తకాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయలేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తిప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడుతుంటాయి.

ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి, ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, ఒక అబ్దుల్‌ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థమైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. ‘నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవరకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టుకుంటాను’ అని లండన్‌ లో ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగుతుంది.

అంతేతప్ప తనకోసం బతికేవాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించేవాడూ, పదిమందికి ఆదర్శం కానివాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు, కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు, ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభవిస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ, వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి..  ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా  ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు