నా బిడ్డను నాకివ్వండి! ప్లీజ్‌!!

22 Oct, 2021 00:45 IST|Sakshi

అనుపమ ఓ బిడ్డకు తల్లి. బిడ్డ పుట్టి మొన్నటికి (ఈ నెల 19వ తేదీకి) ఏడాదైంది. సంతోషంగా బిడ్డ తొలి పుట్టిన రోజును పండగ చేసుకోవాల్సిన సమయం. ఈ ఏడాది లోపు పాపాయి బోర్లా పడడం, పాకడం, అన్నప్రాశన, తల నీలాలు తీయడం... ప్రతిదీ ఓ వేడుకగా జరిగి ఉండాల్సింది. కానీ ఏ ఒక్క వేడుకా జరగలేదు. పుట్టినరోజు వేడుక కూడా జరగలేదు.

అనుపమకు తన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ప్రసవం తర్వాత హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కాక ముందు వరకే బిడ్డను పొత్తిళ్లలో చూసుకుంది అనుపమ. హాస్పిటల్‌ నుంచి తల్లీ బిడ్డ వేరయ్యారు. ఇంతవరకూ కలవలేదు. బిడ్డ కోసం అనుపమ పోరాడుతోంది. ఆ (కేరళ) రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా విన్నవించుకుంది. అయినా సరే... బిడ్డ ఆచూకీ అగమ్యంగానే ఉంది.

మరీ ఇంత వ్యూహాత్మకమా!
ఇలాంటి సంఘటనల్లో సాధారణంగా హాస్పిటల్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మాయం కావడం చూస్తుంటాం. పిల్లలు లేని మహిళలు పేషెంట్ల రూపంలో హాస్పిటల్‌లో సంచరిస్తూ చంటిబిడ్డను ఎత్తుకెళ్లిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చంటిబిడ్డ మాయం కావడానికి కారణం ఆ బిడ్డ తాత జయచంద్రన్‌. అతడు కేరళలో కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకుడు. బిడ్డ ఏమైందని అడిగితే అతడు ‘నా కూతురు అనుపమ అనుమతితో ఆమె బిడ్డను దత్తత ఇచ్చేశాను’ అని చెప్తున్నాడు. ‘తన మానసిక, ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా బిడ్డను పోషించే స్థితిలో లేదని, ఈ కారణాల వల్ల బిడ్డను దత్తత ఇవ్వడానికి అంగీరిస్తున్నట్లు... నా కూతురు సంతకం చేసింది చూడండి’ అని అనుపమ సంతకంతో కూడిన పత్రాన్ని కూడా చూపిస్తున్నాడు.

ఇదీ కారణం!
అనుపమది మలబార్‌ ఎరావా సామాజిక వర్గం. ఆ సామాజికవర్గానికి సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు ఉంది. ఆమె ప్రేమించిన అజిత్‌ దళిత క్రిస్టియన్‌. అనుపమ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించకపోవడానికి కారణం సామాజిక వర్గమే. గర్భవతిగా ఉన్న కూతురికి మంచి మాటలు చెప్పి ప్రసవానికి పుట్టింటికి తీసుకువచ్చారు ఆమె తల్లిదండ్రులు. అనుపమ అక్కకు పెళ్లయ్యే వరకు అనుపమ పెళ్లి, బిడ్డ వివరాలను గోప్యంగా ఉంచుదామని అనుపమను నమ్మించారు. డెలివరీ తర్వాత హాస్పిటల్‌ నుంచి అనుపమను నేరుగా జయచంద్రన్‌ స్నేహితుని ఇంటికి తీసుకు వెళ్లారు.

బిడ్డను మరోచోట సురక్షితంగా ఉంచామని చెప్పారు. కొన్నాళ్లకు అనుపమను పుట్టింటికి తీసుకువెళ్లారు, ఆ తీసుకువెళ్లడమే ఆమెను గదిలో బంధించారు. బిడ్డ వివరాలు అడిగితే చెప్పేవాళ్లు లేరు. పైగా అనుక్షణం ఆమెతో ఇంట్లో వాళ్లు ఎవరో ఒకరు నీడలా అంటిపెట్టుకునే ఉండేవారు. అనుపమ అక్క పెళ్లికి ఊరి వాళ్లను ఆహ్వానించే సమయంలో అనుపమను కూడా వెంట తీసుకువెళ్లారు. అనుపమ ఎక్కడా నోరు విప్పకూడదనే ఆంక్ష విధించి మరీ. అలాగే నడుచుకుంది అనుపమ. అక్క పెళ్లి తర్వాత తన బిడ్డను ఇవ్వమని, అజిత్‌ దగ్గరకు వెళ్తానని అడిగింది.

‘కుటుంబ ఆస్తిలో తనకు వారసత్వంగా రావాల్సిన హక్కు వదులుకుంటున్నట్లు’ సంతకం చేయమన్నాడు తండ్రి. అలాగే అతడు చెప్పిన చోటల్లా సంతకం చేసింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల అసలు కుట్ర బయటపడింది. ‘బిడ్డను నీ అంగీకారం ప్రకారమే దత్తత ఇచ్చేశాను’ అనేశాడు అనుపమ తండ్రి. ఇన్నాళ్లూ బిడ్డ కోసం తండ్రి చెప్పినట్లల్లా చేసింది. ఇప్పుడా బిడ్డ ఆచూకీనే లేనప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలనే మొండిపట్టుదలతో ఇల్లు దాటి వచ్చేసింది. అజత్‌తోపాటు పోలీసులను ఆశ్రయించింది.

తన బిడ్డ ఆచూకీ తెలిస్తే చెప్పమని కనిపించిన బంధువులను, కుటుంబ స్నేహితులను అర్థిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారులు, పార్టీ అగ్రశ్రేణి నాయకులను కలిసి న్యాయం చేయమని మొరపెట్టుకుంది. ఆఖరుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. ఇంత జరిగినా బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. తన డెలివరీ లోపు ఒకసారి తల్లిదండ్రులు తనకు అబార్షన్‌ చేయించడానికి కూడా ప్రయత్నించినట్లు అనుపమ చెప్తోంది.

తన గోడు విన్న వాళ్లందరూ సానుభూతితో స్పందిస్తున్నారు, కానీ బిడ్డ ఆచూకీ మాత్రం లభించలేదు. ‘బిడ్డకు పాలివ్వడానికి నోచుకోలేని తల్లిగా తాను, తల్లిపాలకు దూరమైన తన బిడ్డ దురదృష్టవంతుల’మని కన్నీరు పెట్టుకుంటోంది అనుపమ. కేరళ రాష్ట్రం మనదేశంలో అత్యున్నత శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో నడుస్తున్న రాష్ట్రంగా పరిగణిస్తాం. అలాంటిది ఈ డిజిటల్‌ యుగంలో కూడా ‘కులం, మతం’ మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. బిడ్డను తల్లికి దూరం చేస్తున్నాయి.
 
బిడ్డ ఎక్కడ ఉన్నట్లు?
అనుపమ ఈ ఏడాది మార్చిలో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చింది, అదే నెలలో పోలీసును ఆశ్రయించింది, పోరాడగా పోరాడగా... విషయం మీడియాలో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నిన్న ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారని, కానీ ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పాడు అజిత్‌ ఆవేదనగా. ఇక జయచంద్రన్‌ మాత్రం అనాథ బిడ్డల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మతొట్టిల్‌ పథకం ఉయ్యాల్లో వేసినట్లు ఒకసారి చెప్పాడు, శిశు సంక్షేమ శాఖ కమిటీకి అప్పగించినట్లు మరోసారి చెప్పాడు.

శిశు సంక్షేమ కమిటీ నిర్వహకురాలు సునంద ఈ విషయంలో స్పందిస్తూ... ’ఏప్రిల్‌లో బిడ్డ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం వచ్చినట్లు చెబుతూ తమ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డ గురించిన రికార్డు ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నతల్లితో స్వయంగా మాట్లాడిన తర్వాత మాత్రమే బిడ్డను స్వీకరిస్తామని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో అమ్మతొట్టిల్‌కి వచ్చిన ఇద్దరు శిశువుల్లో ఒక శిశువును దత్తత ఇచ్చేయడం జరిగింది. మరో శిశువుకు డీఎన్‌ఏ పరీక్ష చేయగా నెగిటివ్‌ వచ్చింది. నిజానిజాలు పోలీసు దర్యాప్తులో మాత్రమే తేలతాయని, ఒకవేళ దత్తత ఇచ్చిన శిశువే అనుపమ బిడ్డ అయితే ఆ బిడ్డను తిరిగి అనుపమ దంపతులకు ఇవ్వడం చట్టరీత్యా చాలా కష్టమని చెప్పింది సునంద.

మరిన్ని వార్తలు