ముఖ స్తుతి

8 Jan, 2024 05:48 IST|Sakshi

మంచిమాట

పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్‌ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే.  

పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది.

ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు.

ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. 
 
ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు.

ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు.

ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది.     
ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు.       

సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని  కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ.

– డా.ఎన్‌.అనంత లక్ష్మి

>
మరిన్ని వార్తలు