బ్యాంకు మాజీ ఉన్నతాధికారి కృషి.. పైపులైన్ల పంట!

2 Aug, 2021 23:47 IST|Sakshi
కాలువ నుంచి భూగర్భ పైపులైను ద్వారా తోడుకున్న నీటిని తన పొలంలో ఫాం పాండ్స్‌లో నిల్వ చేసి వాడుకుంటున్న  వెంకటేశ్వరరెడ్డి

రైతుగా మారిన మాజీ బ్యాంకు ఉన్నతాధికారి కృషితో మెట్ట భూములకు సాగునీటి వసతి కల్పన

రూ. 30 లక్షల పెట్టుబడితో 2.5 కి.మీ. దూరం భూగర్భ పైపులైను నిర్మాణం

నాడు ఏడాదికి ఒక్క పంట కూడా పండని పరిస్థితి.. నేడు 800 ఎకరాలకు నీటి భద్రత.. 

ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకొని రుణం తీర్చుకున్న గ్రామ ప్రజలు

వ్యవసాయంపై ఉన్న మమకారం ఆయనను తిరిగి సొంతూరికి తీసుకొచ్చింది. పదెకరాల నల్లరేగడి భూమిని సాగు చేసుకుంటూ తమ ఊళ్లో విశ్రాంత జీవితం గడుపుదామని ఆయన నిర్ణయించుకొని ఉండకపోతే.. సాగు నీరు లేక అల్లాడుతున్న ఆ ఊరు పొలాల్లో హంద్రీ నీవా కాలువ నీరు జల జలా పారేదే కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి పట్టుదలతో ఆయన సాధించిన వరుస విజయాల గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు! ఆయన పేరు సూగూరు వెంకటేశ్వరరెడ్డి. రైతు బిడ్డ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఆయన స్వగ్రామం. వ్యవసాయంలో బీఎస్సీ పట్టా తీసుకున్న ఆయన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌లో వ్యవసాయ క్షేత్ర అధికారిగా ఉద్యోగంలో చేరారు. 35 ఏళ్ల తర్వాత 2018లో ఏజీఎంగా ఉద్యోగ విరమణ చేసి.. సొంతూళ్లో సేద్యం చేస్తూ వ్యవసాయానికి జవసత్వాలు చేకూర్చుతున్నారు. ?

ఉమ్మడిగా భూగర్భ పైపులైన్లు
మల్లెపల్లి గ్రామానికి 2.5 కి. మీ. దూరం నుంచి హంద్రీ నీవా – సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కాలువ వెళ్తుంది. వర్షాలు కురిస్తే కాలువలో ఏడాది పొడవుగా నీళ్లు పారుతుంటాయి. కానీ, గ్రామ పొలాలకు ఈ నీరు పారదు. వెంకటేశ్వరరెడ్డి పైపులైను గురించి ఆలోచించారు. గ్రామ రాజకీయాలను, రైతుల్లో అనైక్యతను అధిగమించి 30 మంది రైతులను ఏకం చేశారు. భూగర్భ పైపులైను నిర్మించి డీజిల్‌ పంపుల ద్వారా కాలువ నీటిని పొలాల్లో పారించారు. మీటరు లోతులో, 5–6 అడుగుల వెడల్పున ఉమ్మడిగా కందకం తవ్వి.. రైతులు ఎవరికి వారు తమ పీవీసీ పైపులను ఈ కందకంలో పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి డీజిల్‌ ఇంజన్లను వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఎవరికి కావాల్సినప్పుడు నీటిని వారు తోడుకుంటున్నారు. ఫామ్‌ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్‌లో, స్ప్రింక్లర్ల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు.

ఈ స్కీము అమలయ్యేనా? అన్న అనుమానంతో తొలుత ఏ ఇతర రైతులూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరెడ్డి పట్టుదలతో తనే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, పైపులైను నిర్మించి నీటిని పొలాలకు పారించారు. సొంత పూచీకత్తుపై ప్రతి రైతు పేరిట రూ. లక్ష బ్యాంకు రుణం ఏర్పాటు చేయించి.. తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 నెలల తర్వాత తిరిగి తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ విధంగా తమ గ్రామ పొలాల్లో ఆరుతడి పంటలకు రక్షక తడులు ఇవ్వడానికి నీటి భద్రత చేకూరిందని వెంకటేశ్వరరెడ్డి సంబరంగా చెబుతుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఇతర రైతులు కూడా అనుసరించారు. సుమారు వంద మంది రైతులు దశల వారీగా మరో 8 భూగర్భ పైపులైన్‌ స్కీముల ద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత కల్పించుకున్నారని ఆయన తెలిపారు. 

వెంకటేశ్వరరెడ్డి పాడి గేదెల ఫారం

ఎకరానికి రూ. 5–6 వేల ఖర్చు
రేగడి నేలలు కావటాన మూడు నాలుగు వారాలు వర్షం మొహం చాటేసినప్పుడు పంటలను రైతులు కాలువ నీటితో రక్షక తడులు అందించి రక్షించుకుంటున్నారు. ఖరీఫ్‌ కాలంలో వర్షాభావ పరిస్థితులను బట్టి 1–2 సార్లు, రబీలో 2–3 సార్లు నీటిని సొంత ఖర్చుతో తోడుకుంటున్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 5–6 వేల వరకు డీజిల్‌ ఖర్చవుతున్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొందరు రైతులు వేసవిలో కూరగాయలను సైతం మూడో పంటగా సాగు చేసుకొని మంచి ఆదాయం గడిస్తున్నారు. నీటి భద్రత వల్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. పత్తి, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది.

భూమి విలువ పెరగడంతో పాటు కౌళ్లు రెట్టింపయ్యాయి.  25 ఎకరాల దేవాలయ భూములకు పైపులైను ద్వారా కాలువ నీటిని తెప్పించేందుకు సొంత డబ్బు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మల్లెపల్లె ప్రాథమిక పాఠశాల, అల్లుగుండు ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు వాటర్‌ ట్యాంకులు విరాళంగా ఇచ్చారు.  సంఘటితమైతే రైతులకు మేలు జరుగుతుందని నమ్మే వెంకటేశ్వరరెడ్డి ‘నాగలి రైతు ఉత్పత్తిదారుల సంఘం’ను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరెడ్డి. ప్రస్తుతం ఇందులో 40 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు వెంకటేశ్వరరెడ్డి రుణం తీర్చుకోవటం కోసమే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు!

పైపులైన్‌ నీటితో సాగవుతున్న వేరుశనగ

రాజకీయాలకు అతీతంగా కృషి
దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండాలనేది నా లక్ష్యం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రైతులను రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై తెచ్చాం. హంద్రీ నీవా కాలువ నీటిని అందించే పైపులైను స్కీమును అమలు చేశాం. ఎంతో కష్టపడ్డాం. ఒకప్పడు ఏటా ఒక పంట పండటమే కష్టంగా ఉంది. నేడు అనేక మంది 2 పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంటలు కూడా వేసుకుంటున్నారు. తర్వాత మరో 8 పైపులైను స్కీములు ఏర్పాటయ్యాయి. తద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత చేకూరింది. రాజకీయాలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో బాధ్యత పెరిగింది. 
– సూగూరు వెంకటేశ్వరరెడ్డి (98660 09889), మాజీ బ్యాంకు ఉన్నతాధికారి, రైతు, సర్పంచ్, మల్లెపల్లి, కర్నూలు జిల్లా

మరిన్ని వార్తలు