పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..?

23 Apr, 2021 01:41 IST|Sakshi

పిల్లలకు కరోనా రావడమే తక్కువ. సోకినా మందులతో తగ్గిపోతుంది. మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో 18 ఏళ్లలోపు అంతకంటే తక్కువ అంటే 10–12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా సోకడం చాలా తక్కువ. తెలంగాణలోని ప్రధాన పిల్లల ఆసుపత్రి నీలోఫర్‌లో దీనికి సంబంధించి పెద్దగా కేసులు నమోదు కాలేదు. వీరి కోసం ప్రత్యేక వార్డులు పెట్టడం వంటిది కూడా లేదు. ఇదే పరిస్థితి దాదాపుగా హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ ఉన్నట్టుగా తెలుస్తోంది.

పీడియాట్రిక్‌ వ్యాధుల్లో కోవిడ్‌ ఎంతమాత్రం ఆందోళన కలిగించే అంశం కాదు. తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చినప్పుడు టెస్ట్‌ చేస్తే పిల్లలకు సోకినట్లు తెలుస్తోంది. పెద్దలకు జ్వరం, జలుబు ఇతర లక్షణాలు కనిపించాక 3,4 రోజుల తర్వాత టెస్ట్‌ చేసుకోవడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తుండడంతో పిల్లలకు ఇది సోకుతోంది.

పిల్లల్లో కూడా ఎక్కువగా అసెంప్టిమ్యాటిక్‌ (లక్షణాలు లేకుండా)గానే ఉంటున్నారు. దగ్గు, జలుబు వంటివి కూడా ఉండడం లేదు. చాలా స్వల్ప లక్షణాలుంటున్నాయి. ఒకరోజు జ్వరమొచ్చినా పారాసిటమల్, జింకోవిట్, అజిత్రాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో ఎలాగున్నా తెలంగాణలో, హైదరాబాద్‌లో ఏ మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా చిన్నపిల్లల వ్యాధుల్లో ఇది ఆందోళన కలిగించేదిగా ఎంత మాత్రం లేదన్నది గ్రహించాలి.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) విడుదల చేసిన గణాంకాల్లోనూ పీడియాట్రిక్స్‌లో ఏదో ఒక శాతమే కరోనా ఉన్నట్టుగా వెల్లడైంది. అయితే పెద్దల నుంచి పిల్లలకు సోకుతున్నట్లే, పిల్లల వల్ల పెద్దలకు వైరస్‌ సోకే అవకాశం మాత్రం ఉంది. నీలోఫర్‌లో న్యూమోనియా కేసులకు సంబంధించి టెస్టింగ్‌కు పంపించినా పాజిటివ్‌ కేసుల నమోదు కావడం లేదు.

- డాక్టర్‌ బి.నరహరి
పీడియాట్రిక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్, నీలోఫర్‌ ఆస్పత్రి 

మరిన్ని వార్తలు