సనాతన వాదం.. అధునాతన వేదం

7 Dec, 2020 09:14 IST|Sakshi

షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం రాకపోతే చిన్నచూపు చూసిన ఆధునిక లోకం.. అదే షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతే ఛీ కొట్టే స్థితికి వచ్చింది. కషాయం అంటే కడుపులో తిప్పుతుందన్న నోటితోనే వాటిని ఇష్టంగా తాగేలా చేసింది. కరోనా కారణంగా మన ఆచార వ్యవహారాలు, ఆరోగ్యమార్గాల విలువ నవతరానికి మాత్రమే కాదు ప్రపంచానికీ తెలిసింది. ఈ నేపథ్యంలో నగరవాసి వీటిని భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అమెరికాలో ఉద్యోగం వదులుకుని వచ్చి వాటిని పాఠ్యాంశాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: ‘మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ఒక మతానికి పరిమితం చేయడం సరైంది కాదు. అవెంత అవసరమో.. వాటిని పాటించడం అంటే మానవాళికి ఎంత మేలు కలుగుతుందో కరోనా తెలియజెప్పింది. ఇప్పుడు వాటిని భావితరాలకు అందించడమే నా లక్ష్యం’ అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్‌ వేదిక్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు విక్రమ్‌ రాజు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకుని నగరానికి వచ్చిన ఆయనకు భారతీయ ఆచార వ్యవహారాలంటే చాలా మక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ఆయుర్వేదం గురించి తెలుసుకున్నారు. వాటిని పాఠ్యాంశాలుగా మారుస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే.  

సరళీకరణ ఓ నిర్విరామ ప్రక్రియ.. 
మనవైన వేదాలు రోజురోజుకూ మనకి దూరమవకుండా ఉండేందుకు మనకన్నా మన ముందు తరం వారే తగిన శ్రద్ధ వహించారు. కాలానుగుణంగా వాటిని సింప్లిఫై చేస్తూ వచ్చారు. తొలిదశలో వేదాలు అందరూ చదివగలిగేవారు. తర్వాత ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, తర్వాత దశలో పండుగలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సంప్రదాయంగా పండుగలు ఆచరించేవారు కూడా లేరు కాబట్టి.. వాటిని భావితరాలకు ఉపకరించేలా మరింత సింప్లిఫై చేసి పాఠాల రూపంలో అందించాల్సి ఉంది.  

నాటి బాటే.. నేటి పాఠమై.. 
వేద పాఠశాలు చాలా ఉన్నా.. యోగా, ముద్ర, చక్రాస్, మెడిటేషన్‌లపై దేశంలో ఎవరి దగ్గరా సరైన విద్యా మెటీరియల్‌ లేదని నాకు అవగతమైంది. లాక్‌డౌన్‌ సమయంలో లభించిన వెసులుబాటుతో దాదాపు 25ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవారితో కలిసి ఒక కర్రిక్యులం తయారు చేశా. అలాగే దాదాపు 2వేల పేజీలు ఉండే గరుణ పురాణంలోని ముఖ్యమైనదంతా కలిపి 100 పేజీల్లో కుదించి.. 18 పురాణాలూ చేయిస్తున్నాను. మనకు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఒక్కో దేవత గురించి 2 పేజీల్లో పొందుపరచి పుస్తకాలు తెస్తున్నాం. ఈ కర్రిక్యులంని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు, కళాశాలలకు అందుబాటులోకి తేవాలనేది ప్రయత్నం. ఆయుర్వేదం సహా 150 నుంచి 200 పేజీలలో వేదాల పుస్తకాలు తెస్తున్నాం. 

వేదగణితం.. కాల్క్యులేటర్‌కి సమానం.. 
మన వేదిక్‌ మ్యాథ్స్‌ చాలా సింప్లిఫైడ్‌.. ఈ వేద గణితం నేర్చుకున్నవారు కాల్క్యులేటర్‌తో సమానంగా లెక్కించగలరు అంటే నమ్మాలి. క్లాస్‌ 1 నుంచి క్లాస్‌ 10దాకా వేదిక్‌ సైన్స్‌తో పాటు వేదాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలపై కూడా పూర్తిస్థాయి సబ్జెక్టు తయారు చేశా. ఇవన్నీ రెగ్యులర్‌ సిలబస్‌తో పాటు అందించాలంటే.. వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే సరిపడా స్థలం ఇస్తే  ఇండియన్‌ వేదిక్‌ స్కూల్‌ నెలకొల్పాలని ఉంది.  

చిన్ననాటి నుంచే నేర్పాలి... 
డార్విన్‌ ఎవల్యూషన్‌ థియరీ చదువుతాం. కానీ అది ఎప్పుడో మనం దశావతారాల పేరిట మన పెద్దవాళ్లు చెప్పారనేది పిల్లలకి తెలియాలి. అలాగే మొత్తం సోలార్‌ సిస్టమ్‌ గురించి, గెలాక్సీ గురించి పురుష సూక్తంలోని నాసదీయసూక్తంలో ఉందని తెలియజెప్పాలి. అవన్నీ ఎప్పుడో కాదు ప్రతి పిల్లాడికీ వేదాలు, ఉపనిషత్తు 5వ ఏట నుంచే ఇవి పాఠ్యాంశాలు కావాలి. ఆ ఉద్ధేశ్యంతోనే మొత్తం 50 థియరీల మీద కలిపి బుక్స్‌ చేయిస్తున్నాను. – విక్రమ్‌ రాజు, వేదిక్‌ ఫౌండేషన్‌  

మరిన్ని వార్తలు