కరోనా వైరస్‌: ఎన్నో వ్యాక్సిన్లు..

6 Dec, 2020 08:40 IST|Sakshi

దాదాపు ఏడాది కిందట ఉనికిలోకి వచ్చిన ‘కరోనా’ వైరస్‌ దావానలంలా ప్రపంచమంతటికీ వ్యాపించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడితే, దాదాపు పద్నాలుగు లక్షల మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికీ ఈ వ్యాధి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మన దేశంలో ఇప్పటికి కాస్త తగ్గుముఖం పట్టినా, కొన్ని పాశ్చాత్య దేశాల్లో రెండో విడత విజృంభణ ప్రారంభం కావడంతో, చలి పెరిగితే మన దేశంలోనూ ‘కరోనా’ సెకండ్‌వేవ్‌ విజృంభణ తప్పక పోవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాధి ఎంత వేగంగా విస్తరించిందో, దీని కట్టడికి వ్యాక్సిన్‌ ప్రయత్నాలూ అంతే వేగంగా మొదలయ్యాయి. ‘కరోనా’ కట్టడికి ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు అన్ని దశల ప్రయోగాలనూ పూర్తి చేసుకుని, వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకే వ్యాధికి రకరకాల వ్యాక్సిన్లు రూపొందడంతో వాటి పనితీరు, ప్రభావాలు వంటి అంశాలపై కొంత గందరగోళం నెలకొని ఉన్న నేపథ్యంలో ‘కరోనా’ వ్యాక్సిన్లపై ప్రత్యేక కథనం...

‘కరోనా’ వైరస్‌ ఉనికి తొలిసారిగా గత ఏడాది చివర్లో చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో బయటపడిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీనిని మహమ్మారిగా ప్రకటించడంతో దేశ దేశాల్లోని పరిశోధకులు దీని కట్టడికి వ్యాక్సిన్‌ రూపొందించే ప్రయత్నాల్లో పడ్డారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న కాలంలో... ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికే వ్యాక్సిన్ల  రూపకల్పన ప్రయత్నాలు మొదలయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో పిలుపు మేరకు స్పందించిన దాదాపు నలభై దేశాలు వ్యాక్సిన్‌ రూపకల్పన కోసం జరిపే పరిశోధనల కోసం 810 కోట్ల డాలర్ల (సుమారు రూ.60 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నెలాఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని నివారించేందుకు వివిధ పద్ధతుల్లో 321 వ్యాక్సిన్ల రూపకల్పనకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అప్పటికే 56 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలో 41 వ్యాక్సిన్లు తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలను పూర్తిచేసుకుంటే, మిగిలిన 15 వ్యాక్సిన్లు పూర్తిగా మూడు దశల క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి.

‘కోవిడ్‌–19’ వ్యాధికి కారణమవుతున్న ‘కరోనా’ వైరస్‌ను కట్టడి చేసేందుకు తాము రూపొందించిన వ్యాక్సిన్‌ 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నవంబర్‌ 9న ‘ఫైజర్‌’ సంస్థ ప్రకటించింది. కొద్దిరోజుల వ్యవధిలోనే, అంటే– నవంబర్‌ 16న ‘మోడర్నా’ సంస్థ తమ వ్యాక్సిన్‌ 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి చూసుకుంటే, ‘కరోనా’ కట్టడికి ప్రపంచం ముందు ఈ రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉన్నట్లు లెక్క. తాజాగా నవంబర్‌ 23న ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీతో కలసి వ్యాక్సిన్‌ రూపొందించిన ‘ఆస్ట్రాజెనికా’ సంస్థ కూడా తమ వ్యాక్సిన్‌ 90 శాతం ఫలితాలను సాధించిందని, ఇది కూడా వినియోగానికి సిద్ధంగా ఉందని ప్రకటించినా, దీనిపై కొన్ని గందరగోళాలు ఉన్నాయి. మొదటి విడత సగం మోతాదు, రెండో విడత పూర్తి మోతాదులో ఇచ్చినప్పుడు సత్ఫలితాలు సాధించినట్లు ‘ఆస్ట్రాజెనికా’ చెప్పుకుంటున్నా, రెండు విడతల్లోనూ పూర్తి మోతాదు ఇచ్చినప్పుడు దీని సామర్థ్యం 62 శాతం మాత్రమేనని, సరాసరిన చూసుకున్నా దీని సామర్థ్యం 70 శాతానికి మించి లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న మిగిలిన వ్యాక్సిన్లు కూడా త్వరలోనే వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మోడర్నా వ్యాక్సినే కాస్త మెరుగు
ఫైజర్, మోడర్నా సంస్థలు రూపొందించి వ్యాక్సిన్లతో దుష్ప్రభావాలు తక్కువగానే ఉన్నట్లు తేలింది. ఇవి కూడా చాలా తక్కువ స్థాయి నుంచి ఒక మోస్తరు దుష్ప్రభావాలు మాత్రమే. అతి కొద్ది మందిలో మాత్రమే కొన్ని తీవ్ర లక్షణాలు కనిపించినా, అవి వ్యాక్సిన్‌ వల్ల తలెత్తినవి కావని వైద్య నిపుణులు చెబుతున్నారు. మోడర్నా రూపొందించిన ‘ఎంఆర్‌ఎన్‌ఏ1273’ వ్యాక్సిన్‌ తీసుకున్న కొద్దిమందిలో అలసట, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి, వ్యాక్సిన్‌ ఇంజెక్ట్‌ చేసిన ప్రదేశంలో నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపించాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 2.0 నుంచి 9.7 శాతం మందిలోనే ఇలాంటి లక్షణాలు కనిపించాయి. ఇక ‘ఫైజర్‌’ రూపొందించిన ‘బీఎన్‌టీ162బీ2’ వ్యాక్సిన్‌ విషయానికొస్తే, ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనించాయి.

‘ఫైజర్‌’, ‘మోడర్నా’ సంస్థలు రూపొందించిన వ్యాక్సిన్లు ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ రకానికి చెందినవి. ఈ రకానికి చెందిన వ్యాక్సిన్లలో ఇప్పటి వరకు ఈ రెండూ సత్ఫలితాలనిస్తున్నట్లుగా తేలింది. ‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ను –70 నుంచి –80 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. భారత్‌ వంటి దేశాలలో దీని పంపిణీ కష్టమే కాకుండా, ఖర్చుతో కూడుకున్నది కూడా కావడంతో దీనిని సామాన్యులకు అందుబాటులోకి తేవడం దాదాపు అసాధ్యం. ‘మోడర్నా’ వ్యాక్సిన్‌ను మామూలు రిఫ్రిజరేటర్లలో తేలికగా నిల్వ చేసుకోవచ్చు. అందువల్ల అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలు, ఇతర వెనుకబడిన దేశాలలో వినియోగానికి ‘మోడర్నా’ వ్యాక్సినే కాస్త మెరుగైనదని చెప్పుకోవచ్చు.

‘ఆస్ట్రాజెనికా’పై గందరగోళం ఎందుకు?
‘ఆస్ట్రాజెనికా’ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను తొలివిడత జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లకు నిర్ణీత వ్యవధిలో రెండుసార్లూ పూర్తి మోతాదులే ఇచ్చారు. రెండుసార్లూ పూర్తి మోతాదులే ఇచ్చినప్పుడు 62 శాతం మాత్రమే సత్ఫలితాలు వచ్చాయి. తర్వాత జరిపిన పరీక్షల్లో పద్ధతి మార్చుకుని, తొలిసారి సగం మోతాదు, రెండోసారి పూర్తి మోతాదు ఇచ్చినప్పుడు 90 శాతం సత్ఫలితాలు వచ్చాయి. ‘ఫైజర్‌’, ‘మోడర్నా’ సంస్థలు ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ రూపొందిస్తే, ‘ఆస్ట్రాజెనికా’ వెక్టర్‌ వ్యాక్సిన్‌ను రూపొందించింది. చింపాజీలలో జలుబును కలిగించే వైరస్‌ నుంచి దీనిని రూపొందించారు. ఈ వైరస్‌ మనుషులలో జలుబు కలిగించే వైరస్‌ను పోలి ఉండేది కాదు. అందువల్ల దీనిని మనుషుల్లో ప్రవేశపెడితే, శరీరంలో యాంటీబాడీస్‌ పెరిగేలా చేసి, కరోనా వైరస్‌ సోకినప్పుడు దానిని అరికట్టేలా చేస్తుంది. తొలి విడతగా సగం మోతాదు ఇవ్వడం వల్ల రోగనిరోధక కణాలైన ‘టీ సెల్స్‌’ను ఉత్తేజపరుస్తుంది.

ఈ కారణం వల్లనే తొలిసారి సగం మోతాదులోను, రెండో విడత పూర్తి మోతాదు ఇచ్చినప్పుడు ఇది మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లతో పోల్చుకుంటే వెక్టర్‌ వ్యాక్సిన్లలో ఒక సానుకూలత ఉంది. దీనిని సాధారణ రిఫ్రిజరేటర్లలో ఆరునెలల పాటు నిక్షేపంగా నిల్వ చేసుకోవచ్చు. వీటి ధర కూడా సాధారణంగా తక్కువగానే ఉంటుంది. ‘కరోనా’ కట్టడి కోసం భారత ప్రభుత్వం ‘ఆస్ట్రాజెనికా’ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలసి ‘ఆస్ట్రాజెనికా’తో కలసి ఈ వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కూడా పాలు పంచుకుంది. ఈ సంస్థ ద్వారానే ‘ఆస్ట్రాజెనికా’ వ్యాక్సిన్‌ భారత్‌లో అందుబాటులోకి రానుంది.

ఫిబ్రవరిలో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌!
వివిధ విదేశీ సంస్థలతో పాటే మన దేశంలోని ఔషధ తయారీ సంస్థలు కూడా ‘కరోనా’ కట్టడి కోసం వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలను ప్రారంభించాయి. వాటిలో ‘భారత్‌ బయోటెక్‌’ సంస్థ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ వచ్చే ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. జంతువులపై జరిపిన పరీక్షల్లోను, తొలి రెండు విడతల క్లినికల్‌ పరీక్షల్లో ‘బయోటెక్‌’ రూపొందిస్తున్న ‘కోవాగ్జిన్‌’ సత్ఫలితాలనిచ్చింది. మూడో విడత పరీక్షలు త్వరలోనే పూర్తి చేసుకోనున్న ఈ వ్యాక్సిన్‌ మార్చి నాటికి అందుబాటులోకి వస్తుందని తొలుత అంచనా వేసినా, నెల్లాళ్లు ముందుగానే– అంటే ఫిబ్రవరిలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్త రజనీకాంత్‌ వెల్లడించారు. భారత్‌లోని మరికొన్ని ఫార్మా సంస్థలు కూడా ‘కరోనా’ కట్టడి కోసం వ్యాక్సిన్లు రూపొందిస్తున్నాయి. జైడస్‌ కాడిలా, పనాసియా బయోటెక్, ఇండియన్‌ ఇమ్యూనాలాజికల్‌ వంటి సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయి. పరీక్షలు విజయవంతమైతే, ఇవి కూడా మార్కెట్‌లోకి రానున్నాయి.

మన దేశంలోనే స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ తయారీ
‘కరోనా’ వైరస్‌ కట్టడి కోసం ప్రపంచంలోనే అన్నింటి కంటే ముందుగా రిజిస్టర్‌ అయిన వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌–వి’. రష్యా సాయంతో భారత్‌కు చెందిన ‘హెటెరో’ ఫార్మాస్యూటికల్‌ సంస్థ దీనిని తయారు చేస్తోంది. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌) ఆర్థిక సాయంతో దీని రూపకల్పన జరిగింది. క్లినికల్‌ పరీక్షల్లో ఇది 95 శాతం సత్ఫలితాలను సాధించినట్లు రష్యా తాజాగా ప్రకటించింది. అయితే, పరీక్షలు జరిపిన పద్ధతులను, ఫలితాల వివరాలను సమగ్రంగా వెల్లడించలేదు. ప్రపంచంలోని మిగిలిన వ్యాక్సిన్ల కంటే తక్కువ ధరకే– అంటే ఒక్కో మోతాదు దాదాపు పది డాలర్లకే (రూ.740)  అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు రష్యా ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే  ఏడాదికి పది కోట్ల డోసుల ‘స్పుత్నిక్‌–వి’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నామని ‘హెటెరో’ సంస్థ ప్రకటించింది. 
-డాక్టర్‌ ఎమ్‌.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

నాలుగు రకాల వ్యాక్సిన్లు..
‘కరోనా’ వైరస్‌ కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లు ప్రధానంగా నాలుగు రకాలు. ఇవి: హోల్‌ వైరస్‌ వ్యాక్సిన్లు (వ్యాధికి కారణమయ్యే పూర్తి వైరస్‌ను క్రియాహీనం చేసి, దానితో తయారు చేసేవి), ప్రోటీన్‌ సబ్‌యూనిట్‌ వ్యాక్సిన్లు (రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయగల వ్యాధికారక సూక్ష్మజీవిలోని ప్రొటీన్‌ భాగం నుంచి తయారయ్యేవి), న్యూక్లిక్‌ యాసిడ్‌ వ్యాక్సిన్లు (వ్యాధికారక డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ నుంచి తయారు చేసేవి), వెక్టర్‌ వ్యాక్సిన్లు (వ్యాధి కలిగించే వైరస్‌ను ఎదుర్కోగల సాధారణ వైరస్‌తో తయారు చేసేవి). ‘కరోనా’ వైరస్‌ను అరికట్టేందుకు ఇప్పటికే పదుల సంఖ్యలో తయారై, క్లినికల్‌ పరీక్షలు పూర్తి చేసుకున్నవి, వందల సంఖ్యలో వివిధ స్థాయిలలోని పరీక్షలు కొనసాగిస్తున్న వ్యాక్సిన్లన్నీ ఈ నాలుగు రకాలకు చెందినవే. ‘కరోనా’విజృంభణ మొదలైన తొలినాళ్లలో– అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి కనీసం పద్దెనిమిది నెలలైనా పడుతుందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. అయితే, వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు దీనికోసం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగడంతో పాటు వారికి ఆశించిన నిధులు కూడా సమకూరడంతో అనుకున్న సమయాని కంటే ముందే కొన్ని వ్యాక్సిన్లు పూర్తిస్థాయి వినియోగానికి సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్ల పంపిణీ కోసం వివిధ దేశాలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

మన దేశంలో తొలివిడత 30 కోట్ల మందికి
‘కరోనా’ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే తొలివిడతగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలివిడతలో ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, యాభయ్యేళ్లకు పైబడిన వారు, తీవ్ర సమస్యలతో బాధపడుతున్న యువతకు ముందుగా వ్యాక్సిన్‌ వేయాలని జాతీయ వ్యాక్సిన్‌ కమిటీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య సలహాదారు విజయరాఘవన్‌ మీడియాకు తెలిపారు. వచ్చే మార్చి తర్వాత కోట్లాది యూనిట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా ఈ వ్యాక్సిన్‌ను కోటిమంది ఆరోగ్య కార్యకర్తలకు, రెండు కోట్ల మంది కేంద్ర, రాష్ట్రాల్లోని పోలీసు, సైనిక సిబ్బందికి ఇస్తారు. ఆ తర్వాత యాభై ఏళ్లకు పైబడిన వారికి, గుండెజబ్బులు, డయాబెటిస్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇస్తారు. వీరి సంఖ్య దాదాపు 26 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. చివరిగా యాభై ఏళ్ల లోపు వయసులో ఉన్నా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు