లాక్‌డౌన్‌ పంట; మేడ మీద చూడమంట

21 Dec, 2020 12:34 IST|Sakshi

ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్‌డౌన్‌ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే.

శామ్‌ జోసెఫ్‌ కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఆర్‌టీసీ స్టేషన్‌ మాస్టర్‌. సెలినె ముత్తొమ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో సీనియర్‌ ట్యూటర్‌. ఈ దంపతులు కోవిడ్‌ విరామంలో ఓ ప్రయోగం చేశారు. తమ ఇంటి పై భాగంలో సరదాగా వరిపంట సాగు చేశారు. ‘‘ఎంత పండించామన్నది ముఖ్యం కాదండీ., ఎలా పండించామన్నదే మీరు చూడాల్సింది’’ అంటున్నారు ఈ దంపతులు. టెర్రస్‌ మీద సాగు అనగానే మడి కట్టి మట్టి పరిచి, నీరు చల్లి నారు పోసి ఉంటారనే అనుకుంటాం. కానీ వీళ్లు నీళ్ల సీసాల్లో పెంచారు. వాడి పారేసిన వాటర్‌ బాటిల్స్‌ పై భాగాన్ని కత్తిరించి, బాటిల్స్‌లో కొద్దిపాటి మట్టి, ఆవు ఎరువు వేసి నీరు పోశారు. అందులో వరి నారును నాటారు. నెలలు గడిచాయి. వరి వెన్ను తీసింది, గింజ పట్టింది, తాలు తరక కాకుండా గట్టి గింజలతో వరి కంకులు బరువుగా తలలు వంచాయి.

ధాన్యం గింజలు గట్టిపడి, వరికంకులు పచ్చిదనం, పచ్చదనం తగ్గి బంగారు రంగులోకి మారాయి. జోసెఫ్‌ దంపతులు పంటను కోసి, కంకులను నూర్చి, ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్ని డబ్బాలో నింపారు. తూకం వేస్తే నాలుగు కిలోలు మాత్రమే. చేపల తొట్టె గట్టు మీద 175 సీసాల్లో ఇంతకంటే ఎక్కువ ధాన్యాన్ని పండించడం కుదిరే పని కూడా కాదు. జోసెఫ్‌ దంపతులు ఇంటి మీద పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. చేపలను పెంచుతున్నారు. ఇంటి మీదున్న చేపల తొట్టెలో రెండు వందల చేపలు పెరుగుతున్నాయి. ఇంటి ఆవరణలో మరో చేపల తొట్టెలో ఐదు వందల చేపలు పెరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తామని, ఈ సారి ఎక్కువగా సాగు చేస్తామని చెప్తున్నారు జోసెఫ్, సెలినె. ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్‌డౌన్‌ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇద్దరికీ ఉద్యోగాల్లో విరామం వచ్చింది. ఆ విరామం ఒక వరి పంట కాలం. అన్‌ లాక్‌ అయ్యి ఆర్టీసీ బస్సులు నడిచే నాటికి పంట చేతికొచ్చింది.

మరిన్ని వార్తలు