ఇవే ఇమ్యూనిటీ బూస్టర్స్‌...

12 Jan, 2021 08:59 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్‌–19 లేదా కరోనా వైరస్‌ దాటికి గజగజ వణికిపోతుంది. దీనికితోడు వర్షాకాలం, చలికాలం రాబోతున్న సమయంలో మరిన్ని సాంక్రమిక వ్యాధులు పెచ్చురిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో వ్యాధులు వచ్చాక చికిత్స కన్నా, నివారణ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు  ఇంతకీ ఏంతింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది? ఏవి తినాలి? ఏవి తినకూడదు?.. చూద్దాం...

రోగనిరోధక శక్తిని పెంచడంలో  ఏ, బీ, సీ, డీ, ఈ విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్‌ వంటి ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటికి కనిపించని హానికారక సూక్ష్మ జీవుల కారణంగా సంక్రమించే అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్‌ ఏ దోహదపడుతుంది. విటమిన్‌ సీ, బీటా కెరోటిన్, ఈ, డీ విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పోషకాలన్నీ  మన శరీరానికి చేరతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మోతాదుకు మించి పోషకాలు తీసుకున్నా ఇతర రకాల సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

ఎక్కడ దొరుకుతాయి? 
ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. అందువల్ల వీటన్నింటిని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో పోషకాలు అధికంగా లభిస్తాయి. అధికంగా ప్రాసెస్‌ చేసి వండి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. కార్బోనేటెడ్‌ శీత పానీయాలు తాగకూడదు. వీటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్‌ లాంటి ముఖ్యమైన పోషకాలు ఏవీ ఉండవు. మాంసం, గుడ్లు వంటి ఆహారాలను బాగా ఉండికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి. లేదంటే వాటి మీద ఉన్న సూక్ష్మజీవులు మన శరీరంలోకి సులభంగా ప్రవేశించి వివిధ అనారోగ్యాలను కలుగచేస్తాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి రోజుకి 30 గ్రాములకు మించి నూనెను, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు.

చక్కెరలో కెలరీలు తప్పించి పోషకాలు ఏవీ ఉండవు. అందువల్ల చక్కెరను మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఈ అలవాట్లు ఉన్న వారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వీటిని మానేయాలి. మరీ ముఖ్యంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి. నీరు శరీర ఉష్ణోగ్రతలను సమ స్థితిలో ఉంచడంతోపాటు. శరీరంలో వ్యర్థాలను స్వేదం, మూత్రం ద్వారా బయటకు పంపి మన శరీరాన్ని స్వచ్చగా ఉంచుతుంది. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితోపాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్లు  ఏ, ఈలు, పొటాషియం, ఫోలేట్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకునేందుకు ఇవి ఎంతగానో సాయపడతాయి.

నారిజం, నిమ్మ, బత్తాయి, బెర్రీ వంటి సిట్రస్‌ జాతికి చెందిన పండ్లలో విటమిన్‌ సీ పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో బీటా కెరోటిన్, విటమిన్‌ ఏ,  సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతున్న వారు ఇప్పటిదాక వాడుతున్న మందులను వాడుకుంటూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే కాకుండే ఎవరైనా సరే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకుంటూ, రోజూ సమతుల ఆహారం తీసుకోవాలని, అప్పుడు ఆటోమేటిగ్గా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణుల మాట!.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు