పేడ ఉత్పత్తులతోనే దేశీ పశువుల సంరక్షణ!

22 Sep, 2020 08:41 IST|Sakshi
ఆవు పేడ, మూత్రంతో తయారైన ఉత్పత్తులను చూపుతున్న అపర్ణ రాజగోపాల్‌

దేశీ గో జాతుల పరిరక్షణకు కృషి చేసే వారు ఈ జాతి పశువుల పేడతో తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకుంటే చాలని, పాలపై ఆధారపడనక్కర లేదని అపర్ణ రాజగోపాల్‌ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆమె న్యూఢిల్లీకి దగ్గరలోని ఉత్తరప్రదేశ్‌ గౌతమ్‌ బుద్ధనగర్‌ జిల్లాలో 10 ఎకరాలలో ‘బీజోమ్‌’ పేరిట సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతున్నారు. న్యూఢిల్లీ నుండి అరగంట ప్రయాణం. కబేళాలకు తరలిస్తున్న దేశీ గోజాతుల పశువులను రక్షించి తన క్షేత్రంలోనే గోసంరక్షణ శాలను ఏర్పాటు చేసి పోషిస్తున్నారు. ప్రస్తుతం 12 వేర్వేరు భారతీయ జాతులకు చెందిన 120 ఆవులు ఉన్నాయి. అపర్ణ ఒక ప్రత్యేకమైన వ్యాపార నమూనాను అనుసరిస్తున్నారు. ఆమె ఈ ఆవుల పాలను అమ్మరు, దూడల కోసం ఉంచుతారు. బదులుగా, ఆమె వాటి పేడ నుండి ఒక వ్యాపారాన్ని సృష్టించారు. తన సంస్థను ఆమె ‘డంగ్‌ హోమ్‌’ అని పిలుస్తుంటారు.

కేవలం పేడ అమ్మటం లాభదాయకంగా ఉంటుందా? ముఖ్యంగా అ2 బీటా–కేసిన్‌ కలిగిన దేశీయ ఆవుల పాలకు రోజు రోజుకూ డిమాండ్‌ పెరుగుతున్నప్పుడు ఇలా చేయగలగడం సాధ్యమా? అని మనకు సందేహం కలగవచ్చు. అయితే, పాలకు బదులు పేడను అమ్మే తన వ్యాపార నమూనా కూడా అంతే ప్రభావ వంతంగా ఉంటుందని అపర్ణ రాజగోపాల్‌ అభిప్రాయపడ్డారు. 120 ఆవులు ప్రతి రోజూ 1,300 కిలోగ్రాముల పేడ వేస్తాయి. పేడను అలాగే అమ్మేయకుండా ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చి మంచి ధరకు అమ్మడమే ఆమె వ్యాపార విజయ రహస్యం.  పేడ హోమ్‌లో తయారు చేసిన అత్యంత ఆసక్తికరమైన ఉత్పత్తులలో ఒకటి ఆవు పేడ కట్టెలు! ప్రత్యేకమైన యంత్రం సహాయం తో పచ్చి పేడతోనే నాలుగు పలకలుగా, మీటర్‌ పొడుగ్గా వుండే దుంగలను తయారు చేస్తారు. స్మశానంలో మృతదేహాల దహనానికి చెట్ల కలప లేదా బొగ్గుకు బదులుగా ఈ పేడ కట్టెలను ఉపయోగించవచ్చు. వీటిని కాల్చడం వల్ల కలపను కాల్చడం కంటే తక్కువ కాలుష్య కారకాలు విడుదల అవుతాయి.

పేడతో కట్టెలతో పాటు, బీజోమ్‌ సంస్థ పూల కుండీలు, భారతీయ దేవతల విగ్రహాలు, పూజా కిట్లు, పేడ ఎరువు, జీవ పురుగుమందులను కూడా తయారు చేసి విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులన్నీ ఆవు పేడ, మూత్రంతోనే తయారవుతాయి. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఆవుల పేడ మరింత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సంకర జాతి పశువుల పేడలో కంటే వీటి పేడలో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది. ‘పేడ నుంచి ఈ విలువ–ఆధారిత ఉత్పత్తులను సృష్టించడం వెనుక ఉన్న వనరులను సమర్థవంతంగా పునర్‌ వినియోగించటం, తద్వారా పాలు తక్కువగా ఇచ్చే లేదా పాలు ఇవ్వని దేశీయ పశువులను స్థిరమైన మార్గంలో సంరక్షించవచ్చు‘ అని అపర్ణ రాజగోపాల్‌ అంటారు. ఈ నమూనా చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుందని అపర్ణ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు