‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు!

11 Nov, 2020 08:11 IST|Sakshi
ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో దేశవాళీ ఆవులు

సూరారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాలు 

 పోషక, ఔషధ విలువలు కలిగిన దేశీ వరి వంగడాల సాగు

ఆవు పెరుగు, నెయ్యితో  సుగర్‌ వ్యాధి నియంత్రణ

ఎన్‌.ఐ.ఎన్‌.తో కలిసి లోతైన పరిశోధనకు రంగం సిద్ధం 

ఇదొక విలక్షణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. అపురూపమైన దేశీ వరి రకాలతోపాటు.. అరుదైన గడ్డి రకాలు కూడా అక్కడ సాగవుతున్నాయి. అంతేకాదు.. ఔషధ విలువలు కలిగిన ప్రత్యేక దాణా మేపు ద్వారా దేశీ ఆవుల పెంపకం ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం విశిష్టత. ఈ ఆవుల పాలతో తయారైన పెరుగు, నెయ్యి దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని, వీటిని తిన్న వారిలో మందులు వాడకుండానే షుగర్‌ నియంత్రణలో ఉంటున్నదని పశువైద్య శాస్త్రవేత్త డా. సాయి బుచ్చారావు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌.ఐ.ఎన్‌.) ఇటీవల సుముఖత తెలిపిందని వెల్లడించారు. మూడేళ్లు కొనసాగే ఈ ప్రయోగం శాస్త్రీయంగా రుజువైతే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మేలు జరగడంతోపాటు.. దేశీ ఆవుల పెంపకందారులకు స్థిరమైన మంచి ఆదాయం కూడా సమకూరుతుందనటంలో సందేహం లేదు.  సిద్ధార్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం శివారులో 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ వేగిశ్న శ్రీనివాస్‌ రాజు దేశవాళీ గోజాతులపై ఉన్న అమితమైన ప్రేమతో తన భూమిని రాజీలేని గో ఆధారిత ప్రకతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. 18 సాహివాల్‌ దేశవాళీ ఆవులను పెంచుతున్నారు. పంటలు, పశుగ్రాసం సాగులో గాని, ఆవుల పోషణలో గాని రసాయనాలకు ఏమాత్రం చోటివ్వకుండా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తుండటం విశేషం. 

అంతరించిపోతున్న దేశవాళీ వరి వంగడాల్లో పోషకాలతో పాటు ఔషధ విలువలు పుష్కలంగా ఉంటాయని రాజు నమ్ముతూ ఈ రకాలనే మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. రత్నచోడి, నవార, బ్లాక్‌ రైస్, బహురూపి, నారాయణ కామిని, తెల్లహంస తదితర దేశీ రకాల ధాన్యాన్ని పండిస్తున్నారు. ఈ రకాలు 130–150 రోజుల్లో కోతకు వస్తాయి. ధాన్యాన్ని అమ్మటం లేదు. తానే బియ్యం పట్టించి షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సైతం పొందుతున్నారు. క్వింటా మార్కెట్లో రూ.10 వేల ధర పలుకుతున్నదన్నారు. పిండి పదార్థం తక్కువగా, పీచు శాతం ఎక్కువగా ఉండి దేహానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అంటారు. దేశీ వరి రకాల విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు అందజేçస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు వరి సాగులో ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేస్తుంటే.. ఈయన రూ. 11,500 ఖర్చుతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం, కషాయాలు రైతు స్వయంగా తయారు చేసుకొని వాడాలి. కాయకష్టమే తప్ప పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఆరోగ్యమైన ఉత్పత్తులు చేతికి అందుతాయి అంటున్నారు శ్రీనివాస్‌ రాజు.

ఆవుల కోసం ఏడు రకాల గడ్డి సాగు
18 దేశవాళీ సాహివాల్‌ ఆవుల మేత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏడు రకాల కాయ, పప్పు జాతుల పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 25% ప్రొటీన్‌ కలిగి ఉండే ఛాయ (స్పినాచ్‌ ట్రీ) పశుగ్రాస చెట్లను సాగు చేస్తున్నారు. తూ.గో. జిల్లా నుంచి తెప్పించిన చెంగల్వ గడ్డి, గుజరాత్‌ నుంచి తెచ్చిన జింజువ గడ్డితోపాటు సూపర్‌ నాపియర్, హెడ్జ్‌ లూసర్న్‌ తదితర రకాల గడ్డిని ఆరు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రముఖ పశువైద్య నిపుణులు డా. సాయిబుచ్చారావు సూచనల మేరకు వీటి ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.    

  ఔషధ గుణాలతో కూడిన దాణా
రసాయన రహితంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో పండించిన జొన్నలు, మొక్కజొన్నలు తదితర ముడి పదార్థాలనే ఆవులకు దాణాగా వాడుతున్నారు. అంతేకాదు.. ఆ దాణాలో 21 రకాల ఔషధ మొక్కల నుంచి సేకరించిన వేర్లు, ఆకులు, కాండాలను ప్రత్యేక శ్రద్ధతో ఆయుర్వేద నియమాల ప్రకారం శుద్ధి చేసి.. పొడిగా చేసి.. ఆ పొడిని కలిపిన దాణాను సాహివాల్‌ ఆవులకు మేపుతున్నారు. వ్యవసాయ పనుల కోసం ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తున్నారు. 

దేశీ ఆవుపాల ఉత్పత్తులపై పరిశోధన
సీనియర్‌ పశువైద్య నిపుణులు డాక్టర్‌ ఎం. సాయి బుచ్చారావు దేశీ గోజాతులపై గత 8 సంవత్సరాలుగా విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. ఔషధ మూలికల పొడిని తగు మోతాదులో కలిపిన దాణాను దేశీ ఆవులకు తినిపించడం ద్వారా.. వాటి పాలల్లో ఔషధ గుణాలను పెంపొందించవచ్చని ఆయన అంటున్నారు. 
ఈ పాలతో తయారైన పెరుగు, నెయ్యి తిన్న వారిలో మధుమేహం (టైప్‌1, టైప్‌2 కూడా) మందులతో అవసరం లేకుండా నియంత్రణలోకి వస్తుందని 2012 నుంచి తాను నిర్వహిస్తున్న పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు. తూ.గో. జిల్లా తాపేశ్వరం, ప.గో. జిల్లా ఐ. భీమవరం, చిన్నకాపవరంలలో ఒంగోలు, గిర్, సాహివాల్‌ ఆవులతో పరిశోధనలు చేశానన్నారు. వీటి పెరుగు, నెయ్యి తిన్న వారిలో మధుమేహం నియంత్రణ మందులు అవసరం లేకుండా సాధ్యపడిందని డా. సాయి బుచ్చారావు అన్నారు.  

అధ్యయనానికి ఎన్‌.ఐ.ఎన్‌. సింసిద్ధత
ఔషధ మూలికల పొడితో కూడిన దాణా తినటం వల్ల దేశీ ఆవుల పాల ఉత్పత్తుల్లో ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నదీ తెలుసుకోవడానికి గతంలో ప్రయోగశాలలో లోతైన అధ్యయనం నిర్వహించలేదని డా. సాయి బుచ్చారావు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతైన పరీక్షలు చేయడానికి రీసెర్చ్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌.ఐ.ఎన్‌.) ఇటీవలే ప్రాథమికంగా అంగీకారం తెలిపిందని డాక్టర్‌ సాయి బుచ్చారావు వెల్లడించారు. ఈ పూర్వరంగంలో సిద్ధార్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా ఎన్‌.ఐ.ఎన్‌. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అనంతన్‌ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు ఈ పరిశోధనలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు పూర్తిగా విజయవంతం అయితే దేశీ గోజాతుల పెంపకంపై రైతులకు ఆసక్తితోపాటు వాటి సంతతి పెరుగుతుందని డా. సాయిబుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు. మధుమేహాన్ని పారదోలడంతో పాటు దేశీ ఆవులను పెంచి పోషించే రైతులకు స్థిరమైన ఆదాయ మార్గం చూపడమే తమ లక్ష్యమని డా. సాయి బుచ్చారావు అంటున్నారు. 
– కైరంకొండ నర్సింలు, సదాశివపేట రూరల్‌

ఎన్‌.ఐ.ఎన్‌. అంగీకారం సంతోషదాయకం
ఔషధ మూలికల దాణా తిన్న దేశీ ఆవుల పెరుగు, నెయ్యిలో మధుమేహాన్ని నియంత్రించే సుగుణం ఉందని నా 8 ఏళ్ల పరిశోధనలో తెలుసుకున్నాను. అయితే, 3 నెలల తర్వాత కొందరి సుగర్‌ లెవల్స్‌లో హెచ్చు తగ్గులు కనిపించాయి. అందుకు గల కారణాలపై గతంలో లేబరేటరీ పరీక్షల ద్వారా పరిశోధించలేదు. ప్రాథమిక పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట లోతుగా అధ్యయనం చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌.ఐ.ఎన్‌.) అంగీకరించటం సంతోషదాయకం. దేశీ ఆవులతోపాటు సంకర జాతి/విదేశీ జాతుల ఆవులు, గేదెలపై కూడా గతంలో పరిశోధన చేశా. అయితే, సంకర జాతి/విదేశీ జాతుల ఆవుల పెరుగు, నెయ్యి తిన్న మధుమేహ రోగుల్లో ఎటువంటి సత్ఫలితాలు కనిపించలేదు. గేదె పెరుగు, నెయ్యి ద్వారా ఫలితాలు కొంతవరకు కనిపించాయి. తాజాగా ఎన్‌.ఐ.ఎన్‌. చేపట్టబోయే పరిశోధనల్లోనూ దేశీ ఆవులతోపాటు సంకరజాతి, గేదెలపై కూడా పరిశోధన జరుగుతుంది. 
– డా. ఎం.సాయి బుచ్చారావు , (99122 92229), ప్రముఖ పశువైద్య శాస్త్రవేత్త

మరిన్ని వార్తలు