Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్‌ సూత్రం

29 Oct, 2022 00:47 IST|Sakshi

హైదరాబాద్‌ నగరం... దుర్గం చెరువు వంతెనకు సస్పెండెడ్‌ రోప్‌ ప్లాట్‌ఫామ్‌. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ఓ వలయాకారపు షాఫ్ట్‌. బహుళ అంతస్తుల నిర్మాణంలో పాసెంజర్‌ అండ్‌ మెటీరియల్‌ హాయిస్ట్‌. ఇవన్నీ సాంకేతికరంగం రూపొందించుకున్న అద్భుతమైన ఆవిష్కరణలు. వీటి రూపకల్పన... తయారీలో కీలకమైన మహిళ... జ్యోత్స్న చెరువు.

‘ఇండిపెండెంట్‌గా నిలబడాలంటే ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి, ఇండిపెండెంట్‌గా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు పదిమంది నడిచే దారిలో పదకొండవ వ్యక్తిగా మిగలకుండా మీదైన కొత్త çపథాన్ని నిర్మించుకోగలుగుతా’ రంటూ మహిళలకు సందేశమిస్తుంటారు... సీఎమ్‌ఏసీ, మెకనైజేషన్‌ అండ్‌ ఆటోమేషన్‌ ఇన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ డైరెక్టర్‌ జ్యోత్స్న చెరువు. ‘ప్రౌడ్‌ టు మేక్‌ ఇన్‌ ఇండియా, ఎక్స్‌పోర్ట్‌ దెమ్‌ యాజ్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా’ నినాదంతో పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోత్స్న చెరువు తన వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.
 
► సీబీఐటీ స్టూడెంట్‌ని!
‘‘నేను పుట్టింది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో. తాత అప్పుడు అక్కడ రైల్వే ఉద్యోగి. అలా అది మా అమ్మమ్మగారి ఊరైంది. నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా మేము పెరిగిందీ, చదువు, కెరీర్‌ అంతా హైదరాబాద్‌లోనే. మా కాలేజ్‌ రోజుల్లో అమ్మాయిలు సివిల్‌ ఇంజనీరింగ్‌ని పెద్దగా తీసుకునేవాళ్లు కాదు. నాకు సీబీఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. చేరిన తర్వాత సబ్జెక్ట్‌లో ఉన్న అందం తెలిసి వచ్చింది. ఆనందంగా ఆస్వాదిస్తూ కోర్సు పూర్తి చేశాను.

ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేశాను. మా వారు మెకానికల్‌ ఇంజనీర్‌. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరమూ ఉద్యోగం చేశాం. మా వారి ఉద్యోగరీత్యా పూనాకి వెళ్లాం. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. నేనక్కడ ఉద్యోగంలో చేరలేదు, కానీ హోమ్‌ బ్యూటిఫికేషన్‌ వంటి సర్వీస్‌ ప్రాజెక్టులు మొదలుపెట్టాను. మార్కెట్‌ అవగాహన ఉంది కాబట్టి నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టమని ఓ రిటైర్డ్‌ పర్సన్‌ చెప్పిన మాట నన్ను పారిశ్రామికవేత్తగా నిలిపాయి.

► నిర్మాణరంగంలో సాంకేతిక వేగం!
పిల్లలు పెద్దవుతున్నారు, హైదరాబాద్‌కి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చిన నాటికి హైదరాబాద్‌ నగరంలో భవన నిర్మాణరంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. 25–30 అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైన రోజులవి. అది నాకు బాగా కలిసి వచ్చింది. నిర్మాణరంగంలో అవసరమైన కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్‌ తయారీని ప్రారంభించాం. ఎలక్ట్రో మెకానికల్‌ ఎక్విప్‌మెంట్‌ని అప్పటివరకు చైనా, యూరప్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన నిర్మాణసంస్థలకు అవన్నీ ఇండియాలోనే దొరకడం మంచి సౌలభ్యం కదా.

అలా 2006లో మొదలైన మా కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలకు సేవలందిస్తోంది. వ్యాపారం అంటే... సమాజం లోని అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, ఒక సమస్యకు పరిష్కారం చూపించడం. అప్పుడే బిజినెస్‌ విజయవంతమవుతుంది. మా కంపెనీ సిద్ధాంతం నాలుగు ‘ఎస్‌’లు... స్పీడ్, సేఫ్టీ, సేవింగ్స్, స్ట్రెంగ్త్‌. పని వేగంగా జరగాలి, పనిలో పాల్గొనే కార్మికులకు రక్షణ కల్పించాలి, ప్రాజెక్టు వ్యయం తగ్గాలి, పని చేసే కార్మికుని శక్తిని ఇనుమడింప చేయాలి.

మా క్లయింట్‌ అవసరానికి తగినట్లు కస్టమైజ్‌డ్‌ ఎక్విప్‌మెంట్‌ను డిజైన్‌ చేయడం, తయారు చేయడం, ఇన్‌స్టాల్‌ చేయడం, యాన్యుయల్‌ మెయింటెనెన్స్‌ సర్వీస్‌ ఇవ్వడం, ఆ కంపెనీ ప్రాజెక్టు మరో చోటకు మారినప్పుడు ఎక్విప్‌మెంట్‌ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి అమర్చడం... ఇలా ఉంటుంది మా పని. ఇప్పుడు దేశం ఎల్లలు దాటి విదేశాలకు కూడా విస్తరించాం. నా రంగంలో నేను లక్ష్యంగా పెట్టుకున్న శిఖరానికి చేరాననే చెప్పాలి. నా వంతు బాధ్యతగా మహిళా సమాజానికి, యువతకు కెరీర్‌ ప్లానింగ్‌ గురించి చెబుతున్నాను.

కోవె (కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) తెలంగాణ అధ్యక్షురాలిగా వేలాది మహిళలకు, యువతకు ఎంటర్‌ప్రెన్యూరల్‌ మైండ్‌సెట్‌ క్లాసులు చెప్తున్నాను. కంపెనీ నిర్వహణలో ఉద్యోగులను కలుపుకుపోవడం చాలా అవసరం. పని వరకే చేయించుకుని మిగిలిన విషయాల్లో వాళ్లను డార్క్‌లో ఉంచరాదు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వారితో చర్చించాలి. ఈ కంపెనీతో కొనసాగితే కెరీర్‌లో పైకి ఎదగగలమనే భరోసా కలిగితేనే ఉద్యోగులు మనతో కొనసాగుతారు. ఇలాంటి అనేక విషయాలను చెబుతుంటాను. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది. ఏటా ఈ ఏడాది ఎంతమంది మహిళలకు దిశానిర్దేశం చేశానని లెక్కచూసుకున్నప్పుడు కనిపించే పెద్ద సంఖ్య నాకు ఆత్మసంతృప్తి కలిగించే విషయం ’’ అని వివరించారు జ్యోత్స్న చెరువు.

లీడర్‌గా ఎదిగేది కొందరే!
మా దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చిన మహిళలకు నేను చెప్పే తొలిమాట ‘మీ స్ట్రెంగ్త్‌ ఏమిటో మీరు తెలుసుకోండి’ అని. వాళ్లకు ఏం వచ్చో తెలిసిన తర్వాత వాళ్లకు ఎటువంటి కెరీర్‌ సౌకర్యంగా ఉంటుందో సూచిస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే... మొదటగా ఉండాల్సింది స్థిరత్వం. చిన్న ఉదాహరణ చెబుతాను... ఒక ఇస్త్రీ షాపు వ్యక్తి రోజూ కచ్చితంగా షాపు తెరవకపోతే మనం దుస్తులు ఇవ్వం కదా! రోజూ ఠంచన్‌గా పని చేసే వ్యక్తికి మాత్రమే ఇస్తాం. ఇంటి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర కూరగాయలు కొనాలన్నా అంతే. మన సర్వీస్‌ అందుకునే క్లయింట్‌ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితిని కల్పించకూడదు. ఎందరు వచ్చినా, ఎవరూ రాకపోయినా సరే వర్క్‌ప్లేస్‌ని మూతవేయరాదు.

నేను నా రంగంలో సంపాదించుకున్న నమ్మకం అదే. ఏ సమయంలో ఫోన్‌ వచ్చినా సరే... ఎవరో ఒకరు హాజరవుతారనే భరోసా కల్పించడంలో విజయవంతం అయ్యాం. మా దగ్గరకు కోర్సులో చేరిన పాతిక మందిలో చివరకు ఆ కోర్సును ఉపయోగపెట్టుకునేవాళ్లు పదికి మించరు. కోర్సు సమయంలో ‘ఇంటికి బంధువులు వచ్చార’ని క్లాసు మానేసే వాళ్లు ఎంటర్‌ ప్రెన్యూర్‌గా కూడా కొనసాగలేరు. బిజినెస్‌ రంగంలో ఉన్న ఇద్దరు మగవాళ్లు కలిస్తే తమ వ్యాపారం గురించి, ఇతరుల వ్యాపారం గురించి, విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు మహిళలు రిలేషన్‌ షిప్‌ మీద మాట్లాడినంతగా తమ ప్రొఫెషన్‌ గురించి చర్చించరు. ప్రొఫెషన్‌ గురించి మాట్లాడగలిగిన మహిళలే లీడర్‌లుగా ఎదుగుతారు, ఫీల్డ్‌లో విజయవంతంగా నిలబడగలుగుతారు.
– జ్యోత్స్న చెరువు, డైరెక్టర్, సిఎమ్‌ఏసీ, ప్రెసిడెంట్, కోవె తెలంగాణ 

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : మోహనాచారి

మరిన్ని వార్తలు