అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం

29 Mar, 2023 06:00 IST|Sakshi
సిద్దరాములు విగ్రహం

బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది.

కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్‌పీఎఫ్‌ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్‌ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.

గుండెలో పేలిన బాంబు
1997 డిసెంబర్‌ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్‌పీఎఫ్‌ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు.

ఆ జ్ఞాపకాల్లోనే..
కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్‌ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్‌ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్‌ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్‌ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది.  

జై జవాన్‌..
గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్‌ అంటూ దేశసేవలో జవాన్‌ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు.

కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది
చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు.
– కంది నాగమణి, అమర జవాన్‌ సిద్దరాములు తల్లి

– ఎస్‌.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

మరిన్ని వార్తలు