‘రసోయి కీ రహస్య’ : కాకి అరుపుతో ఆశలు చిగురించాయి.. ఆమెకు హాట్సాఫ్‌

12 Mar, 2022 18:39 IST|Sakshi

డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగం చేయాలి. నెల నెలా వచ్చే జీతంతో ఇవి చేద్దాం అవిచేద్దాం అని ఎన్నో కలలు. కానీ అనుకోకుండా ఎదురైన అనారోగ్యం మొత్తం జీవితాన్నే చీకటి మయం చేసింది. అయినా ఏమాత్రం భయపడలేదు పాయల్‌. అప్పటిదాకా తన కళ్లతో అందమైన ప్రపంచాన్ని చూసిన కళ్లు ఇక మీదట చూడలేవన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. తరువాత మెల్లగా కోలుకుని తన కాళ్ల మీద తను నిలబడి, చూపులేని వారెందరికో కుకింగ్‌ పాటాలు నేర్పిస్తోంది.

పంజాబీ కుటుంబంలో పుట్టిన పాయల్‌ కపూర్‌ చిన్నప్పటి నుంచి చాలా చురుకు. అది 1992 ఆగస్టు..అప్పుడే పాయల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్‌లోని ఒబేరాయ్‌ హోటల్‌లో ఉద్యోగం దొరికింది. రోజూ ఉద్యోగానికి వెళ్లడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం పాయల్‌ దినచర్య. అనుకోకుండా ఒకరోజు హోటల్‌లో పనిచేస్తోన్న సమయంలో అనారోగ్యంగా అనిపించింది. డాక్టర్‌ను కలవగా.. సాధారణ జ్వరమని అన్నారు. కానీ మూడు రోజులైనా తగ్గకపోగా మరింత తీవ్రం అయ్యింది. ఉదయం అద్దంలో తన ముఖాన్ని తనే సరిగా చూడలేకపోయింది.  దీంతో వెంటనే కళ్ల డాక్టర్‌ను, నరాల డాక్టర్లను కలిసింది. ఒక నెలరోజులపాటు హైదరాబాద్‌ లోని ఓ ఆసుపత్రిలో ఉంది. అయినా ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో పాయల్‌ను ముంబై తీసుకెళ్లారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనుపాపను అటు ఇటు తిప్పలేకపోయింది. వినలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి సమస్యలు కూడా వాటికి తోడయ్యాయి. 

కాకి అరుపుతో..
కొంతమంది వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా పాయల్‌ జీవితం అంధకారమైంది. పాయల్‌కు ఏదైనా చెప్పాలంటే కుటుంబ సభ్యులు ఆమె చెయ్యి మీద వేళ్లతో రాసేవారు. రోజులు అతికష్టంగా గడుస్తోన్న సమయంలో ఏడునెలల పాటు జరిగిన చికిత్సల మూలంగా ఆరోగ్యంలో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఓ రోజు పాయల్‌కు కాకి అరుపు వినిపించింది. ఈ శబ్దం మోడుబారిన జీవితంలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో హైదరాబాద్‌ తిరిగొచ్చింది పాయల్‌. క్రమంగా వినికిడి, వాసనలు తెలిసినప్పటికీ చూపు మాత్రం రాలేదు. 

ఆరేళ్ల తరువాత..
పాయల్‌ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని తెలిసిన ఆమె స్నేహితులు తనని సినిమాలకు తీసుకెళ్లడం, ఆమెతోపాటు బైక్‌ రైడ్స్‌ చేసేవారు. దీంతో తన పరిస్థితి మరింత మెరుగుపడింది. ఇదే సమయంలో అంధులను చూసుకునే ఓ ఎన్జీవో గురించి స్నేహితులు చెప్పారు. పాయల్‌ ఆ ఎన్జీవోని సంప్రదించడంతో వాళ్లు ఆమెకు తన పనులు తాను చేసుకోవడం నేర్పారు. వీటితోపాటు బ్రెయిలీ కూడా నేర్చుకుంది. తరువాత తనలా చూపులేక బాధపడుతోన్న వారికి పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పాయల్‌ను ఇష్టపడడంతో పెళ్లిచేసుకుంది. కానీ కొంత కాలం తర్వాత మనఃస్పర్ధలు రావడంతో విడిపోయారు.

భర్తతో విడిపోయాక పాయల్‌ ఒంటరిగా జీవించడం మొదలు పెట్టింది. హోటల్‌లో ఉద్యోగం చేస్తూనే వైకల్యంతో ఎదురయ్యే సమస్యలు మీద మాట్లాడడం, వంటల తయారీ గురించి చెబుతుండేది. కరోనా కారణంగా అన్నీ మూతపడడంతో వంటరాని వాళ్ల పరిస్థితి ఏంటీ? అని అనిపించింది పాయల్‌కు. దీంతో 2020లో ‘రసోయి కీ రహస్య’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. వంటరాని వాళ్లకు వంటలు చేయడం ఎలా? చూపులేనివాళ్లు ఆహారాన్ని ఎలా వండుకోవచ్చో ట్యుటోరియల్స్‌ చెబుతోంది. అంతేగాక బ్రెయిలీలో వంటల తయారీ గురించి రాసి షేర్‌కూడా చేస్తుంది. 52 ఏళ్ల వయసులో ఎంతోయాక్టివ్‌గా యూ ట్యూబ్‌ చానల్‌ను నడుపుతూ పాయల్‌ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు