Health Tips: రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోస్‌ స్థాయిలు గణనీయంగా తగ్గాలంటే..

23 Sep, 2021 13:24 IST|Sakshi

మనలో చాలా మంది కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా తీసి పక్కన పెట్టేస్తాం! కానీ దీనిలోని పోషకాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ కరివేపాకు తీసిపారెయ్యలనే ఆలోచనే రాదంటే నమ్మండి. అవేంటో తెసుకుందామా..

మన భారతీయ ఆహార అలవాట్లలో కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. సాంబార్‌ నుంచి పెరుగు చట్నీ వరకు ప్రతి కూరలో దర్శనమిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో కరివేపాకు లేకుండా కూరలను అసలు ఊహించలేమంటే అతిశయోక్తి కాదేమో! కేవలం రుచి కి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిలో మెండేనండోయ్‌.

ఏమిటా ప్రయోజనాలు?
విటమన్‌ ‘ఎ’, ‘సి’, పొటాషియం, కాల్షియం, ఫైబర్‌, రాగి, ఐరన్‌ వంటి భిన్న రకాల పోషకాలు కరివేపాకు ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బరువును అదుపులో పెట్టడంలో, మధుమేహం నివారణలో, పేగు సంబంధిత ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది.

కొవ్వులను ఏ విధంగా నిరోధిస్తుంది?
కొలెస్ట్రాల్‌ స్థాయి అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు పొంచిఉ‍న్నట్లేనని ఎక్కువ మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ చైనీస్‌ మెడిసిన్‌ అధ్యనాల ప్రకారం రక్తంలోని గ్లూకోజ్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించే గుణం కరివేపాకు రసంలో పుష్కలంగా ఉందని వెల్లడించాయి. ఈ పరిశోధకులు డయాబెటిక్‌ ఎలుకలకు వరుసగా 10 రోజుల పాటు కరివేపాకు రసాన్ని ఇంట్రాపెరిటోనియల్‌ ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చారు. తద్వారా వీటి రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోస్‌ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. కాబట్టి మీ రోజువారి ఆహారంలో భాగంగా కరివేపాకు ఆకులను తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరాయిడ్‌ స్థాయిలు అదుపులో ఉంచడానికి తోడ్పడుతుందనేడి ఈ అధ్యయనాల సారాంశం. 

మన రోజువారీ ఆహారంలో కరివేపాకును ఏ విధంగా తీసుకోవాలి?
8-10 కరివేపాకు ఆకులు, చిన్న అల్లం ముక్కను నీళ్లలోవేసి 15 నుంచి 20 నిముషాలు మరగనియ్యండి. దీనిపై మూతను పెట్టి 10 నిముషాలు పక్కన పెట్టండి. తర్వాత వడకట్టి తాగండి. రుచికోసం దీనికి నిమ్మరసం, తేనెకూడా జోడించవచ్చు. ఇలా తయారు చేసిన టీని రోజు మొత్తంలో ఎ‍ప్పుడైనా తాగవచ్చు. అలాగే వివిధ రకాల వంటకాలలో కరివేపాకును చేర్చడం ద్వారా, కరివేపాకు పచ్చడి, లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ పిడికెడు కరివేపాకు ఆకులను నేరుగా తిన్నా మంచిదే.

నిపుణులు సూచిస్తున్న ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.

చదవండి: Typhoid Diet: టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం.. ఇవి తిన్నారంటే..

మరిన్ని వార్తలు