సిల్వర్‌ ఫాయిల్‌ సిస్టర్స్‌

29 Aug, 2021 03:59 IST|Sakshi
నిఖిత, అల్కా

సాధారణంగా గోల్డ్‌ ఫాయిల్‌ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్‌ను డిజైన్‌ చేస్తారు. అయితే హైదరాబాద్‌ అత్తాపూర్‌లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్‌ ఫాయిల్‌ను ఉపయోగించి, కస్టమైజ్డ్‌ గిఫ్ట్‌ ఐటమ్స్‌ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్‌ బోర్డులను సిల్వర్‌ ఫాయిల్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్‌ క్లాక్‌లు, వాల్‌ ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్‌.. ప్రతీ డిజైన్‌ వెండివెన్నెలలా చూపరులను ఆకట్టుకునేలా డిజైన్‌ చేస్తూ, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు.

ఇద్దరూ దూరపు బంధువులు. వరసకు అక్కాచెలెళ్లు. ఇద్దరూ గృహిణులుగా తమ తమ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకుంటూ, పిల్లల పనులు చూసుకుంటున్నారు. ‘ఎన్ని పనులున్నా మనలోని అభిరుచికి మెరుగులు దిద్దుకోవాల్సింది మనమే. అందుకే, కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం’ అని వివరించారు ఈ కజిన్స్‌.  

రోజూ ఎనిమిది గంటలు
నిఖిత, అల్కా ఇద్దరూ బి.కామ్‌ డిగ్రీ పూర్తి చేశారు. ‘ఆసక్తి కొద్దీ ఆభరణాల తయారీ కోర్సు చేశాను’ అని చెప్పిన నిఖిత పదేళ్ల పాటు అందమైన ఆభరణాలను రూపుకట్టారు. ‘దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో నా ఆభరణాలను ప్రదర్శించాను. కరోనా సమయంలో మాత్రం కొత్తగా ఆలోచించాలనుకున్నాను. ఇంటి నుంచే కొత్త వర్క్‌ తో నా ప్రెజెంటేషన్‌ ఉండాలనుకున్నాను. అప్పుడే సిల్వర్‌ ఫాయిల్‌ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని అల్కాతో చర్చించినప్పుడు మంచి ఆలోచన అంది. తంజావూర్‌ పెయింటింగ్స్‌లో గోల్డ్‌ ఫాయిల్‌ను ఉపయోగిస్తారు. అది ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మేం సిల్వర్‌ ఫాయిల్‌ గురించి ఆలోచించాం.

దీంతో ఇద్దరం సిల్వర్‌ ఫాయిల్‌తో రకరకాల ఫ్రేమ్స్‌ తయారు చేశాం. వీటిని మిగతా వేటి వేటికి జత చేయచ్చో ఒక ప్లాన్‌ వేసుకున్నాం. కలపకు సిల్వర్‌ ఫాయిల్‌ను జత చేస్తూ చాలా ప్రయోగాలే చేశాం. జ్యువెలరీ బాక్సులు, వాచీలు, గేమ్‌ బోర్డులు.. ప్రతీది ప్రత్యేకం అనిపించేలా డిజైన్‌ చేశాం’ అని వివరించింది నిఖిత. ‘ఈ వర్క్‌ లో ఇద్దరం గంటల గంటల సమయం కేటాయించాం. అందుకు మా కుటుంబాలు కూడా సపోర్ట్‌గా ఉన్నాయి. ఫ్రేమ్స్‌కు నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. కానీ, గేమ్‌ బోర్డులకు పది నుంచి ఇరవై రోజులైనా సమయం పడుతుంది. దాదాపు రోజూ ఎనిమిది నుంచి పది గంటలైనా వీటి తయారీకి కేటాయిస్తాం’ అని తమ వర్క్‌ గురించి వివరించింది అల్కా.

ప్రత్యేకమైన కానుకలు
‘మేం చేసే డిజైన్స్‌లో మరోదాన్ని పోలిన డిజైన్‌ ఉండదు. దేనికది ప్రత్యేకం. పెళ్లి్ల, పుట్టినరోజు, గృహప్రవేశాలు వంటి వేడుకలకు ఏదైనా కానుక తీసుకెళ్లాలనుకుంటారు. అదే సమయంలో కానుక తీసుకున్నవాళ్లు ఇంట్లో తీపి జ్ఞాపకంగా అలంకరించుకోవాలనుకుంటారు. ఎన్నేళ్లయినా ప్రత్యేకంగా ఉండే సిల్వర్‌ ఫాయిల్‌తో డిజైన్స్‌ తీసుకు రావాలనుకున్నాం. మేం ‘నకాషి’ పేరుతో మా బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ డిజైన్స్‌లో స్వరోస్కి, జెమ్స్‌ కూడా ఉపయోగిస్తాం. డిజైన్, సైజును బట్టి ధరలు ఉంటాయి. పెట్టుబడి ఇద్దరిది, రాబడి ఇద్దరిదీ’ అంటూ కలిసి పనిచేస్తే కలిగే లాభం గురించి, పంచుకున్న పని రోజుల గురించి ఆనందంగా తెలిపారు ఈ సిల్వర్‌ ఫాయిల్‌ సిస్టర్స్‌.
నిర్మలారెడ్డి

 

మరిన్ని వార్తలు