Cyber Crime Prevention Tips: ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేస్తామంటూ; బ్లాక్‌మెయిల్‌ తట్టుకోలేకపోతున్నా

17 Mar, 2022 07:38 IST|Sakshi

హరిత స్నేహితురాలికి ఫోన్‌ చేస్తే వాళ్ల అమ్మ ఫోన్‌ ఎత్తింది. ‘భవ్యను ఆసుపత్రిలో చేర్చాం’ అని ఏడుస్తూ చెప్పడంతో కంగారుగా హాస్పిటల్‌కి చేరుకుంది హరిత. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. భవ్య మాట్లాడుతుందని డాక్టర్లు చెప్పడంతో స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది హరిత.

‘ఏమైంద’ని అడిగితే చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. యాప్‌ ద్వారా తీసుకున్న లోన్‌ గురించి చెప్పి, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశానని చెప్పింది భవ్య,. (పేర్లు మార్చడమైనది) 

నెల రోజుల క్రితం...  
‘ఇంతమందికి పార్టీ అంటే బాగానే ఖర్చు అవుతుంది. మీ నాన్న ఎన్ని డబ్బులు ఇచ్చారు?’ భవ్యను అడిగింది హరిత. ‘నాన్న అంత మనీ ఎందుకు ఇస్తారు. యాప్‌ నుంచి లోన్‌ తీసుకున్నాను. పాకెట్‌ మనీ ఇస్తారుగా, కొంత కొంత కట్టేస్తే సరిపోతుంది’ అని చెప్పింది భవ్య. ‘ఈ యాప్‌ మనీ ఏంటో ఈజీగా ఉంది. నాక్కూడా చెప్పవా!’ అనడంతో ఆ వివరాలన్నీ హరితకూ చెప్పింది.

యాప్‌ ద్వారా తీసుకున్న ఇన్‌స్టంట్‌ మనీ తమ జీవితాలతో ఎలా ఆడుకుంటుందో అర్థమయ్యాక స్నేహితులిద్దరూ ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. కాలేజీకి వెళ్లే యువత మాత్రమే కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఇలాంటి ‘యాప్‌’ ఆధారిత లోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. రుణం ఇచ్చేవారెవరో తెలియకుండా తీసుకునే లోన్ల కారణంగా రకరకాల సమస్యల్లో చిక్కుకుంటున్నారు.  

నేరాలకు సులువైన మార్గం 
ఇటీవల యాప్‌ల ద్వారా రూ.500 నుంచి 50,000 వేల వరకు తక్షణ రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటి రికవరీ వ్యూహాల కారణంగా ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న కేసులు అధికారికంగా నమోదు అయ్యాయి. రుణమాఫీ కోసం యాప్‌ నిర్వాహకులు ఎంచుకుంటున్న నేర మార్గాలు కూడా ప్రధాన కారణం అవుతున్నాయి.  లోన్‌ అంటూ ఇలాంటి తక్షణ రుణం ఇచ్చే యాప్‌లకు ఎలాంటి వెబ్‌సైట్‌ ఉండదు.

ఈ యాప్‌లు ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిలో కంపెనీకి సంబంధించిన సమాచారం, లైసెన్స్‌.. వంటి ఇతర వివరాలేవీ ఉండవు. ఇ–మెయిల్, ఫోన్‌ నెంబర్‌ మాత్రమే ఉంటాయి. వాటిలో శాలరీ అడ్వాన్స్‌ లోన్, ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ అనే రెండు వేర్వేరు పేర్లతో ఉంటాయి. నిజానికి గూగుల్‌ప్లే స్టోర్‌ 60 రోజులకంటే తక్కువ కాలవ్యవధితో రుణాలను అందించే యాప్‌లను అనుమతించదు. ఉల్లంఘన కారణంగా చాలా యాప్‌లను ప్లే స్టోర్‌  తొలగించింది కూడా. అయితే, అవి మళ్లీ వేరే పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయి. 

వేధింపులకు తెర తీస్తారు.. 
ఒక సెల్ఫీ, ఆధార్‌ నెంబర్‌తో రుణాలను ఇవ్వడానికి కొన్ని రకాల ‘యాప్‌’లు ఆమోదిస్తుంటాయి. ఇది పూర్తి చట్ట విరుద్ధం. ఒకేసారి కాకుండా వివిధ దశలలో రుణం మంజూరు చేస్తుంటారు. విపరీతమైన వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు, జిఎస్టీ.. ఇతర రుసుముల కింద మరింత మొత్తం ముందే చెల్లింపుల కింద కట్‌ చేస్తారు. వారం సమయం ఇచ్చి, వడ్డీ చెల్లించమని వేధిస్తుంటారు. 

►లోన్‌ చెల్లించనట్లయితే దూకుడు వ్యూహాలను అమలు చేస్తారు. మీ ఫోన్‌ జాబితాలో కాంటాక్ట్స్‌ను ఉపయోగించి, ‘మీ పేరు గ్యారెంటీగా ఇచ్చార’ని నకిలీ సాకును చూపుతారు.
►మీ ఫోన్‌ కాంటాక్ట్‌ జాబితాలో అమ్మ, నాన్న, జీవిత భాగస్వామి, సోదరుడు, సహోద్యోగులు, స్నేహితులు .. వంటి సేవ్‌ చేసిన అన్ని నంబర్లకు కూడా ఫోన్‌ చేసి వేధిస్తారు.
►అర్థరాత్రి కూడా ఫోన్‌ చేస్తారు. ఒకే రోజులో వివిధ ఫోన్‌ నెంబర్ల నుంచి దాదాపు 100 కాల్స్‌ చేసి, మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు.
►బాధితుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి, అశ్లీల వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్‌ చేసిన ప్రమాదకర ఘటనలూ జరిగాయి. బాధిత కుటుంబ సభ్యులకూ వాటిని పంపే అవకాశం ఉంది.
►నకిలీ లాయర్‌ నోటీసులు పంపుతారు. ∙సిబిల్‌ స్కోర్‌ సున్నా, భవిష్యత్తులో ఎలాంటి రుణం పొందలేరు అని బెదిరిస్తారు.
►ఒక్క రోజు ఆలస్యం అయినా కేవలం ఐదు నిమిషాల్లో రుణం చెల్లించాలని బాధితులపై ఒత్తిడి తెచ్చి, తిరిగి చెల్లించేందుకు మరో రుణం ఇస్తారు. 

హెచ్చరిక సంకేతాలివి...
►మీ క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ ఎంత అనే పట్టింపులేవీ ఉండవు. మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి ఇది ప్రధాన హెచ్చరికగా గుర్తించాలి.
►వారి చిరునామా ఎక్కడా ఉండదు. వారిని సంప్రదించే సమాచారాన్నీ ఇవ్వరు.
►నకిలీ రుణదాతలు జీఎస్టీ ఫీజులు, ప్రాసెసింగ్‌ ఫీజులతో ముందస్తు చెల్లింపు లేదా రుసుమును డిమాండ్‌ చేయచ్చు.
►లోన్‌ ఆఫర్‌ కొన్ని గంటలు లేదా రోజుల్లో ముగుస్తుందని చెబుతారు. స్కామర్లు పరిమిత గడువు ఆఫర్లతో ముందుకు వస్తారు. ఆకర్షణీయమైన వ్యూహాలను ఉపయోగించి, తక్షణ నిర్ణయం తీసుకునేలా చేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు దానిని ముందే కనిపెట్టి, అలాంటి వారి వలలో పడకుండా దూరంగా ఉండటం మంచిది.  

అనుమతి తప్పనిసరి...
►మీకు రుణం ఇచ్చే బ్యాంక్‌కి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఉండాలి. ఫైనాన్షియల్‌ కంపెనీ అయితే ఎన్‌బిఎఫ్‌సి లైసెన్స్‌ ఉండాలి.
►రుణం ఇచ్చే వారితో సంప్రదింపులు చేయడానికి ఫోన్‌ నెంబర్, ఇ–మెయిల్‌తో పాటు వారి పూర్తి చిరునామా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా పైన సూచించిన అనుమతులు కూడా ఉండాలి. 
అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు