ఆ అకౌంట్‌లో తన ఎత్తు, బరువు, రేటు.. చదివి షాకైన నిత్య

24 Jun, 2021 00:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సైబర్‌ క్రైమ్‌ 

‘‘నిత్యా, ఈ సెమిస్టర్‌లో కూడా నువ్వే ఫస్ట్, కంగ్రాట్స్‌!’ అంటూ వస్తూనే స్నేహితురాలిని అభినందించింది ఐషు. ‘థాంక్స్‌’ అంటూ నవ్వింది నిత్య. ఇద్దరూ క్లాసులోకి వెళ్లారు. క్లాస్‌మేట్స్‌ అందరూ నిత్యను అభినందనలతో ముంచెత్తారు. నిత్య, ఐషు (ఇద్దరి పేర్లు మార్చడమైంది) బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే నిత్య అంటే క్లాసులో అందరికీ అభిమానం. క్లాస్‌ అయిపోగానే నిత్య, ఐషులు తమ క్లాస్‌మేట్‌ రఘుతో కలిసి పార్టీకి బయటకెళ్లారు. 

మరుసటి రోజు కాలేజీకి వచ్చింది నిత్య. అందరూ తనను అదోలా చూస్తుండటం గమనించింది. ఎవరూ మునుపటిలా పలకరించట్లేదు. తను పలకరించినా ముభావంగానే ఉన్నారు. పక్కసీటులో ఉండే క్లాస్‌మేట్‌ ప్రవర్తన కొత్తగా అనిపించడంతో ‘ఏమైందంటూ’ దబాయించింది నిత్య. తన ఫోన్‌ చూపుతూ, అందులో వచ్చిన మెసేజ్‌లు చూపించింది క్లాస్‌మేట్‌. అవన్నీ నిత్యకు సంబంధించినవే. తన పేరుతో ఉన్న అకౌంట్‌లో తన ఎత్తు, బరువు, రేటు .. అంటూ ఏవేవో వివరాలు.. చదివిన నిత్య షాకైంది. అంతే కాదు ఫొటోలు కూడా అసభ్యంగా ఉన్నాయి. తన గురించి ఇంత చెత్తగా అదీ తన అకౌంట్‌ నుంచి ఎవరు పోస్ట్‌ చేశారో అర్ధం కాలేదు నిత్యకు. క్లాసులో చుట్టూ చూసిన నిత్యకు అవమానంతో అక్కడే భూమిలోకి వెళ్లిపోతే బాగుండనిపించింది. వెంటనే క్లాస్‌ నుంచి ఇంటికి వచ్చేసింది. విషయం తెలిసి వెంటనే నిత్యకు ఫోన్‌ చేసింది ఐషు. తనకేమీ తెలియదని చెబుతూనే, ఆ రోజుంతా ఏడుస్తూనే ఉంది నిత్య. కూతురి పరిస్థితి చూసిన తల్లితండ్రులు తల్లడిల్లిపోయారు. కూతురు భవిష్యత్తును దెబ్బతీయాలనుకున్న వారిపై చర్య తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసు ఫైల్‌ చేశారు. 

నిపుణుల సాయంతో ఆ ఫ్రాడ్‌ ఎవరో కనిపెట్టారు పోలీసులు. నిత్య పేరుతో చెత్త కామెంట్లు, ఫొటోలు అప్‌లోడ్‌ చేసింది ఎవరో కాదు నిత్య క్లాస్‌మేట్‌ రఘు అని తెలిసి ఆశ్చర్యపోయారు. రఘుని అరెస్ట్‌ చేశారు పోలీసులు. తనంటే ప్రత్యేక అభిమానం చూపే రఘు ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే నిత్యకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇదే విషయం పోలీసులకు చెప్పింది నిత్య. ఎప్పుడూ కలిసి ఉండే రఘు, నిత్య, ఐషులను విడివిడిగా ప్రశ్నించిన పోలీసులకు ఓ కొత్త విషయం అర్థమైంది. నిత్య మీద అసూయతో రగిలిపోయే ఐషు ఈ పని చేసిందని తెలుసుకున్నారు. రఘు ఫోన్‌ని వాడేది ఐషు. ఫ్రెండ్‌ కదా అని రఘు అడ్డు చెప్పేవాడు కాదు. రఘు తనను కాకుండా నిత్యను అభిమానిస్తున్నాడని, అన్నింటా తనే ముందుంటుందన్న అసూయ ఐషులో పెరిగిపోయింది. రఘు ఫోన్‌ నుంచి నిత్య పేరు మీద ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి, నిత్య గురించి చెడుగా కామెంట్‌ చేయడం మొదలుపెట్టింది. విషయం తెలిసి నిత్య–ఐషుల స్నేహం చెడిపోయింది. రఘు జీవితం ఇబ్బందుల్లో పడింది. టెక్నికల్‌గా ఐషు మీద యాక్షన్‌ తీసుకోలేమని, ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండమని పోలీసులు నిత్యకు హితవు చెప్పారు. అసూయను దరిచేర్చుకుంటే అది ద్వేషంగా మారి పతనం వైపుగా అడుగులు వేయిస్తుందనడానికి ఈ స్నేహితుల కథే ఉదాహరణ. 

ఫేక్‌ ప్రొఫైల్స్‌.. తస్మాత్‌ జాగ్రత్త
స్నేహితులే కదా అని తమ ఫోన్‌ పాస్‌వర్డ్‌ వివరాలతో సహా చెప్పేసుకుని, అనుకోని పరిణామాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఇటీవల చూస్తున్నాం. ఆల్రెడీ మన ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉన్నవారి నుంచి మళ్లీ రిక్వెస్ట్‌ ఎందుకు వస్తుంది..? అనేది గుర్తించాలి. తమ ఫ్రెండ్స్‌ని అలెర్ట్‌ చేయాలి. తెలియని వారు పంపిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్‌ చేయకూడదు. చాలా మంది ఎంత మంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్‌ ఉంటే అంత గొప్ప అనుకుంటారు. వీటిల్లో హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫేక్‌ అని తెలియగానే ఆ సదరు అకౌంట్‌ని బ్లాక్‌ చేస్తే మంచిది. ఇటీవల ఫేక్‌ అకౌంట్స్‌ బారిన పడి మోసపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో డేటింగ్‌ సైట్స్‌ వాడే వారి సంఖ్య ఎక్కువ. ఈ సైట్లలో 50 శాతం ఫేక్‌ ప్రొఫైల్స్‌ ఉంటాయి. వాళ్ల స్నేహం మాయ గురించి మోసపోయాక కానీ తెలియదు.

నిజానికి సోషల్‌మీడియాలో ఫేక్‌ ప్రొఫైల్‌ చూస్తేనే అర్థమైపోతుంది. అకౌంట్‌ ఇటీవల క్రియేట్‌ అయ్యి ఉండి, అందులో పూర్తి వివరాలు లేకుండా ఉంటే అనుమానించాలి. యూజర్‌నేమ్‌లో ఫస్ట్, లాస్ట్‌ నేమ్‌ అంటూ ఉండదు. ఆ అకౌంట్‌కి ఫాలోవర్లు ఉండరు. ఉన్నా.. వారే సృష్టించిన ఫేక్‌ ఐడీల జాబితాయే ఉంటుంది. వారి ఫ్రెండ్స్‌ లిస్ట్‌ చూస్తే వింత పేర్లు, స్టాక్‌ ఫొటోస్‌ పెట్టినవి ఉంటాయి. వాళ్ల కామెంట్స్‌ లిస్ట్‌లో సేమ్‌ కామెంట్స్‌ ఉంటాయి. ఫేక్‌ అకౌంట్స్‌కి ఒకే ఒక్క ఫొటో ఉంటుంది. ఆ ఫొటో కూడా ఎక్కడ నుంచి తీశారో గూగుల్‌ ఇమేజ్‌ టూల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని బట్టి అకౌంట్‌ ఫేక్‌ అని గుర్తించాలి. ఇలా గుర్తించినప్పుడు కంప్లైంట్‌ చేయాలి. మన ప్రొఫైల్‌ కూడా లాక్‌ చేసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట. 

– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌ 

మరిన్ని వార్తలు