Cyber Talk: ఆన్‌లైన్‌ మోసాలకు ఇలా అడ్డుకట్ట వేయండి

15 Sep, 2022 17:56 IST|Sakshi

సైబర్‌ నేరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మొదటి ప్లేస్‌లో ఫేస్‌బుక్‌ నిలుస్తోంది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్‌ చేయడం, డబ్బును డిమాండ్‌ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్‌ మోసం, ఫేక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు.. వంటివెన్నో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్‌ నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌.

ఫొటోలు, వీడియోలు అనేక ఇతర ఇంటరాక్టివ్‌ అంశాలు, వ్యాపారం, సేవలను ప్రోత్సహించడానికి మాధ్యమంగా      ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. నెట్‌వర్క్‌ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్‌ అయి ఉండటంతో, స్కామర్లకు ఇది ఒక మాధ్యమంగా మారింది. దీంతో మోసగాళ్లు సోషల్‌ మీడియా హ్యాండిల్‌ నుండి లింక్‌లు, కనెక్షన్లతో స్కామ్‌లకు తెరలేపుతున్నారు. 

స్కామ్‌లు... ఫేస్‌బుక్‌ హ్యాకింగ్, నకిలీ ప్రొఫైల్‌ వంటి ఈ మోసాల జాబితాలో మొదట బాధితుడి ప్రొఫైల్‌ను  హైజాక్‌ చేసి, ఆపై వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్‌ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసే వరకు అతని ప్రొఫైల్‌ హైజాక్‌ అయ్యిందని తెలియదు. దీంతో ఫేస్‌బుక్‌ ఖాతాకు చెందిన తమ స్నేహితుడి నుండి రిక్వెస్ట్‌ వచ్చిందని మిగతావారు నమ్ముతారు. ఇది ఫేస్‌బుక్‌ చీటింగ్‌ స్కామ్‌కు సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు.

యాక్సెస్‌ సులువు... సైబర్‌ నేరగాళ్లు బాధితురాలి/బాధితుడి ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి వారి వ్యక్తిగత వివరాలన్నింటికి యాక్సెస్‌ పొందుతారు. స్కామర్‌ బాధితుడి ఫేస్‌బుక్‌ ఖాతాను లక్ష్యంగా చేసుకుని హ్యాక్‌ చేస్తాడు. తర్వాత స్నేహితుల జాబితాలోని వారిని సంప్రదిస్తాడు.

స్కామర్‌ సాధారణంగా డబ్బు అడగడానికి ప్రయత్నిస్తాడు ∙నిధుల బదిలీ, యాక్సెస్‌ కోడ్, వ్యక్తిగత మొబైల్‌ నంబర్లు, ఇతర వివరాల కోసం ఒక స్కామర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ యజమాని స్నేహితులు సంప్రదించినట్లు అనేక కేసులు ఇప్పటికే సైబర్‌క్రైమ్‌లో ఫైల్‌ అయి ఉన్నాయి. వీటిలో... 

శృంగారపరమైన మోసాలు... అంత్యంత పెద్ద స్కామ్‌లలో ఇది ఒకటి. ఫేస్‌బుక్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రేమికులుగా నటిస్తారు. స్కామర్లు వారి బాధాకరమైన జీవనం గురించి, భాగస్వామి నుంచి విడిపోయినట్లు నటిస్తారు లేదా మిమ్మల్ని ఆకర్షించడానికి ముఖస్తుతిని ఉపయోగిస్తారు. ఒక శృంగారపరమైన వీడియో సంభాషణ మీ భావోద్వేగాలతో ఆడుకోవడానికి, మీ నమ్మకాన్ని పొందేందుకు రూపొందించి ఉంటుంది. వారాలు, నెలల వ్యవధిలో మెసెంజర్‌చాట్‌లను పెంచుతూ ఉంటారు. చివరికి ఏదో సమస్య చెప్పి డబ్బు పంపమని అడుగుతారు. ఆన్‌లైన్‌లో క్యాట్‌ఫిషింగ్‌ కోసం ఇది అత్యంత ప్రజాదరణ పొందిన అంశాలలో ఒకటి.

షాపింగ్‌ మోసాలు... ఫేస్‌బుక్‌ ద్వారా స్కామర్లు నకిలీ వస్తువులను అంటగట్టడానికి నకిలీ బ్రాండ్‌ ఖాతాలను సృష్టిస్తారు. రకరకాల ఆఫర్లతో ఎన్నడూ వినని షాప్‌ పేర్లను సృష్టిస్తారు. ప్రకటనలను పుష్‌ చేస్తారు. చౌక ధరలకు వస్తువులను అందిస్తామంటారు కానీ దేనినీ పంపరు. బదులుగా, మీ డబ్బు తీసుకొని అదృశ్యమవుతారు.

నకిలీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు... ఫేస్‌బుక్‌లో ఉన్న ఎవరైనా ఈ స్కామ్‌ను ఎదుర్కొనే ఉంటారు. ఒక వ్యక్తిని ఫాలో అవడానికి మొత్తం ఫేస్‌బుక్‌ ఖాతాలను చేరుకోవడానికి స్కామర్‌లకు ఇది ఇష్టమైన వ్యూహం. మీరు ఒక ఫేక్‌ అభ్యర్థనను అంగీకరించినప్పుడు, మీరు మీ అకౌంట్‌ లాక్‌ చేసినా మీరు స్కామర్‌కి అంతర్గత యాక్సెస్‌ను అందించినట్టే. మీ డిజిటిల్‌ డివైజ్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసే మోసపూరితమైన లింక్‌ వంటి ఇతర స్కామ్‌ల బారినపడేలా మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటారు. 

నకిలీ ఛారిటీ స్కామ్‌లు... విపత్తు సంభవించినప్పుడు, సహాయం చేయాలనుకోవడం మానవ స్వభావం. చాలా మందికి, దీని అర్థం డబ్బును విరాళంగా ఇవ్వడం. మోసగాళ్లకు ఇది తెలుసు. వెంటనే డబ్బు చెల్లించేలా  సంక్షోభాలను ఉపయోగిస్తారు. నకిలీ ఛారిటీ పేజీలు, వెబ్‌సైట్‌లు, గో ఫండ్‌ మి వంటి ప్రసిద్ధ సైట్‌లలో ఖాతాలను కూడా సృష్టించి, ఆపై మీ ఫేస్‌బుక్‌ ఫీడ్‌లో వారి ‘ధార్మిక సంస్థలను’ ప్రచారం చేస్తారు. ఫోన్‌ యాప్‌ల ద్వారా డబ్బు చెల్లించమని అడుగుతారు.

మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు డబ్బులు ఇచ్చే ముందు రీసెర్చ్‌ చేయడానికి కొంత సమయం తీసుకోండి. ఛారిటీ నావిగేటర్, గైడ్‌స్టార్, ఛారిటీ వాచ్‌తో సహా ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సైట్‌లను చెక్‌ చేయండి. 

హ్యాక్‌ అయిన సమాచారాన్ని రిపోర్ట్‌ చేయాలంటే..
https://www.facebook.com/hacked

నకిలీ సమాచారం గురించి రిపోర్ట్‌కు...
https://www.facebook.com/help/572838089565953
helpref=search&sr=2&query=reporting%20false%20claims&search_session_id=f886d969d0ffdf65b717d0567986859f

మోసానికి సంబంధించిన సమాచారాన్ని ..
httpr://www.facebook.com/he p/174210519303259?rdrhc రిపోర్ట్‌ చేయడం మంచిది.                              

ఫేస్‌బుక్‌ మోసాలకు అడ్డుకట్ట
మీ భద్రతను కాపాడుకోవడానికి ఫేస్‌బుక్‌లో మీరు చేయగలిగేవి...
మీ ఫేస్‌బుక్‌ గోప్యతా సెట్టింగ్‌లను లాక్‌ చేయండి
రెండుకారకాల ఫోన్‌నెంబర్‌ ప్రమాణీకరణను ప్రారంభించండి
మీకు తెలియని వారి నుండి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరించండి
వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కోసం అడిగే సందేశాలను పట్టించుకోవద్దు
మీకు పంపిన అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు
మీ లాగిన్‌ చరిత్రను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ∙
బలమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి
ధ్రువీకరించబడిన బ్రాండ్‌ ఖాతాల నుండి మాత్రమే షాపింగ్‌ చేయండి
మీ పేరు మీద ఉన్న ఖాతాల కోసం క్రమం తప్పకుండా శోధించండి

మీ ఫేస్‌బుక్‌ పేజ్‌ బయట...
మీ పరికరం ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయండి
అన్ని అనుమానాస్పద ఇ–మెయిల్‌లను తొలగించండి
మీ అన్ని డిజిటల్‌ పరికరాల్లో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయండి
ఎరుకతో వ్యవహరించండి. 

మీరు ఫేస్‌బుక్‌ స్కామ్‌కు గురైనట్లయితే ...
స్కామ్‌ గురించి ఫేస్‌బుక్‌కి నివేదించండి
పాస్వర్డ్‌ మార్చుకోండి
మీ బ్యాంక్‌ అకౌంట్లను ఎప్పుడూ తనిఖీ చేస్తూ ఉండండి
మీ ఆన్‌లైన్‌ చెల్లింపులను ఆపేయండి
మీ గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఎవరైనా దొంగతనం చేశారా గమనించండి

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, 
ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు