4G To 5G: 5జీ ఫోన్లలో.. 4జీ సిమ్‌ కార్డ్‌ ఉన్న సబ్‌స్క్రైబర్‌లు.. జాగ్రత్త.. ఇలా చేస్తే

3 Nov, 2022 11:54 IST|Sakshi

5జీ మోసాలు

Cyber Crime Prevention Tips In Telugu: టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కొన్నాళ్లుగా మనందరం అధికంగా వింటున్న పేరు 5జీ. అంతేస్థాయిలో 5జీ పేరుతో మోసాలూ జరుగుతున్నాయి. టెక్నాలజీని అర్థం చేసుకోవడం, ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండటానికి మనం ఎంత అలెర్ట్‌గా ఉంటే, అంత సురక్షితంగా ఉండగలం.  

5జీ నెట్‌వర్క్‌ ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో విడుదలవుతుంది. ఆ తర్వాత ఇతర నగరాల్లోనూ అందుబాటులో ఉంటుంది. నాన్‌స్టాండ్‌అలోన్‌ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ప్రారంభించడానికి అంటే, ఇప్పటికే ఉన్న 4జీ సాంకేతికతను ఉపయోగించి, ఆపై క్రమంగా స్టాండ్‌అలోన్‌ నెట్‌వర్క్‌ (5జీ) వైపు వెళతారు. 

మెరుగైన కవరేజ్‌.. 
5జీలో తక్కువ ఫ్రీక్వెన్సీ, మెరుగైన కవరేజీ, లో స్పీడ్‌.. ఉంటుంది. ఇప్పటికే 5జీ ఫోన్లు ఉండి, 4జీ సిమ్‌ కార్డ్‌ ఉన్న సబ్‌స్క్రైబర్‌లు కొత్త 5జీ సిమ్‌ కార్డ్‌ల కోసం వెతకనవసరం లేదు, ఎందుకంటే టెక్నాలజీ ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే టెలికాం ప్రొవైడర్లు స్టాండ్‌అలోన్‌ నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్‌ చేసిన తర్వాత, ఆపై కస్టమర్లు కొత్త 5జీ సిమ్‌ కార్డ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది.

మోసాలు జరిగే విధానం.. 
5జీ పేరుతో జరిగే వాటిలో సిమ్‌ స్వాప్‌ మోసాలు ప్రధానమైనవి. ఆన్‌లైన్‌ మోసగాళ్ళు తమను తాము ఈ నెట్‌వర్క్‌కి ఫోన్‌కంపెనీల పేర్లు చెప్పి, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పరిచయం చేసుకుంటున్నారు. సిమ్‌ కార్డ్‌లను 4జీ నుండి 5జీకి అప్‌డేట్‌ చేస్తామని చెబుతున్నారు.

ఆ తర్వాత, వారు పంపిన మెసేజ్‌ల్లోని చిన్న లింక్‌పై క్లిక్‌ చేస్తే వచ్చిన ఓటీపీని సెండ్‌ చేయమని అడగవచ్చు. ధ్రువీకరణ తర్వాత, ఆపరేటర్‌ నిజమైన బాధితుడి సిమ్‌ను డియాక్టివేట్‌ చేస్తాడు. దీనికి బదులుగా కొత్త సిమ్‌ కార్డ్‌ను జారీ చేస్తాడు.

టెలికాం వినియోగదారులను సిమ్‌ అప్‌గ్రేడ్‌ సాకుతో తమని తాము పరిచయం చేసుకుంటారు. సిమ్‌కార్డ్‌ మార్పిడి, ఆఫర్లతో వల వేయడం, పోర్టబిలిటీకి సంబంధించి ఓటీపీలు రాబట్టేలా చేస్తారు. మన వివరాలను అందించిన తర్వాత సిమ్‌ అప్‌గ్రేడ్‌కు బదులుగా బ్యాంక్‌ ఖాతా నుంచి నగదును మోసగాడు తన ఖాతాకు డెబిట్‌ అయ్యేలా చేస్తాడు. అందుకే, ఇలాంటివేవీ నమ్మకూడదు.

నెట్‌వర్క్‌ సామర్థ్యాలు
5జీ గరిష్ట డేటా 10 జీబీపీఎస్‌కి చేరుకుంటుంది. ఇండోర్, అవుట్‌డోర్‌ పరిసరాలలో ఈ రీచ్‌ ఎక్కువ ఉంటుంది. ∙డేటా కనీసం 10 ఎమ్‌బీపీఎస్‌ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో విస్తృత ఏరియా కవరేజ్‌ కోసం 100 ఎమ్‌బిపిఎస్, ఇండోర్‌లో 1 జీబీపీఎస్‌ వరకు ఉంటుంది. 5జీ ఉన్న కస్టమర్లు కార్లు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వారి ఫోన్‌లలో 4జీ వీడియోను ఆటంకం లేకుండా చూడవచ్చు. 

కంప్యూటర్‌ గేమ్స్‌ , ఆగ్మెంటెడ్‌ రియాలిటీ వంటివి మరింతగా అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ సాంకేతికత ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, విపత్తుల సమయంలో సహాయం.. వంటి వాటితో సహా వివిధ రకాల పరిశ్రమలపైనా ప్రభావాన్ని చూపుతుంది.

5జీ అప్లికేషన్లతో విపత్తు ప్రభావిత ప్రాంతాలపై రిమోట్‌ నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో ఇన్‌స్టాల్‌ చేయబడిన హెచ్‌డి కెమెరాల నుండి ప్రత్యక్ష 4ఓ ఫీడ్‌... వంటివి సులభం అవుతాయి.. ఈ టెక్నాలజీ ప్రతి పనిలో మనుషుల పాత్రను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

భద్రత కోసం చిట్కాలు
ఇప్పటికే ఉన్న 5జీ సేవలను ఉపయోగించడానికి మీ ప్రస్తుత 4జీ సిమ్‌ కార్డ్‌ని అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం లేదు. ∙ఫోన్‌ కాల్‌లో ఉన్నప్పుడు ఎటువంటి లావాదేవీలు చేయవద్దు. ∙యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయమని లేదా యాప్‌లు / ఖాతాలను అప్‌డేట్‌ చేయమని మిమ్మల్ని అభ్యర్థించే ఎలాంటి అనుమానాస్పద కాల్స్‌ లేదా సందేశాలను అందించవద్దు.

ఎప్పుడూ, ఓటీపీని ఎవరితోనూ షేర్‌ చేయవద్దు.
క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయవద్దు.
అలా చేస్తే మన బ్యాంక్‌ ఖాతాల నుండి డబ్బు డెబిట్‌ అవుతుంది.
చిన్న లింక్స్, సందేశాలను ధ్రువీకరించకుండా వాటిపై క్లిక్‌ చేయవద్దు.
5జీ పేరుతో ఎవరైనా మిమ్మల్ని మోసగిస్తే వెంటనే మీ స్థానిక సైబర్‌ క్రైమ్‌ పోలీసు అధికారులకు స్కామ్‌ను నివేదించండి. http://www.cybercrime.gov.in లో ఫిర్యాదునునమోదు చేయండి లేదా వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి డయల్‌ చేయండి. 

-ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

మరిన్ని వార్తలు