Cyber Crime: వినీత్‌, తన సహచరుడిని ప్రేమించాడు! ఇక ట్రాన్స్‌జెండర్‌ మాయ.. వీళ్ల గురించి అసలు ఎందుకిలా? పరిష్కారం?

9 Mar, 2023 12:22 IST|Sakshi

వినీత్‌ (పేరు మార్చడమైనది) సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. అతను తన సహచరుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా చివరకు వారి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కానీ, ‘మగవాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారట..’ అనే వ్యంగ్యపు మాటలు వారిని బాధిస్తున్నాయి.

అంతేకాదు, సోషల్‌ మీడియాలో వారికి సంబంధించిన వార్తలు, వ్యతిరేక కామెంట్లు, లైంగికపరమైన చర్చలు జరుపుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ‘మేం, మాలాంటి వారంతా గౌరవంగా బతకాలనుకుంటున్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం.

అలాంటప్పుడు మా ఎదుగుదలకు సంబంధించి కాకుండా, లైంగికపరంగా మమ్మల్ని దిగజార్చే మాటలే ఎందుకు పదే పదే వస్తున్నాయి. ఈ బాధించే మాటలు, వీడియోల నుంచి మాకు విముక్తి ఎప్పుడు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.  
∙∙ 
మాయ ట్రాన్స్‌జెండర్‌. ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. సమాజంలో తమ వర్గాన్ని తక్కువగా చూస్తారన్న భయం ఆమెలో లేకపోలేదు. దానికి తోడు యూ ట్యూబ్‌ చూస్తున్నప్పుడల్లా ఆమెను వేల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. వీడియోలు వైరల్‌ అవడం కోసం తమ వర్గానికి చెందిన వారిని లైంగికపరమైన విషయాలమీదనే ఫోకస్‌ చేస్తున్నారనేది ఆమె బాధ.

దీనివల్ల సహచర ఉద్యోగుల్లోనూ, చుట్టుపక్కల కుటంబాల్లోనూ తనను కూడా అదే విధంగా చూస్తారని, నాలాగ బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారంటోంది మాయ. 
∙∙ 
ఇది నేటి సమాజంలో అణచివేతకు గురికాబడుతున్న మరో వర్గంగా స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లను ప్రధానంగా చూస్తుంటాం. ఎల్‌జిబిటిక్యూఐఎ అనే పేరుతో వీరు హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో తమ సమస్యలను విన్నవించుకుంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ జుగుప్సాకరమైన కంటెంట్‌ కలిగించే ఆందోళనను ఓ సున్నితమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. తమ వర్గం వారిలోనూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతోద్యోగాలు చేసుకుంటున్నవారు ఉన్నారని, తమ విజయగాధలను తెలియజేయమని ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. 

వైరల్‌ ప్రధానమా?
సోషల్‌ మీడియా ద్వారా డబ్బు రావాలంటే ఇప్పుడు యూట్యూబ్‌ అనేది ఒక సాధనం అని మనకు తెలిసిందే. ఎంత వైరల్‌ అయ్యే అంశాలు ఉంటే ఆ వీడియో ద్వారా అంత డబ్బు, దానితో పాటు పేరు వస్తుందని చాలా మందికి తెలుసు.

అందుకే, ఆసక్తిని రేకెత్తించే అంశం ఏమిటో దానినే వీడియో అప్‌లోడ్‌ చేసేవారు ఎంచుకుంటారు. దీనితో పాటు వెబ్‌సైట్స్‌ ఇతర సామాజిక మాధ్యమాలు కూడా వార్త వైరల్‌ అయ్యేందుకు ఈ అంశాలను ఎంచుకుంటాయి.

సైబర్‌ వేధింపులు
సామాజిక మాధ్యమాల్లో మహిళలే అధిక వేధింపులకు లోనవుతుంటారు. అయితే, ఇటీవల పెరుగుతున్న పరిణామాల్లో ఎల్‌జిబిటిక్యూఐ+ కూడా చేరుతోంది. ఆఫ్‌లైన్‌లో జాతి, మత, వర్గంలో ఉండే విభేధాలు ఆన్‌లైన్‌లోనూ చూస్తుంటాం. డిజిటల్‌ యుగంలో తమ ఉనికిని చాటుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎంచుకునే అంశాలు మరింత సున్నితంగా, తోటి వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. 

సహాయం కోసం వీరిని సంప్రదించవచ్చు 
రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా, సమాజంలో తమ గౌరవం దెబ్బతింటుందని, ఇతరులు తమను వేధింపులకు లోను చేస్తున్నారని అవి సమస్యగా తమ జీవనానికి అడ్డంకిగా ఉందనుకుంటే... 
1. చట్టపరమైన రక్షణ కోసం 100కి కాల్‌ చేసి, పోలీసుల సాయం పొందవచ్చు.
2. జాతీయ/రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అనేది జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. మానవ హక్కుల ఉల్లంఘనలను ఈ సంస్థ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. ఎల్‌జిబిటిక్యూ+ వ్యక్తులైన వారు తమకు తగిన సహాయం కావాలంటే వీరిని సంప్రదించవచ్చు. 
3. మహిళల కోసం జాతీయ /రాష్ట్ర కమిషన్‌: నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) అనేది లైంగిక నేరాలు, గృహహింస, వేధింపులు .. మొదలైన వాటి నుంచి మహిళల రక్షణలో పనిచేసే జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. ఈ ఎన్‌సీడబ్ల్యూ కూడా తగిన సహాయం చేస్తుంది. 
4. ఆన్‌లైన్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ (ఆన్‌లైన్‌లో చేసిన వేధింపుల కింద) https://www.cybercrime.gov.in లోనూ రిపోర్ట్‌ చేయవచ్చు. 
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

ఎవరికి రిపోర్ట్‌ చేయాలి?
సామాజిక మాధ్యమాల ద్వారా తమ గౌరవానికి భంగం కలిగించే అంశాలు ఉంటే రిపోర్ట్‌ చేయాల్సింది.. 
ఫేస్‌బుక్‌ ..
 https://www.facebook.com/help/ 116326365118751 

ట్విటర్‌ ...
https://help.twitter.com/en/safety-and-security/report-abusive-behavior 

ఇన్‌స్టాగ్రామ్‌–యూట్యూబ్‌
https://help.instagram.com/547601325292351

https://support.google.com/youtube/answer/2801939#protected_group 

లింక్డ్‌ఇన్‌: 
https://www.linkedin.com/help/linkedin/answer/a1336329/report-harassment-or-a-safety-concern?lang=en
పైన ఇచ్చిన సోషల్‌మీడియా లింక్స్‌ ద్వారా ఆయా విభాగాలకు రిపోర్ట్‌ చేయవచ్చు. దానిపైన ఆ మాధ్యమాలు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 
ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌.

చదవండి: Beaumont Children Missing Case: ఆస్ట్రేలియా చరిత్రలో అపఖ్యాతి.. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు?

మరిన్ని వార్తలు