ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్‌ ఇచ్చారంటే ఇక అంతే! ఊహించని రీతిలో నష్టం!

7 Apr, 2022 13:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్పామ్‌తో .. స్కామ్‌ 

Cyber Crime Prevention Tips- మెయిల్‌ ఓపెన్‌ చేయగానే కొన్ని స్పామ్‌ మెయిల్స్‌ మనకు కనిపిస్తాయి. డిస్కౌంట్‌ అనో, బ్యాంక్‌ సిబిల్‌ స్కోర్‌ ఫ్రీ అనో, మరేవో ఆఫర్లు అనో.. ఇ– మెయిల్స్‌ ఊరిస్తుంటాయి. ఇవన్నీ వ్యాపార సంబంధమైనవిగా ఉంటాయి. పది మిలియన్‌ స్పామ్‌ మెయిల్స్‌ పంపడానికి కూడా పది పోస్టల్‌ సందేశాలు పంపడానికి అయ్యేంత ఖర్చు మాత్రమే అవుతుంది.

దీంతో వ్యాపార సందేశాలు దాదాపుగా స్పామ్‌ మెయిల్స్‌ను ఎంచుకుంటుంటాయి. వీటికి ఆకర్షితులై, ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్‌ ఇచ్చారంటే మిమ్మల్ని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. స్పామ్‌ మెయిల్స్‌తో మీరే స్కామ్‌లో ఇరుక్కోవచ్చు.  

స్పామ్‌ నుంచి ప్రమాదం 
భారత జాతీయ న్యాయ చట్టంలో స్పామ్‌ గురించిన ప్రస్తావన లేదు. దీంతో వాక్‌స్వేచ్ఛను రక్షించాలనే విషయంలో, చట్టపరమైన పరిష్కారాలను అమలు చేయడంలో ఇది మరింత కష్టంగా మారుతోంది. అందుకే, మనమే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.  

ట్రోజన్‌ హార్స్‌: వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయి. నకిలీ లింక్‌లు, డౌన్‌లోడ్స్‌లో మారువేషంలో ఉండి తమ మోసపూరిత పనిని చక్కబెడుతుంటారు.  
జాంబీస్‌: మీ వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ ఇతర కంప్యూటర్లను స్పామ్‌ చేసే సర్వర్‌గా మార్చేసుకుంటారు.  
ఫిషింగ్‌ : మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఫలితంగా గోప్యత, కీర్తి, డబ్బు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మధ్యవయస్కులు, రిటైర్మెంట్‌ బాధితులు ఎక్కువ ఉంటున్నారు.  
ఇంటర్నెట్‌ స్కామ్‌లు: మీరు కొంత బహుమతి రూపంలోనో, ఉద్యోగం, వివాహం, ప్రేమ.. గెలుచుకున్నట్లు ఇ–కామర్స్‌ చూపుతుంటాయి. 

తెలుసుకోవడం సులువు 
స్పామ్‌ మెయిల్స్‌ లేదా ఎస్సెమ్మెస్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తుంటాయి. దీనిని బట్టి అది నకిలీ మెయిల్‌ అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సాధారణంగా చిరునామా, ఆధార్‌ కార్డ్‌ నంబర్, పాన్‌ కార్డ్‌ నంబర్‌ లేదా బ్యాంకింగ్‌ సంబంధిత సమాచారం వంటి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలేవీ ఇవ్వకూడదు.  
అనుమానాస్పద డొమైన్‌ పేరుతో అసాధారణమైన అక్షరాలను ఉపయోగిస్తారు.  
అనేక నకిలీ ఇ–మెయిల్‌లు ప్రభుత్వ అధికారులు, బ్యాంకింగ్‌ అధికారులు లేదా చట్టబద్ధమైన కంపెనీల నుండి, వ్యక్తుల నుండి వచ్చినట్టు చూపుతాయి.. 
మెసేజ్‌ సబ్జెక్ట్‌ లైన్‌న్లో‌ ‘అత్యవసరం‘, ‘ప్రత్యుత్తరం‘, ‘అవకాశం‘, ‘తక్షణం‘, ‘ముగింపు తేదీ‘.. వంటి పదాలు ఇ–మెయిల్‌లో ప్రధానాంశాలుంగా ఉంటాయి. 
స్పామ్‌ ఇ–మెయిల్‌లో అక్షరదోషాలు ఉంటాయి. చాలా నకిలీ ఇ–మెయిల్‌లు ప్రాథమిక అక్షరదోషాలు, పేరు తప్పుగా రాయడం, పేలవమైన వ్యాకరణంతో ఉంటాయి.  
మోసపూరిత ఇ–మెయిల్‌ చిరునామా  తెలిసినవారి ఇ–మెయిల్‌ చిరునామాకు చాలా దగ్గరి పోలిక ఉంటుంది. 

స్పామ్‌ అని గుర్తించడానికి.. 
అన్ని రకాల మెయిల్స్, అనేక ఇతర వ్యాపార ఇ–మెయిల్‌ కార్యకలాపాలు అంతర్నిర్మిత అల్గారిథమ్‌లను కలిగి ఉంటాయి. ఇవి స్పామ్, జంక్‌ మెయిల్‌లను స్పామ్‌ ఫోల్డర్‌లోకి తరలిస్తే ఫిల్టర్‌ అవుతాయి. మీ మెయిల్‌లో స్పామ్‌ ఇ–మెయిల్‌లు పుష్కలంగా వస్తున్నట్లు చూసినట్లయితే, మీరు వాటిని పై విధంగా ఫిల్టర్‌ ద్వారా వదిలించుకోవచ్చు. 
జిమెయిల్‌ స్పామ్‌ని క్లిక్‌ చేసి, ఆ ఫోల్డర్‌లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించండి. ఎఝ్చజీ∙కూడా అనుమానాస్పద ఇ–మెయిల్స్‌ను గుర్తిస్తుంది. స్పామ్‌ హెచ్చరిక లేబుల్‌లను రెడ్‌ మార్క్‌లో ఉంచుతుంది 
 ఆపిల్‌ మెయిల్‌ రిపోర్ట్‌ స్పామ్‌లో ’గీ’ గుర్తు ఉన్న ట్రాష్‌ క్యాన్‌ (జంక్‌ మెయిల్‌) చిహ్నంపై క్లిక్‌ చేయాలి.  
యాహూ మెయిల్‌ స్పామ్‌ ఫోల్డర్‌లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించాలి. అప్పుడు యాహూ అనుమానాస్పద ఇ–మెయిల్‌లను గుర్తిస్తుంది. ఆ ఇ–మెయిల్‌లను డిఫాల్ట్‌ స్పామ్‌ ఫోల్డర్‌లో ఉంచుతుంది. 
 మైక్రోసాఫ్ట్‌ ఔట్‌లుక్‌ ఇ–మెయిల్‌కు ముందు చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేసి, మెనూలోని జంక్‌ ఇ–మెయిల్‌ ఎంపికలపై క్లిక్‌ చేయాలి.   
మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.. 
మెయిల్‌ అకౌంట్‌కు కనెక్ట్‌ చేసిన ఫొటోలు, ఈవెంట్ల వివరాలు, ఇతర ఇ–మెయిల్‌ చిరునామాలు భద్రంగా ఉండటానికి భద్రతను చెక్‌ చేసుకోవాలి. మీ ఎంపికల ఆధారంగా ఫీచర్‌లను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయడానికి టాగిల్‌ స్విచ్‌లను అడ్జస్ట్‌ చేయాలి. వ్యక్తిగత సమాచారం, గోప్యతా సెట్టింగ్‌లను కూడా తనిఖీ చేయాలి. 
అకౌంట్‌ సురక్షితంగా ఉండటానికి యాప్‌ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవడంతో పాటు అవసరం లేనప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంచాలి.  
కంప్యూటర్‌ భద్రతా పద్ధతులను అమలు చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ కంప్యూటర్‌ను ఉపయోగించనప్పుడు ఇంటర్నెట్‌ నుండి డిస్‌కనెక్ట్‌ (లాగ్‌ ఆఫ్‌) చేయండి. 
ఏవైనా అనవసర లింక్‌లను ఓపెన్‌ చేయడం, మెయిల్‌ ద్వారా వచ్చిన ఫైల్‌లు లేదా లింక్‌లను డౌన్‌లోడ్‌ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అలాంటి మెయిల్స్‌ను ఓపెన్‌ చేయకపోవడమే శ్రేయస్కరం.   
అత్యంత విశ్వసనీయత గలవాటి నుంచే ఉచిత సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. ఉచిత సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే గేమ్‌లు, ఫైల్‌ షేరింగ్, స్కానర్లు ప్రోగ్రామ్‌లు, ఇతర అనుకూల ఉచిత వ్యాపార అప్లికేషన్‌లు .. మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.  
అవసరం లేని వాటిని ఇ మెయిల్‌ నుండి తీసివేయండి. ఎందుకంటే స్పామ్‌ మెయిల్స్‌ మధ్యలో మీరు మీ అతి ముఖ్యమైన ఇ–మెయిల్‌ను కోల్పోయే అవకాశం ఉంది.   
-అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

మరిన్ని వార్తలు