Cyber Crime: కేవైసీ అప్‌డేట్‌ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో.. అం‍తే ఇక!

27 Oct, 2022 14:11 IST|Sakshi

కేవైసీ అప్‌డేట్‌ చేస్తున్నారా?!

బ్యాంక్‌/ ఆధార్‌ కార్డ్‌ /పాన్‌కార్డ్‌ల కేవైసీ అప్‌డేట్‌ చేయమంటూ మన ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. లేదంటే, ఆ ఖాతాలు క్లోజ్‌ అవుతాయంటూ ఆ మెసేజ్‌ సూచిస్తుంటుంది. దీంతో అది నిజమే అని నమ్మి ఆ లింక్‌పై క్లిక్‌ చేసి, మన వివరాలను ఫిల్‌ చేస్తుంటాం.

ఇటీవల కేవైసీ అప్‌డేట్‌ అనే మెసేజ్‌ల లింక్స్‌ వల్ల చాలా మంది ఆర్థికంగా మోసపోతున్నట్టు సైబర్‌ నివేదికలు చూపుతున్నాయి. కేవైసీతో పాటు క్యాష్‌బ్యాక్, క్రెడిట్‌కార్డ్‌ రివార్డ్‌ పాయింట్ల గడువు ముగిసిందని, వివరాలను ఇవ్వమంటూ మోసగాళ్లు మెసేజ్‌ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు.  

దేశం మొత్తం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతోందన్న విషయం మనకు తెలిసిందే. UPI అనేది డిజిటల్‌గా చెల్లింపులు చేయడానికి వేగవంతమైన పద్ధతిగా అపారమైన ప్రజాదరణను పొందుతోంది. వినియోగదారుడు నగదు/ చెక్కు చెల్లించడానికి మాత్రమే కాదు ఇతరత్రా బ్యాంక్‌ లావాదేవీలకు ఇంటర్నెట్‌ ద్వారా లాగిన్‌ అవడం అన్ని విధాలుగా సమయాన్ని ఆదా చేయడమే ఈ వేగానికి కారణమైంది.

అయితే, సౌలభ్యం ఎప్పుడైనా దానికి సంబంధించిన బాధ్యతల వాటాతో వస్తుందన్నది నిజాన్నిగుర్తించాలి. అప్పుడే జరిగే అనర్థాలకు అడ్డుకట్ట వేయగలం. UPI యాప్‌లు అంటే గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌లు నగదు లావాదేవీలలో పటిష్టమైనవి, సాంకేతికంగా అత్యంత సురక్షితమైనవిగా పేరొందాయి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్, ఐఎమ్‌ క్లోన్, ఇతర మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి స్కామర్‌లు సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహాలతో దాడి చేస్తున్నారు, జాగ్రత్త వహించండి. 

మోసాలు పలు విధాలు.. 
బ్యాంక్‌/ఆధార్‌ కార్డ్‌/ పాన్‌ కార్డ్‌.. KYCని అప్‌డేట్‌ చేయమని వినియోగదారులను కోరుతూ సంక్షిప్త లింక్‌లతో కూడిన ఇ–మెయిల్‌ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌ ఎవరికైనా రావచ్చు. తెలియక ఆ లింక్‌పై క్లిక్‌ చేసి, వివరాలను పూరించవచ్చు. అంతేకాదు, కొందరు బాధితులు OTP వివరాలను కూడా పూరిస్తారు. దీంతో పాటు బాధితుడి అన్ని వివరాలు స్కామర్ల ఫోన్‌కు ఫార్వర్డ్‌ అవుతాయి. తర్వాత వారు బాధితుడి ఖాతా నుండి నగదును సులువుగా బదిలీ చేసుకుంటారు. 

రివార్డ్‌ పాయింట్స్‌
స్కామర్‌లు రీఫండ్‌ / క్యాష్‌ బ్యాక్‌/ క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్ల గడువు ముగియడం, వారి వివరాలను ఇవ్వడం వంటి సమస్యల కోసం వినియోగదారులను సంప్రదించేలా మోసగిస్తారు.

మోసం చేసే విధానం..
1. మోసగాళ్ళు సాధారణంగా తమ దృష్టిని ఆకర్షించడానికి ఫోన్‌ కాల్‌ చేస్తారు. వారు తమను తాము బ్యాంక్‌ ప్రతినిధుల్లా చెప్పుకుంటూ, కేవైసీ అప్‌డేట్‌లు, బోనస్‌ పాయింట్ల రిడెంప్షన్, క్యాష్‌ బ్యాక్‌ల వంటి సాధారణ సమస్య కోసం కాల్‌ చేస్తారు.
2. కాల్‌ని చట్టబద్ధంగా చేయడానికి, వారు అసలైన బ్యాంక్‌ ప్రక్రియను అనుకరిస్తారు. వారు మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్‌ నంబర్‌ వంటి ధృవీకరణ ప్రశ్నలను అడగడం కొనసాగిస్తారు.
3. స్కామర్లు సాధారణంగా ఒక తప్పుడు కథనాన్ని సృష్టిస్తారు. సమస్యను పరిష్కరించడానికి బాధితుడు తమ వ్యక్తిగత డేటాను ఇస్తుంటారు.
4. స్కామర్‌ బాధితుడిని ఒప్పించిన తర్వాత, వారు తమ ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేయమని అడుగుతారు. అవి, ఎనీ డెస్క్‌.. వంటి అత్యంత సాధారణ స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ అయి ఉంటాయి. ఇవి ప్లే స్టోర్‌ / యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

5. AnyDesk లేదా మరేదైనా స్క్రీన్‌ షేరింగ్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత, ఇది  సాధారణ యాప్‌ లాగా వినియోగదారు గోప్యతా అనుమతిని అడుగుతుంది. ఈ యాప్‌లు మీ ఫోన్‌ లోని ప్రతిదానిని యాక్సెస్‌ చేయగలవని దయచేసి గమనించండి.
6. స్కామర్‌లు బాధితుడిని వారి ఫోన్‌ కు వచ్చిన OTP అడుగుతారు. బాధితుడు కోడ్‌ చెబితే ఆ తర్వాత హ్యాకర్‌ ఫోన్‌ నుండి యాక్సెప్ట్‌ చేయమని కూడా అడుగుతాడు.

7. యాప్‌ అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్‌ బాధితుడి ఫోన్‌పై వారికి తెలియకుండానే పూర్తి నియంత్రణను పొందడం ప్రారంభిస్తాడు. మీ ఫోన్‌కు పూర్తి యాక్సెస్‌ పొందిన తర్వాత, స్కామర్‌ పాస్‌వర్డ్‌లను దొంగిలించి, బాధితుడి UPI  ఖాతాతో లావాదేవీలు చేయడం ప్రారంభిస్తాడు. 

8. స్కామర్లు డబ్బును దొంగిలించడానికి ఉపయోగించే ప్రత్యామ్నాయ పద్ధతులు ఇవి..
ఎ) మోసగాళ్లు ఎస్సెమ్మెస్‌ పంపి, దానిని మరొక నంబర్‌కు ఫార్వర్డ్‌ చేయమని బాధితుడిని అడుగుతారు. సందేశం పంపితే UPI ద్వారా బాధితుడి మొబైల్‌ నంబర్‌ లేదా ఖాతాను వారి మొబైల్‌కి లింక్‌ చేయడానికి స్కామర్‌కి యాక్సెస్‌ లభిస్తుంది.  
బి) మోసగాళ్లు గూగుల్‌ ఫారమ్‌లతో ఉన్న ఎసెమ్మెస్‌లను పంపుతారు. వినియోగదారు పేరు / పాస్‌వర్డ్‌ మరియు OTP / UPI వివరాలను పూరించమని అడుగుతారు. 
సి) ప్రత్యామ్నాయంగా గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎమ్‌ మొదలైన యాప్‌లలో స్కామర్‌ (కొనుగోలుదారుల వలె నటించడం) మీ వర్చువల్‌ చెల్లింపు చిరునామాకు (క్యూ ఆర్‌ కోడ్‌) పేమెంట్‌ రిక్వెస్ట్‌ పంపుతాడు. 

స్కామర్ల నుంచి కాపాడుకోవాలంటే... 
1. OTP ఎవరికీ షేర్‌ చేయవద్దు.
2. ఇతరుల నుంచి డబ్బును పొందడానికి మనం OTP చెప్పాల్సిన అవసరం లేదు
3. డబ్బు తీసుకోవడానికి క్యూఆర్‌ కోడ్‌లనూ స్కాన్‌ చేయాల్సిన అవసరం లేదు
4. మీ స్మార్ట్‌ఫోన్‌ లో అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించవద్దు
5. అధికారిక కస్టమర్‌ సర్వీస్‌ నంబర్‌లను మాత్రమే సంప్రదించండి
6. కార్డ్‌ నంబర్, CVV, గడువు తేదీలను ఎప్పుడూ ఎవరికీ షేర్‌ చేయవద్దు 

ఇతర జాగ్రత్తలు
సురక్షితమైన ఆన్‌ లైన్‌ లావాదేవీ కోసం https:// లాక్‌ చిహ్నం కోసం సెర్చ్‌ చేయండి 
కాల్‌లో ఉన్నప్పుడు డబ్బును ఎప్పుడూ బదిలీ చేయవద్దు లేదా పొందవద్దు.
తెలియనివారి నుంచి వచ్చిన మెసేజ్‌లలో షార్ట్‌ లింక్స్‌ ఫారాలని ఎప్పుడూ పూరించవద్దు.
పొరపాటున మోసానికి గురైతే www.cybercrime.gov.in కు రిపోర్ట్‌ చేయచ్చు. 
మోసం జరిగిన గంట లోపల హెల్ప్‌లైన్‌ 1930కి కాంటాక్ట్‌ చేస్తే మీరు జరిపిన లావాదేవీల ఖాతాలను బ్లాక్‌ చేస్తారు. ఆ తర్వాత న్యాయం జరిగే దిశగా అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. 

చదవండి: Cyber Crime Prevention Tips: జాబ్‌ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్‌ ఇన్‌ ప్లాట్‌ఫారమ్‌లో..
Cyber Crime Prevention Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్‌ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు

మరిన్ని వార్తలు