Cyber Crime: ఇదంతా చేసింది కొడుకే అని తెలిసి..

27 May, 2021 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాణీ, రఘురామ్‌ (పేర్లు మార్చడమైనది) దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్థులు. ఇద్దరికీ అయిదంకెల జీతం. ఒక్కగానొక్క కొడుకు. చింతల్లేని చిన్నకుటుంబం. నెలవారీ క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు చూడగానే గుండెల్లో రాయిపడినట్టు అయ్యింది వాణీకి. తనకున్న రెండు ఖాతాల క్రెడిట్, డెబిట్‌ కార్డుల నుంచి ఐదు లక్షల పై చిలుకు బిల్లు చూసేసరికి షాక్‌ అయ్యింది. భర్త రఘురామ్‌కి ఈ విషయం చెప్పింది. సందేహం వచ్చిన రఘురామ్‌ తన క్రెడిట్, డెబిట్‌ కార్డు బిల్లులు చెక్‌ చేశాడు. ఆరు లక్షలపైనే ఖర్చు చేసినట్టుగా తన బ్యాంకు ఖాతాలు చూపించాయి. ఆన్‌లైన్‌లో అకౌంట్‌ తనిఖీ చేస్తే ఏవేవో సైట్లకు డబ్బు బదిలీ చేసినట్టుగా ఉంది. ఇద్దరికీ ఏం చేయాలో అర్ధం కాలేదు. తమ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని మాత్రం అర్థం అయ్యింది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ను సంప్రదించారు. 

ఓటీపీ డెలిట్‌
విషయం తెలిసి వాణీ రఘురామ్‌లు ఆశ్చర్యపోయారు. స్మార్ట్‌ఫోన్‌ తమ జీవితాల్లో నింపుతున్న అల్లకల్లోలాన్ని తెలుసుకున్నారు. వాణీ రఘురామ్‌ల ఏకైక పుత్రుడు విక్రాంత్‌ (పేరుమార్చడమైనది) టెన్త్‌ క్లాసు చదువుతున్నాడు. వీడియో గేమ్స్‌ అంటే పిచ్చి. తమ ఫోన్లలో గేమ్స్‌ ఆడుతుంటే విసుగనిపించి, కొడుక్కి ఓ స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చారు. ప్రతీనెలా పాకెట్‌ మనీ కింద కొడుకుకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేవారు. విక్రాంత్‌ ఆ డబ్బు పెట్టి, ఆన్‌లైమ్‌ గేమ్స్‌ కొనుగోలు చేసి మరీ ఆడుతుండేవాడు. వాణీ జాబ్‌ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆర్నెల్లుగా ఇంటి వద్దే ఉంటోంది. కొడుక్కి పాకెట్‌ మనీ ఇవ్వడం తగ్గించింది. ఏమైనా ఫుడ్‌ కావాలంటే ఇంటి వద్దే చేసి పెడుతున్నాను కదా! అనేది.

దీంతో తల్లితండ్రుల నుంచి మనీ ఎలా దొంగిలించాలా అని రకరకాల ప్రయత్నించాడు. నగదు కాకుండా తనకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ అవసరం. అందుకు తల్లి, తండ్రి బ్యాంక్‌ కార్డులపై నెంబర్లు నోట్‌ చేసుకున్నాడు. వారికి తెలియకుండా వారి అకౌంట్‌ నుంచి, తనకు కావల్సిన సైట్ల నుంచి గేమ్స్‌ కొనుగోలు చేసి, ఆడటం మొదలుపెట్టాడు. బ్యాంకు నుంచి ఓటీపీ వచ్చే సమయంలో ఫ్రెండ్స్‌తో మాట్లాడాలనో, మరో అబద్ధమో చెప్పి ఫోన్‌ తీసుకునేవాడు. మనీ ట్రాన్సాక్షన్‌ అయిన తర్వాత ఆ వివరాలను వెంటనే డిలీట్‌ చేసేవాడు. మొదట్లో తక్కువ మొత్తంలో జరిగిన ట్రాన్సాక్షన్స్‌ గురించి పట్టించుకోని వాణీ, రఘురామ్‌లు ఆ తర్వాత నెలల్లో పెద్ద మొత్తంలో తేడా రావడంతో అకౌంట్స్‌ హ్యాక్‌  అయినట్టు గుర్తించారు.

ఇదంతా చేసింది కొడుకే అని తెలిసి
అయితే ఆ పని చేసింది తమ కొడుకే అని నిపుణుల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయారు. గేమింగ్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి ఎంతగా ఎడిక్ట్‌ అయ్యాడో తెలుసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించి, నిపుణుల కౌన్సెలింగ్‌తో కొడుకులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం (డిఎస్‌ఎమ్‌) డయాగ్నోస్టిక్‌ – స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ ఆఫ్‌ మెంటల్‌ డిజార్డర్స్‌ జాబితాలో చేర్చలేదు. కానీ, మానసిక నిపుణులు మాత్రం దీనిని జూదం, మాదకద్రవ్య వ్యసనాలతో పోల్చారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక పరిశోధన లో స్మార్ట్‌ఫోన్‌కి ఎడిక్ట్‌ అయినవారిలో ఏదో కోల్పోతున్నామనే భయం, ఆందోళన, అసంతృప్తి, సామాజిక ఆందోళన, ఒత్తిడి వంటివి అధికంగా ఉంటాయని స్పష్టం అయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్‌ ను అధికంగా వాడే పిల్లలను గమనింపుతో గైడెన్స్‌ చేయడం అవసరం. 

వ్యసనం వైపుగా అడుగులు
సౌలభ్యం, ఉపయోగం, రకరకాల ఆసక్తుల కారణంగా స్మార్ట్‌ఫోన్‌ మనపై ఆధిపత్యం వహిస్తున్నాయన్నది తెలిసిందే. వేలి కొసలతో చేసే పదే పదే ‘క్లిక్‌’ లు వ్యసనం వైపు మరుల్చుతున్నాయి. ఇటీవల మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యులు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం గురించి పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ వ్యసనం ఎంత దూరం వెళుతుందంటే తెలియకుండానే నేరం వైపుగా అడుగులు వేయిస్తుంది. విక్రాంత్‌ను గేమింగ్‌ యాప్స్‌ ఇలాగే ఆకర్షించాయి. తల్లీతండ్రీ తనకు ఇచ్చే పాకెట్‌మనీ సరిపోకపోవడంతో తనే ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా ఆదాయాన్ని పొందాలనుకున్నాడు.

అందుకు ఆన్‌లైన్‌ గేమింగ్స్‌ ఇచ్చే పాయింట్స్‌ ద్వారా అయితే డబ్బును సులువుగా రాబట్టచ్చు అనుకున్నాడు. మొదట్లో గేమింగ్‌ యాప్స్‌ వినియోగదారుడికి ఎక్కువ పాయింట్స్‌ ఇచ్చి, ఆకర్షిస్తాయి. దాంతో స్కూల్, కాలేజీ స్టూడెంట్స్‌ గంటల కొద్దీ గేమింగ్‌ చేస్తూనే ఉంటారు. ఎక్కువ పాయింట్స్‌ పొందాంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో ఆ డబ్బును ఎక్కడి నుంచి రాబట్టాలా అని దారులు వెతుకుతారు. 

పిల్లలు వారి మానాన వారు ఫోన్లో ఉన్నారు కదా అనో, వీడియో గేమ్స్‌ ఆడుకుంటున్నారు కదా అనో పర్యవేక్షణలో లోపం జరిగితే చివరికి కోలుకోలేనంత అనర్థాలు తలెత్తుతుతాయి. విక్రాంత్‌ లాంటి పిల్లలు మన మధ్యే ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్యం. డబ్బు ఒక్కటే కాదు అధికంగా వాడితే మానసిక, శారీరక స్థితిలోనూ గణనీయమైన హానిని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ కలిగిస్తుంది. ముందే గుర్తించి కట్టడి చేయడం మేలు చేస్తుంది.  

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌  

చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను

మరిన్ని వార్తలు