Cybercrime Prevention Tips: కొత్త సంవత్సరంలో.. కొత్త డిజిటల్‌ తీర్మానాలు

29 Dec, 2022 11:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒక్క క్లిక్‌తో ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్‌ ఎన్నో అద్భుతాలను పరిచయం చేయడమే కాదు. మరెన్నో అననుకూలతలనూ కలిగిస్తోంది. స్మార్ట్‌ స్క్రీన్‌ కంటికి, మెదడుకు హాని కలిగించడమే కాదు. డిజిటల్‌ మోసాలతో జేబుకు చిల్లు పడేస్తుంది.

కొత్త పరిచయాలతో స్నేహాలు వర్ధిల్లుతాయనుకుంటే ఏమరుపాటులో పరువు నెట్టింటికి చేరుతుంది. రాబోయే కొత్త సంవత్సరం, కొత్త జోష్‌లో డిజిటల్‌ ప్రపంచానికి సంబంధించి కొన్ని కచ్చితమైన తీర్మానాలు తీసుకోవాల్సిందే!

చదువు, పని లేదా వ్యాపారంలో రాణించడమే మీ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి అయితే, మీ వాస్తవ తీర్మానాలపై దృష్టి కేంద్రీకరించడానికి డిజిటల్, సోషల్‌ మీడియా డిటాక్స్‌కి ఇది సరైన సమయం.

అంతేకాదు లోన్‌ యాప్‌లంటూ దోపిడీ, కస్టమర్‌ కేర్‌ అంటూ ఎర, ఓటీపీ చెప్పమనో, స్క్రీన్‌ షేర్‌ చేయమనో, క్యూ ఆర్‌ కోడ్‌ తోనో, వీడియో గేమ్స్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటూనో.. డిజిటల్‌ మోసగాళ్ల ఎత్తులకు అడ్డుకట్ట వేయాలన్నా, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండాలన్నాఎంతో సమాచారం మీ కోసం సిద్ధంగా ఉంది. 

డిజిటల్‌ బ్రేక్‌... 
స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక దాని వల్ల పొందే సౌలభ్యం కారణంగా మన జీవితాలు, ఆసక్తులపై అది ఆధిపత్యం చలాయిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ వాడకంలోని ప్రతికూల అంశాలు మనస్తత్వవేత్తలు, వైద్యులు, సామాజిక సంస్థల దృష్టికి వచ్చాయి. వ్యక్తులలో మూడింట రెండు వంతుల మంది స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదని వివిధ దేశాల నుండి ఇప్పటికే ఉన్న నివేదికలు తెలియజేస్తున్నాయి.

డిజిటల్‌ బ్రేక్‌ తీసుకున్నప్పుడు చాలామందిలో మంచి ప్రయోజనాలు కనిపించాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది, తప్పిపోతామేమో అనే భయాన్ని తగ్గిస్తుంది, నిద్ర అలవాట్లను మెరుగుపరుస్తుంది, పని, జీవన సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మరింత సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తుంది. 

డిజిటల్‌ డీటాక్స్‌ కోసం...
మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ల‌ను నిలిపివేయండి. దీని వల్ల మీకు ఏ నోటిఫికేషన్‌ అవసరమో, ఏది అనవసరమో తెలిసి వస్తుంది. 
మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్‌ఫోన్‌ రహిత జోన్‌గా మార్చండి. మీరు బెడ్‌రూమ్‌ బయట మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్‌ చేయాలనే నిర్ణయాన్ని కచ్చితంగా పాటించండి. 
స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ నుండి సోషల్‌ మీడియాను యాక్సెస్‌ చేయండి. దీని వల్ల మీరు సోషల్‌ మీడియా షెడ్యూల్‌ను సెట్‌ చేసుకోవచ్చు. 

మీ హోమ్‌ స్క్రీన్‌ను నియంత్రించండి. స్టోరేజ్‌ స్పేస్‌ను సెట్‌ చేయడంతో పాటు హోమ్‌ స్క్రీన్‌ పై ముఖ్యమైన యాప్‌లు మాత్రమే ఉండేలా చూసుకోండి. అంతగా అవసరం లేనివి, ఇతర యాప్‌లను ఫోల్డర్‌లలో సెట్‌ చేయండి. 
కుటుంబసభ్యులు, బంధు, మిత్రులతో డిజిటల్‌ పరికరాలు లేని చర్చల్లో పాల్గొనండి. 

స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ రంగురంగులతో కాకుండా గ్రేస్కేల్‌ మోడ్‌ని ఉపయోగించండి. 
ఆండ్రాయిడ్‌లో డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ యాప్, ఐఓఎస్‌ లో స్క్రీన్‌ టైమ్‌ యాప్‌తో ప్రతిరోజూ స్క్రీన్‌ ల ముందు ఎన్ని గంటలు గడుపుతున్నారో ట్రాక్‌ చేయచ్చు. 

కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకున్న తర్వాత, మీరు మీ స్క్రీన్‌ సమయాన్ని, డిజిటల్‌ శ్రేయస్సును కూడా పరిమితం చేయాలి. మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్‌మీడియా యాప్‌లను స్క్రోల్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ సెట్టింగ్‌ మీకు తెలియజేస్తుంది.

20 నిమిషాల పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల నుండి విరామం తీసుకోండి. ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడండి. లేదంటే.. (ఎ) నొప్పి, అసౌకర్యం పెరుగుతాయి. (బి) కళ్ళు మంట, దురద మొదలవుతాయి. (సి) కంటి చూపు తగ్గుతుంది. (డి) కంటి అలసట (ఇ) కంటి ఒత్తిడి తలనొప్పికి కారణమవుతుంది.

డిజిటల్‌ భద్రత...
మీ పెంపుడు జంతువుల పేర్లు, ఇంటిపేర్లు పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవద్దు. పాస్‌వర్డ్‌లు ఎప్పుడూ కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక అంకె, ఒక ప్రత్యేక అక్షరాన్ని కలిగి ఉండాలి. దీని వల్ల డిజిటల్‌ ఫ్రాడ్స్‌కి పాస్‌వర్డ్‌ అంచనా కష్టమవుతుంది.

సోషల్‌ మీడియా వాయిస్‌ లేని వారికి వాయిస్‌ ఇస్తుండగా, ఒక నిఘా సమాజం కూడా ఉంటుంది. దీనిలో వాయిస్‌లెస్‌గా మారడం మనుగడకు తెలివైన మార్గం.
సురక్షిత వెబ్‌సైట్‌లకు యాక్సెస్‌ పరిమితి ((htt-ps://) URL మొదట్లో HTTPS   అని ఉంటే, మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం.
కంపెనీలు తమ వ్యాపార ప్రకటనల ప్రచారాలు, ఉత్పత్తులు, సేవలకు తగిన సమాచారాన్ని అందించడానికి మన అలవాట్లు, ప్రాధాన్యతలు, ఎంపికలు, ప్లేస్‌.. వీటన్నింటినీ మన ఫోన్, ఇతర డిజిటల్‌ పరికరాల నుండి GPS ద్వారా ట్రాక్‌ చేస్తాయి. చివరికి భాగస్వామ్యం చేస్తాయి. దీని వల్ల మన అనుమతి లేకుండానే థర్డ్‌ పార్టీకి ఈ సమాచారం చేరుతుంది. 

మీ ముఖ్యమైన డేటా సాధారణ బ్యాకప్‌ ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ చేయలేదని నిర్ధారించుకోండి. 
ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్‌ టెక్ట్స్‌ మెసేజ్‌లు లింక్‌పై క్లిక్‌ చేయడం లేదా అటాచ్‌మెంట్‌ను తెరవడం కోసం మిమ్మల్ని మోసగించడానికి తరచుగా ఏదో ఒక స్టోరీ చెబుతాయి. ఇమెయిల్‌/ సోషల్‌ మీడియా, వాట్సప్‌ లేదా ఎసెమ్మెస్‌ ద్వారా వచ్చిన చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్‌ చేయవద్దు. వాటిని క్లిక్‌ చేయడానికి ముందు ఫిషింగ్‌ (https: //isitphishing.org/)  కోసం తనిఖీ చేయండి.

మీ డిజిటల్‌ పరికరంలో డేటాను రక్షించడంలో ఫైర్‌వాల్‌ సహాయం చేసినట్లే, ఆన్లై‌న్‌ నెట్‌వర్క్‌లలో VPN  రక్షిస్తుంది.
రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించడం మంచిది. మన గుర్తింపుకు రెండు పద్ధతుల ద్వారా యాక్సెస్‌ ఉండేలా చూసుకుంటే భద్రత బలోపేతమవుతుంది.
ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

మరిన్ని వార్తలు