Dairy Rich Diet: గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు​ ఇవే...

27 Sep, 2021 12:04 IST|Sakshi

పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నివసించే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా గమనించారా? వీరు కల్తీలేని స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు కాబట్టి. సంపూర్ణ లేదా సమతుల్య ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైనవి. ఐతే చాలా మందికి పాలు, పాల ఆధారిత పదార్థాలు తినే అలవాటు అస్సలుండదు. హృద్యోగ సమస్యలకు దారీతీసే కొవ్వులు, కొలెస్ట్రాల్లు పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయనేది వీరి బలమైన నమ్మకం. కానీ వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

తాజా పరిశోధనల్లో కూడా తేలిందేమిటంటే పాల ఉత్పత్తులు గుండెను రక్షించడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయని ధ్రువీకరించాయి. కొంత మంది వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా పాలను నేరుగా తీసుకోలేరు. అలాంటప్పుడు ఇతర మార్గాల ద్వారా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ కింది సూచించిన 5 రకాల పాల ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం..

పన్నీర్‌
భారతీయుల ఆహారంలో పన్నీర్‌ చాలా ప్రసిద్ధమైనది. కూరగా వండుకున్నా లేదా ఇతర ఏ పద్ధతుల్లో వండినా రుచితో పాటు పోషకాలు అందుతాయి. దీనిలో కాల్షియం, విటమిన్‌ బి, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. ఎముకల పుష్టికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీ హార్మొన్ల ఆరోగ్యానికి అవసరమైన మాగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు తగుమోతాదులో అందేలా చేస్తుంది.

పెరుగు
హృదయ ఆరోగ్యానికి, ఎముకల దృడత్వానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో ప్రొబయోటిక్స్‌ పుష్కలంగా ఉంటాయి. కడుపులోని పేగుల్లో ఆరోగ్య సహాయక సూక్ష్మజీవుల (బ్యాక్టీరియా) వృద్ధికి ఇది చాలా అవసరం. మన శరీరంలోని జీర్ణక్రియ, ఇతర జీవక్రియలకు కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

పాలకోవ
స్వీట్లలో పాలకోవ స్థానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే స్వీట్‌ ఇది. పాలను బాగా చిక్కబడేంత వరకూ వేడిచేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దీనిలో ‘డి, బి, కె’ విటమిన్లు, కార్బొహైడ్రేట్స్‌తోపాటు, పాస్పరస్‌ వంటి మినరల్స్‌ కూడా అధికంగా ఉంటాయి. 

మజ్జిగ
ప్రొటీన్లు, విటమిన్‌ ‘ఎ, బి’లు, కాల్షియం, పొటాషియం, రైబోఫేవిన్‌, ప్రొబయోటిక్స్‌ నిండుగా ఉంటాయి. ప్రాచీన కాలం నుంచే ధనిక పేద భేదం లేకుండా మన భారతీయుల ఆహారపు అలవాట్లలో మజ్జిగ మిలితమైఉంది.

నెయ్యి
రోజువారీ ఆహారంలో నెయ్యి కూడా ముఖ్యమైనదే. ఇది ఎముక ఖనిజ సాంద్రతలో నష్టాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఇది  జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి.

ఈ ఐదు మార్గాల ద్వారా పాల సంబంధిత ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాన్ని మీరే తెలుసుకుంటారు! పలు పరిశోధనలు కూడా ఈ విషయానే దృవీకరించాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే తినండి, ఆరోగ్యంగా ఉండండి!!

చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!!

మరిన్ని వార్తలు