యాకమ్మ ఒక గొప్ప వెలుగు

30 Nov, 2022 00:44 IST|Sakshi

తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్‌ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని.
ఇంటర్‌లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్‌డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం.

‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ.

ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్‌ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్‌.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్‌.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న.

యాకమ్మది వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్‌ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్‌కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని.

మంచినీళ్లు తాగి
పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్‌బెల్‌లో స్నేహితురాళ్లు లంచ్‌ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు.

తెలుగులో పీహెచ్‌డీ
యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్‌.డి. చేసింది. తెలుగు పండిట్‌గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్‌ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు.

యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్‌ చేస్తోంది. కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ.
ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు.

రెండు సంపుటాలు
యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్‌ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత.

– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు