Dandruff Tips: చుండ్రు సమస్యా.. ‘వేప’తో ఇలా చెక్‌ పెట్టొచ్చు!

8 Sep, 2021 11:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Home Remedies For Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? వేపతో చుండ్రు సమస్యను అరికట్టవచ్చని మీకు తెలుసా!! నిజానికి చుండ్రు నివారణకు వేపకంటే ​కంటే శ్రేష్ఠమైన, సౌకర్యవంతమైన రెమిడీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో! ట్రైకాలజిస్టులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. చుండ్రు నివారించి, అందమైన సిల్కీ హెయిర్‌ పొందడంలో వేప ఆకుల పాత్ర ఏమిటో, అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం..

చుండ్రుతో తంటాలెన్నో..
తలపై చర్మం పొడి (డ్రై స్కిన్‌)గా ఉండే వారిలో సాధారణంగా కనిపించే సమస్య చుండ్రు. భుజాలపై పొలుసులుగా రాలి చూపరులకే కాకుండా మనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చుండ్రు కేవలం తలపై చర్మాన్ని మాత్రమే కాకుండా, ముఖం, శరీరం అంతటిపై కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చుండ్రుకు కారంణం పొడి చర్మం అని మీరనుకోవచ్చు.

కానీ నిజానికి ఇది మలస్సేజియా అనే శిలింధ్రాల జాతికి చెందిన ఫంగస్‌ కారణంగా చర్మంపై పుడుతుంది. దీని జీవితకాల పరిమితి అతిస్వల్పమైనప్పటికీ వేగంగా పెరగడం, విస్తృతంగా వ్యాపించడం దీని ప్రధాన లక్షణాలు.

సాధారణంగా ఈ శిలింధ్రం చలికాలంలో వేగంగా వ్యాపిస్తుంది. అయితే మీరు సరైన సమయంలో, సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే ఎన్నిసార్లు తొలగించినా చుండ్రు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి సమస్యను సకాలంలో గుర్తించి సరైన చికిత్స అనుసరించడం ఉత్తమం.

సుగుణాల వేప
వేప మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే దివ్యౌషధం. ఏ ఋతువులోనైనా  అందుబాటులో ఉంటుంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో వేపకు సాటి మరొకటి లేదు. రక్తశుద్ధీకరణతో పాటు యాంటీ మైక్రోబయల్‌ కారకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్‌ (శిలీంధ్ర సంహారిణి), యాంటీ వైరల్‌ (వైరస్‌ నిరోధకత), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (తాపనివారణ)కు సమర్ధవంతంగా పనిచేస్తుంది. 

ప్రతి ఉదయం వేప ఆకులను తినాలి
బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌, ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. చుండ్రు నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయం గుప్పెడు వేప ఆకులు తినాలి. చేదును తప్పించుకోవడానికి కొంచె తేనె జోడించి తింటే సరి. వేపాకులను మరిగించి కషాయం రూపంలో కూడా తాగవచ్చు. దీనివల్ల కలిగే లాభాలను మీరొకసారి గమనించారంటే, ఈ ప్రక్రియ మరీ అంత కష్టమనిపించదు.

వేప నూనె
వేప నూనెను ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి మరిగించిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చితే వేప నూనె రెడీ! ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం బెటర్‌. నూనెలోని నిమ్మరసం సూర్యరశ్మి వల్ల జుట్టుకు హాని కలగచేయవచ్చు. ఈ నూనెతో మాడుకు మర్ధనాచేసి, రాత్రంతా ఉంచి ఉదయానే తలస్నానం చేస్తే సరిపోతుంది.

వేప - పెరుగు మిశ్రమం
పెరుగుకలిపిన వేపాకును తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్యకు కళ్లెం వేయవచ్చు. ముందుగా వేపాకును పేస్టులా చేసుకుని, ఒక గిన్నె పెరుగులో కలుపుకుని మాడు మొత్తానికి పట్టించి, 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్‌ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును నివారించడమే కాకుండా కుదుళ్లను బలపరచి, మెత్తని సిల్కీ హెయిర్‌ను మీ సొంతం చేస్తుంది. 

వేప హెయిర్‌ మాస్క్‌
డాండ్రఫ్‌ నివారణ పద్ధతుల్లో వేప హెయిర్‌ మాస్క్‌ మరొక సులువైన మార్గం. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను దానికి కలపాలి. దీనిని హెయిర్‌ మాస్క్‌లా మాడు భాగం మొత్తానికి పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. జుట్టు ఆరిపోయాక ఫలితం మీకే తెలుస్తుంది.

హెయిర్‌ కండీషనర్‌లా వేప
వేప ప్రత్యేకత ఏమిటంటే దానిని తలస్నానానికి ముందు లేదా తర్వాత వాడినా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎలాచేయాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వండి. షాంఫుతో తలస్నానం చేశాక, ఈ వేప మిశ్రమంతో తలను కడిగిచూడండి. తేడా మీకే తెలుస్తుంది.

వేప షాంపు
అన్ని రకాల చుండ్రు సమస్యలకు సులభమైన పరిష్కారం వేపషాంపు. వేపతో తయారు చేసిన షాంపుతో వారానికి రెండూ లేదా మూడు సార్లు తలస్నానం చెస్తే సరిపోతుంది. సాధారణంగా డాండ్రఫ్‌ నివారణకు వేపతో తయారుచేసిన షాంపులను వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే చుండ్రు నివారణకు అవసరమైన అన్ని సుగుణాలు వీటిల్లో సరిపడినంతగా ఉంటాయి.

హెయిర్‌ ఎ‍క్స్‌పర్ట్స్‌ చెప్పేదేమిటంటే.. వేపలోని ఔషధ గుణాలు అన్నిరకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఈ 6 రకాల సింపుల్‌ రెమెడీస్‌ తరచుగా వినియోగించడం ద్వారా ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతమవుతుందనేది నిపుణుల మాట.

చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే...

మరిన్ని వార్తలు