Antibiotic Overuse: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!

26 Jun, 2022 09:01 IST|Sakshi

యాంటీబయాటిక్స్‌ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడవచ్చన్న విషయం తెలిసిందే. అయితే...  ఈ యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా, విచక్షణరహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ వాటి దురుపయోగం ఆగడం లేదు. దాంతో తాజాగా ఇప్పుడు ఎంతకూ తగ్గని టైఫాయిడ్‌ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నివేదిస్తున్నారు. ఈ ముప్పును గుర్తెరిగి అప్రమత్తం అయ్యేందుకు ఉపయోగపడే కథనమిది. 

గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్‌  వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులూ / యాంటీబయాటిక్స్‌ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు.   చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు... ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. తాజాగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే క్రిమి కూడా అలా నిరోధకత పెంచుకుంటోందని కొన్ని అధ్యయనాల్లో aతేలింది.  

ఆసియాలో పెరుగుతూ.. అంతర్జాతీయంగా వ్యాప్తి  
టైఫాయిడ్‌ చాలా పురాతనమైన జబ్బు. దాదాపు వెయ్యేళ్ల నుంచి మానవాళిని బాధిస్తోందన్న దాఖలాలున్నాయి. ఇలా చాలాకాలం నుంచి వేధించిన మరోపురాతనమైన జబ్బు టీబీలాగే... టైఫాయిడ్‌ కూడా యాంటీబయాటిక్స్‌ తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనవాళ్లు లేకుండా మటుమాయమైంది. ఇది సాల్మొనెల్లా ఎంటరికా లేదా సాల్మొనెల్లా టైఫీ అనే రకాల క్రిము కారణంగా వ్యాప్తి చెందుతుంది.

మనదేశంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు మనదేశంతో పాటు ఆయా దేశాల్లోని 3,489 రకాల టైఫీ స్ట్రెయిన్ల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను పరిశీలించారు. దాంతో ఇప్పుడు తాజాగా యాంటీబయాటిక్స్‌కు ఓ పట్టాన లొంగని కొత్త స్ట్రెయిన్‌ టైఫాయిడ్‌ జబ్బును కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేలింది. నిపుణులు దీన్ని డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టైఫాయిడ్‌ లేదా ‘ఎక్స్‌డీఆర్‌’టైఫాయిడ్‌గా పేర్కొంటున్నారు.
టైఫాయిడ్‌ కొత్త స్ట్రెయిన్స్‌...  
‘‘ఉత్పరివర్తనం చెందిన ‘ఎక్స్‌డీఆర్‌ టైఫాయిడ్‌’ 2016లో తొలిసారి పాకిస్తాన్‌లో వెలుగుచూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతున్న ఈ ‘ఎక్స్‌ఆర్‌డీ’ టైఫీ స్రెయిన్స్‌ వ్యాప్తి... భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్‌... ఈ నాలుగు ఆసియా దేశాలనుంచే జరుగుతోంది. ఈ సూపర్‌బగ్స్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (బ్రిటన్‌), యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, కెనడాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో ఆందోళనకరం.

అందుకే వీలైనంత త్వరగా ఈ అనర్థానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’’ అని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెంది జేసన్‌ ఆండ్రూస్‌ ప్రపంచానికి  హితవు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు కోటీ 10 లక్షల టైఫాయిడ్‌ కేసులు వస్తుండటం... ప్రస్తుతం ఆ వ్యాధి దాఖలాలే లేని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుండటం... అది మందులకు ఓ పట్టాన లొంగకుండా వ్యాధిగ్రస్తుల్లో 20 శాతం మంది మృత్యువాతపడుతుండటం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే ఓ ఆరోగ్యాంశం అవుతుందని కూడా ఆండ్రూ హెచ్చరిస్తున్నారు.
డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెంచుకుంటున్న మరికొన్ని జబ్బులు 

క్లాస్ట్రీడియమ్‌ డిఫిసైల్‌ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. ఈ క్లాస్ట్రీడియమ్‌ బ్యాక్టిరియా ఇటీవల యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నట్లుగా తెలుసోది. 
గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో చిన్న డోస్‌తో కేవలం మామూలు యాంటీబయాటిక్స్‌ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడవి ఒక పట్టాన తగ్గడం లేదు.
అప్పట్లో ట్యూబర్క్యులోసిస్‌  బ్యాసిల్లస్‌ (టీబీ), క్లెబిసిలియా నిమోనియా, సూడోమొనాస్‌ వంటి సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయేవి. కానీ ఇప్పుడవి మరింత మొండిగా మారాయి. 
ఈ వేసవిలో మామిడిపండ్లు కాస్త ఎక్కువగానే తిన్నప్పుడు కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగగానే కొందరు ఆన్‌కౌంటర్‌ మెడిసిన్‌ వాడుతుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా అవి మర్నాటికల్లా తగ్గిపోతాయి. ఇలా ఆన్‌కౌంటర్‌ మెడిసిన్స్‌ వాడటం వల్ల విరేచనాలే కాదు... మరెన్నో సమస్యలు మొండిగా మారుతున్నాయి. అందుకే ఆన్‌కౌంటర్‌ మెడిసిన్స్‌ను వాడకపోవడమే మంచిది.
అందుబాటులో టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ 
టైఫాయిడ్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. అంతేకాదు... మనదేశంలో పిల్లలందరికీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన (మ్యాండేటరీ) వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ జాబితాలో ఉంది. టీసీవీ వ్యాక్సిన్‌ రూపంలో దీన్ని 9 – 12 నెలల పిల్లలకు ఇస్తుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే... రెండేళ్లు దాటిన పిల్లలకు దీన్ని ఇప్పించడం ద్వారా టైఫాయిడ్‌ నుంచి అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చు.
ఏ జబ్బుకు ఏ యాంటీ బయాటిక్‌... ఏ మోతాదులోనంటే?  
బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్‌ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్‌ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్‌)ను పెంచుకోవచ్చు. అందుకే  డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి.
దురుపయోగం చేయవద్దు...  
మన ప్రాణాలను రక్షించే ఈ యాంటీబయాటిక్స్‌ మందులను అదేపనిగా వాడటం వల్ల లేదా అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడు చేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్‌) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్‌ను దురుపయోగం చేసుకుని, వాటిని నిరుపయోగం చేసుకోకుండా, యాంటీబయాటిక్స్‌ పట్ల  అవగాహన పెంపొందించుకోవాలి.
చదవండిGreen Tea- Weight Loss: గ్రీన్‌ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా?

మరిన్ని వార్తలు