'నాన్నా'.. అని పిలవడమే మానేసింది

2 Oct, 2020 08:12 IST|Sakshi

‘నాన్నా..’ అని పిలవడమే మానేసింది ఆ కూతురు తన తండ్రిని! ఇంట్లోని ముగ్గురు పిల్లల్లో చివరి అమ్మాయి. చివరి అమ్మాయి అంటే మరీ చిన్నమ్మాయి కూడా కాదు. ఇరవై నాలుగేళ్లు. ఒక తండ్రి తన కూతురికి పంచాల్సిన కనీస ప్రేమను కూడా పంచలేదని ఆ అమ్మాయి ఆవేదన. ‘ఆయన్ని నేనెంతో నమ్మాను. ఆయన్నుంచి ఎంతో ఆశించాను. కానీ నా నమ్మకాన్ని, ఆశను ఆయన అస్సలు పట్టించుకోలేదు‘ అని ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. లాక్‌డౌన్‌లో ఆ తండ్రీ కూతుళ్లు లూడో గేమ్‌ ఆడారు. ఆడిన ప్రతిసారీ కూతురు అని కూడా చూడకుండా ఆ తండ్రే గెలిచాడు. కూతురు కోసం కనీసం ఒక్కసారైనా ఆయన ఓడిపోలేదు. ఏ తండ్రయినా ఇలా చేస్తాడా.. అని మొదట ఆమె అలగడం వరకే చేసింది. తర్వాత ముభావంగా ఉండటం మొదలు పెట్టింది. చివరికి తండ్రితో మాట్లాడ్డమే మానేసింది. ఆమెకు కోపం రావడం సహజమే అనిపించేంతగా లూడో గేమ్‌లో ఆయన ఆమె టోకెన్స్‌ని కిల్‌ చేసేవారు.

మిగతా ఇద్దరు పిల్లలు కూడా తండ్రి చేతిలో ఓడిపోయినా ఓటమిని మర్చిపోయారు. ఆమె మాత్రం ఓటమిని గుర్తుపెట్టుకొని తండ్రిపై కోపం పెంచుకుంటూ వచ్చింది. అలా ఫ్యామిలీ కోర్టు దాకా వచ్చింది. ఆమెను బయట కూర్చోబెట్టి ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్‌ సరితారజని తండ్రిని లోనికి పిలిచారు. ‘ఈకాలం పిల్లలు ఓటమిని అస్సలు తట్టుకోలేక పోతున్నారు. మీరు కనీసం ఒకసారైనా తన చేతిలో ఓడిపోవలసింది’ అన్నారు. ఆ తండ్రి తన ఉద్దేశం చెప్పాడు. ‘ఆటలో తండ్రీకూతుళ్లు ఉండరు. ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. కూతురు కోసం తండ్రి ఓడిపోయి ఆమెను గెలిపించడమే ఆమెను నిజంగా ఓడించడం. ఆ ఓటమి కన్నా ఆమెను గెలిపించని ఓటమే ఆమెకు గౌరవం కదా’ అన్నారు. కూతురికి తగ్గ తండ్రి అనుకుని ఉండాలి ఆ  కౌన్సెలింగ్‌ ఆఫీసర్‌.  ఈ తండ్రీకూతుళ్ల సంవాదం భోపాల్‌లో జరుగుతోంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా